అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారారు. ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలు మూడు పెళ్ళిళ్ళు చేసుకొని తలాక్ ఇవ్వటాన్ని అస్సాం ప్రభుత్వం అనుమతించదని ఈ రోజు గువహతిలో స్పష్టం చేశారు. తలాక్ ఇవ్వటానికి బదులుగా న్యాయ బద్దంగా విడాకులు ఇవ్వాలని ముస్లిం పురుషులకు సూచించారు.
ముస్లీముల్లో ముగ్గురు భార్యలు ఉన్న వారి ఆస్తిని అందరికి సమానంగా పంచుతామని, అస్సాంలో వివాదాలకు తావు లేదని సిఎం హిమంత తేల్చి చెప్పారు. ముస్లీం కుటుంబాల్లో కుమారులతో సమానంగా కుమార్తెలకు ఆస్థి చెందుతుందని, 50 శాతం ఆస్థి బార్యకు ఇవ్వాల్సిందేనని ప్రకటించారు. నరేంద్ర మోడీ సారథ్యంలోని ప్రగతి శీల ప్రభుత్వం వల్లే ముస్లిం మహిళలకు హక్కులు సంక్రమించాయని హిమంత బిశ్వా శర్మ వ్యాఖ్యానించారు.
గతంలో మదరసాలపై కూడా హిమంత బిశ్వా శర్మ ఇదేవిధంగా కుండబద్దలు కొట్టారు. మదరస అనే పదం ఉన్నంతవరకు పిల్లలు డాక్టర్లు, ఇంజినీర్లు అవ్వాలన్న ఆలోచన చేయలేరని పేర్కొన్నారు. మదరసాలలో చదివితే డాక్టర్లు, ఇంజినీర్లు కాలేరని వారికి చెబితే, వారే స్వయంగా మదరసాలకు వెళ్లేందుకు నిరాకరిస్తారు. మీ పిల్లలకు ఖురాన్ నేర్పండి.. కానీ ఇంట్లో నేర్పండి. మదరసాల్లో పిల్లలను చేర్పించడం వారి మానవ హక్కులను ఉల్లంఘించడమే అవుతుంది..’ అని వ్యాఖ్యానించారు.
Also Read : ఎవరు కొడుకు? ఎవరు తండ్రి?