Sunday, November 24, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంవాలెంటైన్స్ డే స్పెషల్

వాలెంటైన్స్ డే స్పెషల్

Valentines Day : ప్రేమ లేదని, ప్రేమించరాదని సాక్ష్యమే నీవని నన్ను నేను చాటనీ…అని గుండెలు బాదుకోవడానికయినా ముందు ప్రేమించాలి. గుండె పగిలిపోవు వరకు నన్ను పాడనీ…ముక్కలలో లెక్కలేని రూపాలలో మరల మరల నిన్ను చూసి రోదించనీ అని ప్రేమ విఫలమయినా ప్రేయసినే తలచుకుంటూ విరహగీతాలో, విషాద గీతాలో పాడుకోవడం ప్రేమికుడి బాధ్యత. మనసు మూగదే కానీ దానికి భాష ఉంటుంది. చెవులుండే మనసుకే ఆ భాష వినిపిస్తుంది. ఎద మీద ఎద పెట్టి ఆ సొదలు వినాలి. వినుకుని బతుకును ఇంపుగా దిద్దుకోవాలి. ఆద్యంతమే లేని అమరానందమే ప్రేమ. మనసున పారే సెలయేరు ప్రేమ. అలసట తీర్చే చిరుగాలి ప్రేమ.

ప్రేమ ఎప్పుడు పుడుతుంది? ఎందుకు పుడుతుంది? ఎలా పుడుతుంది? అన్నవి లాజిక్కు అందని ప్రశ్నలు. ప్రేమ ఒక అసంకల్పిత మానసిక చర్య కావచ్చు. సంకల్పిత మానసిక చర్య కావచ్చు. ప్రేమ చిగురించి, మొగ్గ తొడిగి, కాయ కాచి, పంట పండి ఫలించవచ్చు. మొగ్గలోనే తగ్గిపోవచ్చు. పండకుండా కాయ కాయగానే మిగిలిపోవచ్చు. పండినా ఒక్కోసారి ఫలం దక్కకపోవచ్చు.

ప్రేమ సఫలమయినవారికంటే విఫలమయినవారే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ఉంటారు. ప్రేమ విఫలమయినవారి డ్రెస్ కోడ్, బాడీ లాంగ్వేజ్, మానసిక ప్రవర్తన ప్రత్యేకం. వారికి క్షణాలు యుగాలుగా, అంతా శూన్యంగా ఉంటుంది. ప్రేమలో మునిగితేలుతున్నవారికి యుగాలు క్షణాలుగా, ప్రపంచమంతా రంగుల కలలా కనిపిస్తూ ఉంటుంది. ప్రియుడికి లోకమంతా ప్రేయసి రూపాలే కనిపిస్తూ ఉంటాయి. ప్రేయసికి లోకమంతా ప్రియుడి రూపాలే ఎదురవుతూ ఉంటాయి. ఎంత నథింగ్ విషయాలయినా స్వీట్ నథింగ్స్ గా మారిపోతాయి.

ప్రేమికుల సంభాషణల్లో కర్ణ కఠోర గార్ధభ స్వరం కోటి వీణల సుమధుర గానమై తేనెకే తీయదనాన్ని అద్దుతూ ఉంటుంది. ప్రతి పలుకు బంగారమవుతుంది. కంటి చూపు యుగయుగాల ఎదురు చూపు అవుతుంది. కళ్లల్లో వెయ్యి మెగావాట్ల ప్రేమ విద్యుత్ ఉత్పత్తి అయి చీకట్లను పారదోలుతూ ఉంటుంది. అంతకు ముందు ఎప్పుడూ ఉత్తరం రాసి ఎరుగనివారు ప్రేమలో పడగానే ప్రపంచంలో ఉన్న కాగితాలన్నీ అయిపోయినా ఇంకా రాయాల్సిన ప్రేమ లేఖలు మిగిలే ఉంటాయి. అంతకు ముందు కవిత్వం వింటే వాంతి చేసుకునేవారు ప్రేమలో పడగానే కాళిదాసు కంటే గొప్ప కవులయి కవిత్వం అంతు చూస్తుంటారు.

