Saturday, July 27, 2024
HomeTrending Newsఐదో తేదీలోగా పెన్షన్ పంపిణీ చేయండి : టిడిపి వినతి

ఐదో తేదీలోగా పెన్షన్ పంపిణీ చేయండి : టిడిపి వినతి

పెన్షన్ పంపిణీ విషయంలో  తెలుగుదేశం పార్టీపై వైఎస్సార్సీపీ దుష్ప్రచారం చేస్తోందని టిడిపి నేతలు ఆరోపించారు. పెన్షన్ పంపిణీ నుంచి వాలంటీర్లను తప్పించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అధికార వైసీపీ- విపక్షాల మధ్య వాదోపవాదాలు తీవ్రతరం అయ్యాయి. ఒకటో తేదీన పెన్షన్ రాకపోతే దానికి కారణం చంద్రబాబే అంటూ సిఎం జగన్ చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండించింది. వాలంటీర్ల విషయంలో ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇస్తే దానికి చంద్రబాబుకు ఏం సంబంధమని ఆ పార్టీ ప్రశ్నిస్తోంది. ఐదో తేదీలోగా పెన్షన్ అందేలా చూడాలని కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టిడిపి ప్రతినిధి బృందం వినతి పత్రం అందజేసింది.

ఎన్నికల సంఘం చంద్రబాబు కింద పనిచేయడంలేదన్న విషయం గుర్తుంచుకోవాలని.  ఈసి ఆదేశాలను తూచ తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, ఏ ఒక్కరికీ మిస్ కాకుండా అందరికీ పెన్షన్ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. గతంలో ఏ రకంగా ఇచ్చారో అదే విధంగా ఇంటి వద్దకే వెళ్లి ఈనెల ఐదో తేదీలోగా  ప్రక్రియ పూర్తి చేయాలని సిఎస్ ను కోరారు. తాము అధికారంలోకి రాగానే ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ ను రూ. 4 వేల రూపాయలకు పెంచి, ఇంటి వద్దకే వచ్చి అందజేస్తామని స్పష్తం చేశారు.

కొన్నిచోట్ల సమీపంలోని పంచాయతీ కార్యాలయానికే వచ్చి పెన్షన్లు తీసుకోవాలంటూ అధికారులు చెబుతున్నారని, ఈ ఎండల్లో అంత దూరం వృద్ధులు రాలేని పరిస్థితి ఉంటుందని రామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే సిఎస్ తగిన చర్యలు తీసుకొని పంపిణీ పూర్తి చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్