Friday, January 24, 2025
HomeTrending NewsTelangana: తెలంగాణలో గణనీయమైన వృద్ది - మంత్రి హరీశ్ రావు

Telangana: తెలంగాణలో గణనీయమైన వృద్ది – మంత్రి హరీశ్ రావు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వార్షిక రుణ లక్ష్యం రూ.2,42,775 కోట్లుగా నిర్ధారించడం, గత సంవత్సరం లక్ష్యం రూ.2.14 లక్షల కోట్లు కాగా ఈ ఏడాది 13.42% ఎక్కువగా ఉండటం పట్ల ఆర్థిక వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఏడాది రుణ లక్ష్యంలో ప్రాధాన్యతా రంగం వాటా రూ.1,85,326.68 కోట్లు కాగా ఇందులో అత్యధికంగా 60.85 % అంటే రూ.1,12,762.59 కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించడం మంచి విషయం అన్నారు.

మంత్రి హరీష్ రావు అధ్యక్షతన శుక్రవారం స్టేట్ లెవ‌ల్ బ్యాంక‌ర్స్ కమిటీ 37వ సమీక్ష సమావేశం టి హబ్ లో జరిగింది. సమీక్షలో వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎస్ ఎల్ బి సి కన్వీనర్ డేబశిష్ మిత్రా, అగ్రికల్చర్ స్పెషల్ కమిషనర్ హనుమంత్ కే, నాబార్డ్ సిజిఎం చింతల సుశీల, ఆర్ బీఐ రీజినల్ డైరెక్టర్ నిఖిల, డి ఎఫ్ ఎస్ అదనపు కమిషనర్ తంగిరాల, అన్ని బ్యాంకుల ప్రతినిధులు, రైతు, చిన్న పరిశ్రమల సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..

సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రణాళికల వల్ల దేశంలోనే తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఎదిగిందని అన్నారు. దేశ జీడీపీకి తెలంగాణ అందిస్తున్న వాటా 2014-15 లో 4.1% ఉంటే, 2022-23లో 4.8% పెరిగింది అన్నారు. రైతు బంధు, 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ కాకతీయ, కాళేశ్వరం సహా ఇతర సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రోత్సాహం, ఫిషరీస్, గొర్రెల పంపిణీ తదితర చొరవల వల్ల వ్యవసాయం, అనుబంధ రంగాలు గణనీయమైన వృద్ది నమోదు చేసినట్లు చెప్పారు. 2014-15 లో GSVA 16.3% ఉంటే, 2022-23 కు 18.8% పెరిగింది అన్నారు. సాగు విస్తీర్ణం పెరగటం వల్ల, పంట ఉత్పత్తి పెరిగి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు అత్యధిక ధాన్యాన్ని సరఫరా చేస్తున్న రెండో రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని చెప్పారు.

విద్య, వైద్యం, గృహ సంబంధ, వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ ప్రభుత్వ ప్రాధాన్య రంగాలకు రుణాలు ఎక్కువగా ఇచ్చి, ప్రజల అభివృద్ధికి తోడ్పడాలన్నారు. డైరీ, ఫిషరీస్ సంబంధిత రుణ దరఖాస్తులు తిరస్కరించకుండా అర్హులకు రుణాలు మంజూరు చేయాలనీ సూచించారు. అవగాహన పెంచి, బ్యాంకర్స్ తో సమన్వయం చేసుకుంటూ లబ్ధిదారుల సంఖ్య పెరిగేలా చూడాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. వరంగల్ జిల్లా తరహాలో అన్ని జిల్లాల్లో రుణ దరఖాస్తులు పెరిగేలా చూడాలన్నారు. Rural self employement traing institute లో శిక్షణ పొందిన అందరికీ రుణాలు ఇవ్వాలని కోరారు.

రైతు బంధు, రైతు బీమా వంటి పథకాల డబ్బును బ్యాంకుల ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్నామని దేశంలోనే ఇంత పెద్ద మొత్తంలో నగదు బదిలీ మరెక్కడా లేదన్నారు. పేద ప్రజలు, వివిధ వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం వారికి ఆర్థిక చేయూత అందిస్తున్నదని, రైతు బంధు, పంట డబ్బులు, ఆసరా పింఛన్లు డబ్బును ఎక్కడా అపవద్దని అన్నారు.

