రాష్ట్రంలోని విపక్షాలు ఒక ముఠాలాగా ఏర్పడి, పథకం ప్రకారం జగన్ పై విమర్శలు చేస్తున్నారని.. ఆ అజెండాకు అనుగుణంగా తెలంగాణా మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఉద్యోగుల విషయంలో హరీష్ రావు అలా ఎందుకు మాట్లాడారో తెలియదని, ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశం కూడా కాదని…. గతంలో కూడా రెండుమూడు సార్లు ఈరకంగా ఆయన మాట్లాడారని సజ్జల పేర్కొన్నారు. ఎవరి ప్రభుత్వం గురించి వారు ఆలోచించుకోవడం మంచిదని సజ్జల సలహా ఇచ్చారు. అక్కడ ఎవరైనా సామాన్య ప్రజలు ఏదైనా మాట్లాడారంటే అర్ధం ఉంది కానీ మంత్రి స్థాయిలో ఉండి ఇలా మాట్లాడడం సరికాదన్నారు.
వారు తమ సిఎం జగన్ పై మాట్లాడితే మళ్ళీ తాము తిరిగి కేసిఆర్ పై విమర్శలు చేస్తే అయన సంతోషంగా ఉంటారేమో అని ఎద్దేవా చేశారు. తాము ఎప్పుడూ తెలంగాణ సిఎంపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని గుర్తు చేశారు. తెలంగాణాలో విద్యుత్ మీటర్ల విషయంలో సమస్యలుంటే వాళ్ళు చూసుకోవాలని, ఏపీలో మోటార్ల వల్ల ఎలాంటి సమస్యలూ లేవని, మీటర్లు పెట్టడం మంచిదే అని తాము భావించాం కాబట్టి పెట్టామని అన్నారు. హరీష్ రావుకు ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో తెలియదని, రైతులకు మంచి చేయాలన్నదే తమ ఆలోచన అని సజ్జల తేల్చి చెప్పారు.
టెక్నాలజీ పెరిగిపోయి డిజిటల్ యుగం వచ్చిందని… ప్రజల్లోకి వెళ్ళడానికి అనేక రకాలైన మీడియా సాధనాలు ఉపయోగించు కుంటున్నామని, అదే రీతిలో ప్రజల అభిప్రాయం ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకే కన్సల్టెన్సీని నియమించు కున్నామని సజ్జల వివరించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష ద్వారా ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయో సమీక్ష చేసుకున్నామని, పార్టీ నేతలకు పలు సూచనలు జగన్ ఇచ్చారని చెప్పారు. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే దాన్ని కూడా నిర్భయంగా ఒప్పుకొని సరిద్దుకుంటామన్నారు. అందరూ కలిసి బాగా పని చేయాలని సిఎం జగన్ సూచిస్తే ఆయన ప్రసంగాన్ని వక్రీకరించారని అన్నారు.
కేసిఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు పై స్పందిస్తూ తమకు సంబంధించి ఏపీ ముఖ్యమైన క్షేత్రమని, ఇక్కడి ప్రయోజనాలే ముఖ్యమని, ఈ విషయాన్ని ఎన్నోసార్లు స్పష్టంగా చెప్పామన్నారు. తమ గురించి వారికి తెలిసి ఉండే తమను ఎవరూ ఏ ఫ్రంట్ అంటూ ఎవరూ సంప్రదించడం లేదని అన్నారు.
Also Read : ఇక్కడకు వచ్చి చూడాలి: హరీష్ వ్యాఖ్యలపై బొత్స కౌంటర్