TDP Behind The Amaravathi Movement :
అమరావతి ఉద్యమాన్ని స్వాతంత్ర్య పోరాటంతో ఎవరైనా పోల్చి ఉంటే అది దురదృష్టకరమని, ఇది వ్యక్తిగతంగా తన అభిప్రాయమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. నాటి స్వాతంత్ర్య ఉద్యమం దేశం కోసం జరిగిందని, బానిసత్వానికి వ్యతిరేకంగా ఎందరో యోధులు ఆస్తులు, ప్రాణాలు త్యాగం చేశారని, కానీ ఇప్పుడు జరుగుతున్నది ఒక సామాజిక వర్గం కోసం, వారి ఆస్తులు పెంచుకోవడం కోసం, ఓ రాజకీయ పార్టీకి వత్తాసు పలుకుతున్న ఉద్యమమని బొత్స పేర్కొన్నారు. ఈ రెండు ఉద్యమాలకూ పోలిక లేదని తేల్చి చెప్పారు. అమరావతి ఉద్యమం ధన దాహం కోసం, స్వార్ధం కోసం, రియల్ ఎస్టేట్ కోసం చేస్తున్న ఉద్యమమని అన్నారు. తెలుగుదేశం పార్టీ వెనకుండి నడిపిస్తున్న ఈ ఉద్యమం 700 రోజులు కాదు వెయ్యిరోజులైనా కొనసాగుతూనే ఉంటుందన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
మున్సిపల్ ఎన్నికలపై బొత్స స్పందించారు….. చంద్రబాబు ఓటమిపై పరిశీలన చేసుకోకుండా దొంగ ఓట్లు అంటూ తప్పించుకుంటున్నారని, ఆయన్ను భగవంతుడే రక్షించాలని వ్యాఖ్యానించారు. సాధారణ ఎన్నికల సమయంలో కూడా ఇలాగే తమ ఓటమికి ఈవీఎం ట్యాంపరింగ్ కారణమని చెప్పారని బొత్స గుర్తు చేశారు. తాము చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం వల్లే ప్రజలు తమకు ఈ స్థాయి విజయాన్ని అందిచారని పేర్కొన్నారు.
వైసీపీకి 98, 99 శాతం మార్కులు వేశారన్నారు. ఎన్నికలు జరిగి రెండున్నరేళ్ళు దాటిన తర్వాత కూడా ఈ స్థాయిలో ప్రభుత్వంపై అభిమానం ఉండడం గొప్ప విషయమన్నారు. టిడిపి నేతలు, ఆ పార్టీకి వత్తాసు పలికే మీడియా ప్రతిరోజూ ప్రభుత్వంపై, తమ పార్టీపై అనేక రకాలుగా దుష్ప్రచారం చేస్తున్నా దాన్ని ప్రజలు అంగీకరించడం లేదని ఈ ఫలితాలతో రుజువైందన్నారు.
ఈ ఫలితాల స్పూర్తితో ప్రజా సేవకు పునరంకితం అవుతామని, ఒకట్రెండు చోట్ల తమ పార్టీకి ఇబ్బంది కలిగినా దానిపై కూడా పార్టీలో సమీక్షించుకుంటామని, రాబోయే రోజుల్లో దానికూడా సరిదిద్దుకొని, లోపాలను అధిగమించి నూటికి నూరు శాతం విజయం సాధించేలా ప్రయత్నిస్తామని బొత్స వెల్లడించారు. చంద్రబాబు లాగా కిందపడినా తనదే పైచేయి అని తాము చెప్పబోమని స్పష్టం చేశారు. ఇప్పటికైనా చంద్రబాబుకు తానా, తందానా అంటున్న కొన్ని మీడియా సంస్థలు వాస్తవాలు గ్రహించాలన్నారు.
Also Read : ఏకపక్షం కాదు: యనమల