Taiwan Representative Office In Lithuania :
వన్ చైనా పేరుతో తైవాన్ తమ భూభాగంలో అంతర్భాగమని డ్రాగన్ దేశం గిల్లికజ్జాలు పెడుతూ రోజుకొ సమస్య సృష్టిస్తోంది. తైవాన్ సరిహద్దుల్లో యుద్ధ నౌకలు పంపటం, ఆ దేశ సరిహద్దుల్లోకి విమానాలు పంపి భయానక వాతావరణం సృష్టిస్తోంది. తైవాన్ ఇవేవీ పట్టించుకోకుండా తన అస్తిత్వం కాపాడుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా బాల్టిక్ దేశమైన లిత్వేనియాలో తైవాన్ ప్రతినిధి కార్యాలయాన్ని ప్రారంభించింది. ఇప్పటికే లాత్వియాలో ప్రతినిధి కార్యాలయం ఉండగా తాజాగా లిత్వేనియా రాజధాని విల్నియస్ లో కూడా ప్రారంభించినట్టు తైవాన్ విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. కొత్త కార్యాలయం ద్వారా దౌత్య సంబంధాల బలోపేతం, ఫిన్ టెక్, లేసేర్స్, సెమికండక్టర్స్ తదితర ఎలక్ట్రానిక్ రంగాల్లో సహకారానికి తోడ్పడనుంది.
తైవాన్ ప్రతినిధి కార్యాలయం ప్రారంభించకుండా చైనా లిత్వేనియా దేశం మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చింది. చైనా నుంచి ఆ దేశానికి పంపే వివిధ రకాల ఎగుమతుల్ని నిలిపివేస్తామని హెచ్చరించినా లిత్వేనియా ఖాతరు చేయలేదు. ప్రతినిధి కార్యాలయం ప్రారంభించే రోజు కొందరు చైనీయులు నిరసనలు తెలపగా వారికి పోటీగా టిబెటన్లు, వీఘర్ ముస్లీంలు ప్రదర్శనలు నిర్వహించారు.
Also Read : చైనా దురాగతాలపై బంగ్లాలో నిరసనలు