స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతోన్న రెండో వన్డేలో శ్రీలంక 132 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి మొన్నటి పరాజయానికి బదులు తీర్చుకుంది. హంబంతోట మహీంద్ర రాజపక్ష స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 323 పరుగులు చేసింది. లక్ష్య సాధనలో ఆఫ్ఘన్ 42.1 ఓవర్లలో 191 పరుగులకే ఆలౌట్ అయ్యింది. లంక బౌలర్లు సమిష్టిగా రాణించి ఆఫ్ఘన్ ను కట్టడి చేశారు.
లంక జట్టులో బ్యాటింగ్ లో కుశాల్ మెండీస్ -78; కరుణరత్నే-52; సమర విక్రమ-44; పాథుమ్ నిశాంక-44 పరుగులతో రాణించారు. అసలంక (6) విఫలం కాగా చివర్లో కెప్టెన్ శనక-23; ధనుంజయ డిసిల్వా-29; వానిందు హసరంగ-29 రన్స్ సాధించారు. ఆఫ్ఘన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్, నబి చెరో రెండు; ముజీబ్, నూర్ అహ్మద్ చెరో వికెట్ పడగొట్టారు.
ఆఫ్ఘన్ 11 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. జట్టులో కెప్టెన్ హస్మతుల్లా షాహిది-57; ఇబ్రహీం జర్డాన్-54; రహ్మత్ షా-36; అజ్మతుల్లా ఒమర్జై-28…. మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. లంక బౌలర్లలో ధనుంజయ డిసిల్వా, వానిందు హసరంగ చెరో 3; దుష్మంత చమీర 2; మహీష్ తీక్షణ, దానున్ శనక చెరో వికెట్ పడగొట్టారు.
ధనుంజయ డిసిల్వాకు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.
మూడు మ్యాచ్ ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది, సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరి మ్యాచ్ బుధవారం జరగనుంది.