వియోగ వేళల విరహం కూడా సుఖమే కదా అని నానుడి. నిజానికి ప్రేమే ఒక యోగం. ఒక యాగం. ఒక తపస్సు. ఒక దీక్ష. చిగురించిన ప్రేమ ఏపుగా ఎదిగి పాదుకోవడానికి కూడా యోగమో, త్యాగమో ఉండాలి. చెప్పుకోలేని మూగ ప్రేమలు కొన్ని. చెప్పినా ప్రయోజనం లేని ప్రేమలు కొన్ని. చెబితే బాగుండు అనుకునే ప్రేమలు కొన్ని. నిరాకరిస్తే యాసిడ్లతో వెంటపడే రాక్షస ప్రేమలు కొన్ని. మరు జన్మకయినా కరుణిస్తే చాలని నిరీక్షించే ప్రేమలు కొన్ని. ప్రేమలేని జీవితం అక్కర్లేదని మరుక్షణమే మరణించే ప్రేమలు కొన్ని. ఎక్కడ ఉన్నా ఏమయినా మనమెవరికి వారై వేరయినా నీ సుఖమే నే కోరుకున్నా- నిను వీడి అందుకే వెళుతున్నా అని మౌనంగా, గౌరవంగా, హుందాగా, భారంగా త్యాగం చేసే ప్రేమలు కొన్ని.

ప్రేమిస్తున్నప్పుడు కనులు కనులతో మాట్లాడే మాటలను అనువదించడానికి భాష చాలదు. విడిపోయాక కనీసం కళ్లల్లో కళ్లు పెట్టి చూసే ధైర్యం కూడా మిగలదు. ఇప్పుడంటే ప్రేమ విఫల సంబరాలు- లవ్ బ్రేక్ సెలెబ్రేషన్స్ పేరిట జరుగుతున్నాయి కానీ– ఒకప్పుడు విఫల ప్రేమలు చితిలో బూడిదయినా తెలిసేవి కాదు.

ప్రపంచమంతా ప్రేమమయమే. పుడమి ప్రేమ ప్రకృతిలో ప్రతిఫలిస్తుంది. ప్రకృతి ప్రేమ పంచభూతాల్లో ప్రతిఫలిస్తుంది. పంచభూతాల ప్రేమ పంచ ప్రాణాల్లో ప్రతిఫలిస్తుంది. అమ్మ ప్రేమ పిల్లల్లో ప్రతిఫలిస్తుంది. నాన్న ప్రేమ పిల్లల ఉన్నతిలో ప్రతిఫలిస్తుంది. దేవుడి ప్రేమ భక్తుల్లో ప్రతిఫలిస్తుంది. ప్రేమ, కరుణ, దయ, జాలి మాత్రమే ప్రపంచాన్ని గెలవగలుగుతుంది. ఈ అనంతప్రేమలో ప్రేయసీ ప్రియుల ప్రేమ పిపీలికం.

ప్రేమ పొంగిన మనసులో కన్నీటి చుక్కకు ప్రతిరూపం వెన్నెలకు వెలుగు జిలుగులు అద్దే తాజ్ మహల్. భాగమతి మీద చెదరని ప్రేమకు ప్రతిరూపమే మూసీ ఇరుతీరాల్లో పరుచుకున్న భాగ్యనగరం ప్రేమ భాగ్యం. చరిత్రలో ప్రేమను గెలిపించుకోవడానికి జరిగిన యుద్ధాలెన్నో? దాటిన సరిహద్దులు, కొండలు, నదులు, ఖండాలు, సముద్రాలు ఎన్నో? ఆయువు పోస్తుందా ఆయుధమేదయినా? ప్రేమను మించినదా బ్రహ్మాస్త్రమయినా?

ప్రేమకు ఆకర్షణ పునాది కావచ్చు కానీ- ప్రేమ, ఆకర్షణ ఒకటి కాదు. ప్రేమ ఒక బాధ్యత. ప్రేమ ఒక అమృతం. ప్రేమ అనంతం. సృష్టికి ప్రేమ ఒక పునాది. ప్రేమిస్తే పోయేదేమీ లేదు- మనసులు కలవడం తప్ప. ఏది నిజమయిన ప్రేమ? ఏది నకిలీ ప్రేమ? అన్నది ఎవరికి వారు అనుభవంతో తెలుసుకోవాల్సిన విషయం. ఫిబ్రవరి 14 ప్రపంచ ప్రేమికుల దినం- వాలంటైన్స్ డే గా జరుపుకుంటున్నాం. ఒక్క ఫిబ్రవరి పద్నాలుగే ఎందుకు? రోజూ ప్రేమిస్తూనే ఉందాం. ప్రేమను పంచుతూనే ఉందాం. ప్రేమలో ప్రేమగా మునుగుతూనే ఉందాం.

(నమస్తే తెలంగాణ సౌజన్యంతో)

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

Also Read :

పిండం పెట్టక ముందే…

RELATED ARTICLES

Most Popular

న్యూస్