Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంశూన్య సిద్ధాంతం

శూన్య సిద్ధాంతం

Null: ఆకాశం గగనం శూన్యం అని శూన్యానికి చాలా గాంభీర్యాన్ని పులిమింది అమరకోశం . శూన్యం అంటే ఏమీ లేనిది అనుకుంటే మనం శూన్యంలో కాలేసినట్లే . అసలు భువనభాండాలన్నీ శూన్యంలోనే ఉంటాయి . కాకపోతే అన్నిటికీ స్థిరకక్ష్యలున్నాయి . అలాకాక కక్షలు కార్పణ్యాలతో ఒకటికొకటి కొట్టుకుంటే తట్టుకుని కొట్టుకోవడానికి మనం మిగలం . శూన్యంలో తనచుట్టూ తాను తిరగగలిగినా మరీ బాగోదని సూర్యుడి చుట్టూ కూడా తిరుగుతుంది భూమి . లేకపోతే ఒకసగం భూమి అన్నివేళలా పగలుగానే , మిగిలిన సగం భూమి అన్నివేళలా రాత్రిగానే ఉండి చచ్చేవాళ్ళం మనం .

ఎంత అయోమయంగా ఉంటే మనం శూన్యంలోకి అంత తదేకంగా చూస్తాం . అంటే అప్పుడు శూన్యం కనపడుతుందని కాదు , శూన్యం ఎప్పటికీ కనపడదని సింబాలిక్ గా శూన్యపుచూపులు చూస్తాం . శూన్యానికి రంగు రుచి వాసన ఉండవంటారు కానీ , ఇది పాక్షిక సత్యమే అవుతుంది . శూన్యం బాగా దూరమయ్యే కొద్దీ నీలం రంగు వేసుకుంటుంది. రుచి ఉండకపోవచ్చు కానీ , శూన్యంలో గాలిని ఒక్క క్షణం ఎందుకులే అని పీల్చకపోయినా మరుక్షణం కీర్తి శేషమవుతుంది. కాబట్టి అరుచి అయినా గాలి రుచి శరీరానికి అవసరం. గాలికి వాసనలేకపోవచ్చుకానీ , వాసనకు గాలి ఉండాల్సిందే . ఆ వాసనను శూన్యం మోసుకెళ్లాల్సిందే. కాబట్టి శూన్యానికి రూప రస స్పర్శ గంధాదులున్నాయని ఎంత శూన్యంలో అయినా వాదించవచ్చు. పైగా అప్పుడది శూన్యవాదం కానేకాదు .

Null

భూమి గజాల్లెక్కన అమ్ముతారు . శూన్యాన్ని అలా అమ్మరు అనుకున్నారు ఇంతకాలం . స్పెక్ట్రమ్ అమ్మకాలు , 3 లక్షల కోట్ల అవినీతి , త్రీజీ , 4 జీ , 5 జీ గజిబిజి , జియో గిగా మెగా భగభగ అన్నీ చూస్తే కోట్ల కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది అక్షరాలా శూన్యమే . శూన్యంలోనే సెల్లు టవర్ సంకేతాలు ఎడతెరిపిలేకుండా పనిచేస్తుంటాయి . శూన్యంలోనే టీ వీ ప్రోగ్రాములు పయనిస్తూ ఉంటాయి . శూన్యంలోనే అన్ని గ్రహాల సమాచార ప్రసారాలు జరుగుతూ ఉంటాయి . శూన్యాన్ని గ్రహాలకు అనుసంధానించి ఒక్కొక్క మెగా హెర్డ్జ్ కింద లెక్కగట్టి ఇస్రో వ్యాపారం చేసుకోవాలి . ఇస్రో గ్రహాల గ్రహచారం బాగుంటే ఆ బ్యాండ్ విడ్త్ ను ముక్కలు ముక్కలుగా సెల్ ఆపరేటర్లు , టీ వీ చానెళ్లు ఇంకా ఎవరెవరో పోటీలుపడి వాడుకోవాలి. శూన్యంలో వదిలిన కంటెంట్ తో శూన్యంలోనుండే నాలుగురాళ్లు పిండుకోవాలి .

పీ సీ సర్కార్ శూన్యంలో నుండి ఏవేవో తీస్తే అబ్బో అనుకునేవారు . ఇప్పుడు శూన్యంలోనుండి ఎంత డబ్బులు పిండుకుంటున్నారో లెక్కలు తెలిస్తే స్పృహదప్పి శూన్యంలోనే కలిసిపోతాం. శరీరంలో శూన్యాన్ని రోగాలు లెక్కకడతాయి . మనసులో శూన్యాన్ని మానసికశాస్త్రవేత్త లెక్కకడతాడు . మెదడులో శూన్యాన్ని సమాజం లెక్కకడుతుంది . సమాజంలో శూన్యాన్ని చైతన్యం లెక్కకడుతుంది . శూన్యంలో శూన్యాన్ని శాస్త్రవేత్తలు లెక్కకడతారు . మాటల్లో శూన్యాన్ని మౌనం లెక్కకడుతుంది.  మౌనంలో శూన్యాన్ని ఏ మాటలూ ఎప్పటికీ లెక్కకట్టలేవు .

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

ఏమి స్వామీ! ఏమయ్యింది?

RELATED ARTICLES

Most Popular

న్యూస్