Sherni :
గెలవడంలో డ్రామా వుంటుంది. నిలబడడంలో నిజాయితీ వుంటుంది. నిజాయితీకి మించిన హీరోయిజం ఇంకేముంటుంది?
అడవిలో ఆకలికి వేటాడే మృగాలే వుంటాయి.
అడవి చుట్టూ మాత్రం పదవి కోసం వేటాడే కౄరమృగాలుంటాయి.
వినోదం కోసం వేటాడే ఉన్మాదమృగాలుంటాయి.
అధికారం కోసం వేటాడే నీచమృగాలుంటాయి.
వీటన్నిటి మధ్యా ఓ ఆడపులి లాంటి ఆఫీసర్…
అనుక్షణం యుద్ధమే..
అడవికి.. అభివృద్దికిమధ్య యుద్ధం
ఆకలికి.. అన్నానికి మధ్య యుద్ధం
నీతికీ.. నిస్సహాయతకి మధ్య యుద్ధం..
ఈ యుద్ధం మధ్యలో ఓ ఆడపులి..
ఓ లేడీ ఆఫీసర్..
ఆడపులిది ఆకలి..
ఆఫీసర్ ది బాధ్యత.
పులి తిరిగే అడవికి అభివృద్ధి అడ్డొస్తుంది.
నిజాయితీగా పనిచేయాలనుకునే ఆఫీసర్ కి వ్యవస్థ మొత్తం
అడ్డుపడుతుంది.
మనుషుల్ని చంపిందని పులిని బలిచేస్తారు.
వ్యవస్థకి ఎదురుతిరిగిందని ఆఫీసర్ ని బదిలి చేస్తారు.
కథ చెప్పడానికి కథానాయకని ఎంచుకోవడమే ఒక తెలివైన ఎత్తుగడ
హీరోలంటే అంచనాలు వేరే వుంటాయి.
జంతువులతో కలబడాలి..
విలన్లతో తలపడాలి..
ఫైట్లు, స్టంట్లు చాలా చేయలి.
అన్నిటికీ మించి హీరో అంటే గెలిచి తీరాలి.
హీరోయిన్ కి ఆ బ్యాగేజి వుండదు.
కానీ, దానికి మించిన పని చేయాలి.
నిజాయితీగా, నిటారుగా నిలబడాలి
నిలబడినట్టు కనపడాలి.
ఓడిపోతున్నా.. ఒంటరి అయిపోతున్నా..
పోరాడడంలో లోపం లేదని ప్రేక్షకుల్ని కన్విన్స్ చేయాలి.
విద్యాబాలన్ వందశాతం ఆ పని చేసింది.
అడవి మట్టి మీద పులి అడుగులు మిగిలిపోయినట్టు..
వానవెలిసాక కూడా మట్టివాసన గుర్తుండిపోయినట్టు..
సినిమా అయిపోయక కూడా విద్యాబాలన్ కళ్లు
ఆ కళ్లు పలికించిన అభినయం.. గుర్తుండిపోతాయి.
హిందీ “న్యూటన్”..మలయాళం “వుండా”..గుర్తొచ్చినా
” షేర్నీ”..చూడాల్సిన సినిమానే.
కె. శివప్రసాద్
Also Read : పాత్రికేయుల వైద్య సేవలకు నోడల్ ఆఫీసర్లు