డిపాజిట్ల విషయంలో తెలంగాణ ఉత్తమ స్థానంలో ఉందని, ఇదే సమయంలో బ్రాంచుల సంఖ్య కూడా పెంచాలని మంత్రి కోరారు. మారుమూల గ్రామాల్లో బ్యాంక్ బ్రాంచులు మంజూరు అయినప్పటికీ, వివిధ కారణాల వల్ల పట్టణ ప్రాంతాలకు తరలించిన బ్రాంచులను వెంటనే మంజూరు అయిన గ్రామాల్లో ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ గ్రామీణ ప్రాంతాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాయని, కాబట్టి ప్రజల వ్యయ ప్రయాసలు తీర్చేలా ప్రజల వద్దకు బ్యాంక్ సేవలు తీసుకు వెళ్లాలని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తోడ్పాటు అందిస్తుంది అన్నారు. ఎక్కడెక్కడ ఇలాంటి అవసరం ఉందో లీడ్ బ్యాంక్ మేనేజర్లు సమీక్షించి పూర్తి రిపోర్ట్ అందించాలన్నారు.

ఆయిల్ సాగుకు రుణాలు ఎక్కువగా ఇవ్వాలని, జాతీయ, రాష్ట్ర, రైతు సంక్షేమానికి ఇది దోహదపడుతుందన్నారు. వ్యాపార సానుకూల ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో పారిశ్రామిక రంగం గణనీయమైన వృద్ది నమోదు చేసిందన్నారు. దీనివల్ల పెట్టుబడులు పెరగటంతో పాటు, ఉద్యోగ అవకాశాలు పెరిగాయన్నారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక TS iPASS విధానం వల్ల జనవరి 2022-23 లో 2,518 కొత్త పరిశ్రమల ద్వారా 20,237 కోట్ల పెట్టుబడులు ఆకర్షించగా, 72,908 మందికి ఉద్యోగ అవకాశాలు కలిగినట్లు చెప్పారు.

రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల ద్వారా పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కలుగుతున్నాయని, ఈ ఆర్థిక సంవత్సరంలో ఏర్పరుచుకున్న లక్ష్యం ప్రకారం రూ. 54,672 కోట్లు ఎంఎస్ఎమ్ఈ పరిశ్రమలకు రుణాల మంజూరు చేయాలని ఆదేశించారు. చిరు వ్యాపారులకు రుణాలు అందించి బ్యాంకులు వారికి అండగా నిలవాలి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజల అభివృద్ధి కోసం 60-90% దాకా సబ్సిడీలు అందిస్తున్నట్లు చెప్పారు.

మహిళా సాధికారతకు గాను మహిళలకు, స్వయం సహాయక బృందాలకు లక్ష్యాల మేరకు రుణాలు అందించాలని సూచించారు. స్వయం సహాయక బృందాలు సకాలంలో, పూర్తిస్థాయిలో వడ్డీలు చెల్లిస్తూ ఆదర్శంగా ఉన్నాయన్నారు. అయితే కొన్ని బ్యాంకులు మాత్రం అధికంగా వడ్డీ వసూలు చేస్తున్నాయన్నట్లు తాము గుర్తించి, ఆయా డబ్బును తిరిగి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. ఆర్బీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం, రూ. 3ల‌క్ష‌ల లోపు రుణాల‌కు 7శాతం, రూ. 3ల‌క్ష‌ల నుంచి రూ.5ల‌క్ష‌ల‌కు వ‌ర‌కు 10శాతం వ‌డ్డీ రేటు అమ‌లు చేయాల‌ని సూచించారు. అన్ని బ్యాంకులు త‌క్ష‌ణం ఆర్‌బీఐ నిబంధ‌న‌లు అనుస‌రించాల‌ని, ఈ మేరకు సాఫ్ట్వేర్ చెక్ చేసుకోవాలని లీడ్ బ్యాంక్ మేనేజర్లకు ఆదేశించారు. గృహ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు రుణాలు ఇవ్వాలన్నారు.

రాష్ట్రంలోని 100% జిల్లాలు డిజిటల్ డిస్టిక్స్ గా గుర్తింపు పొందడం గొప్ప విషయమని మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా బ్యాంకర్లను అభినందించారు. నాబార్డ్ లింక్ కార్యక్రమాల గురించి గ్రామస్థాయిలో ప్రచారం కల్పించాలన్నారు, రైతులకు ప్రయోజనం కలిగేలా చూడాలన్నారు. కార్పొరేట్లకు 16 లక్షల దాకా రుణాలు వన్ టైం సెటిల్మెంట్ చేశారని, పేద ప్రజలు, రైతులు, చిన్న వ్యాపారుల విషయంలో వారికి మేలు చేసే విధంగా ఆలోచించాలన్నారు. తద్వారా ఎన్ పి ఏ తగ్గే అవకాశం ఉంటుంది అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్