Saturday, November 23, 2024
Homeసినిమా"మా" లోగుట్టు

“మా” లోగుట్టు

Why Prakash Raj lost MAA Elections?
ప్రకాష్ రాజ్ ఎందుకు ఓడిపోయాడు?

చదువుకున్న వాడు.
తెలివైన వాడు.
పేరున్నవాడు.
పొగరున్నవాడు.
విజన్ వున్న వాడు.
నోరున్నవాడు.
అన్నిటికీ మించి
మెగా సపోర్ట్ వున్న వాడు.
అయినా ప్రకాష్ రాజ్ ఎందుకు ఓడిపోయాడు?
అటు ప్రత్యర్థి ఏమైనా గట్టివాడా?
మంచుఫ్యామిలీ రూటే సెపరేట్.
వాళ్ళ నోటికి భయపడేవాళ్ళే తప్ప చేతులు కలిపేవాళ్లు ఇండస్ట్రీలో అంతంతమాత్రమే.
అయినా ప్రకాష్ రాజ్ ఎందుకు ఓడిపోయాడు?
దీనికి కారణాలు తెలియాలంటే..
అసలు “మా” ఎన్నికలు ఏ ప్రాతిపదికన జరిగాయో తెలియాలి.

మా ఎన్నికలు కేవలం మంచు-మెగా ప్యానెల్స్ మధ్యనే జరగలేదు.
“పరాయి” వాళ్ళకు..”మన”వాళ్లకు;
కమ్మోళ్ళకూ..కాపోళ్ళకూ;
డబ్బులిచ్చిన వాళ్ళకూ.. ఇవ్వని వాళ్ళకూ;
పాత వాళ్ళకూ..కొత్త ముఖాలకూ;
అహంకారులకూ..అందరి వాళ్ళకూ;
పొగరుబోతులకూ..మేకవన్నె పులులకూ
మధ్య జరిగాయి.


ఈ ఎన్నికలు కేవలం
ప్రకాష్ రాజ్ కి, విష్ణుకి మధ్య జరగలేదు.
“మా”కొక బిల్డింగ్ కట్టేవాళ్లకూ-
తలా ఒక ఇల్లు ఇచ్చేవాళ్ళకూ;
చందాలు వసూలు చేసేవాళ్లకూ-
సొంతడబ్బులు ఖర్చుపెట్టేవాళ్లకూ;
ఇన్సూరెన్సులు కట్టేవాళ్లకూ-
ఆస్పత్రుల్లో అడ్మిషన్ ఇప్పించే వాళ్లకూ;
ఊళ్ళు దత్తత తీసుకున్న వాళ్లకూ..
స్కూళ్లు నడిపిస్తున్నవాళ్ళకూ;
దేశభక్తులకూ-
మోడీ ద్వేషులకు;
హిందుత్వ వాదులకూ
కమ్యూనిస్టులకూ
మధ్యజరిగాయి.


ఇది కేవలం మా ఎన్నికల పోరు కాదు.
ఇండస్ట్రీలో కులాల హోరు..
పెత్తనాల జోరు..
చిరంజీవికి పెద్దరికం రాకుండా..సీనియర్లంతా ఒక్కటైన తీరు.
వీటికి తోడు ప్యానల్ ఎంపికలో కూడా మెగా కాంపౌండ్ కొన్నితప్పులు చేసింది.
ప్రకాష్ రాజ్ ను ప్రెసిడెంట్ గా నిలబెట్టడం..
జీవితను అప్పటికప్పుడు ఆ శిబిరం నుంచి లాక్కురావడం ..
హేమ లాంటి లబ్ద ప్రతిష్టులను వదిలించుకోలేకపోవడం..
మెగాప్యానెల్ లో కొట్టొచ్చినట్టు కనపడిన లోపాలు.
దీనికి తోడు పవన్ కల్యాణ్ తోమొదలై, నాగబాబు మీదుగా సాగిన మాటల తూటాలు బ్యాక్ ఫైర్ అయ్యాయి.

ఇక చివరిగా ప్రకాష్ రాజ్ కూడా రోజులు గడుస్తున్న కొద్దీ తన స్థాయిని బాగా తగ్గించుకున్నాడు.
మేధావిగా మొదలై..మెగాస్టార్ల సంకీర్తనలో తరించే సగటు ఆర్టిస్టుగా మిగిలాడు.
ఆవేశం, అసహనం.. అతని ఆలోచన ని ఓవర్ టేక్ చేశాయి.
ఒక దశలో నువ్వు ఒకటంటే, నేను నాలుగంటాను అనే రేస్ లోకి వెళ్లిపోయి తన గౌరవాన్ని తనే తగ్గించుకున్నాడు.
వోటింగ్ కు ముందే వోటమి తనదే అన్నట్టుగా ప్రతీదానికి పేచీ పెట్టుకుంటూ పోయాడు.
మొత్తంగా తనని తాను అత్యున్నత పీఠం మీద నిలబెట్టుకునే ఆత్మవిశ్వాసం వల్లే ప్రకాష్ రాజు.. సగటు వోటర్ కు దూరమయ్యాడు.
కేవలం ఆరొందల పోలయిన వోట్లు, రెండేళ్ళ పదవీ కాలం వుండే ఈ ఎన్నికల్లో ఓటమి వల్ల ప్రకాష్ రాజ్ కెరీర్ కి కానీ, చిరంజీవి ఇమేజ్ కి కానీ, నష్టం ఏం లేదు కానీ, ఒక వర్గం ప్రభావాన్ని తగ్గించడానికి మిగిలిన పరిశ్రమ మొత్తం ఎలా ఒకటవుతుందో చెప్పడానికి ఈ ఎన్నికలు ఒక ఉదాహరణ.

-శైలి

RELATED ARTICLES

Most Popular

న్యూస్