Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఆధునిక గజేంద్ర మోక్షణం

ఆధునిక గజేంద్ర మోక్షణం

Power of Poetry: తెలుగు సాహిత్యానికి అన్నమయ్య, పోతన, వేమన ఎంత ఆయుస్సు పోశారు? ఎన్ని నగిషీలు దిద్దారు? ఎన్నెన్ని అలంకారాలు అద్దారు? ఎంత మాధుర్యాన్ని జత చేశారు? అత్యంత సరళమయిన తెలుగు భాషను ఉపయోగిస్తూ ఎలా అనన్యసామాన్యమయిన భావనలను ఆవిష్కరించారు? పదంలో, పద్యంలో ఛందస్సు మధ్య వాడిన వారి మాటలు ఎన్నెన్ని ఇప్పుడు సామెతలుగా, వాడుక మాటలుగా మన నోళ్లల్లో నిత్యం నానుతున్నాయి? అన్నవి తెలుగువారు తప్పనిసరిగా తెలుసుకోదగ్గ విషయాలు.

సకల శాస్త్రాలు చదివిన గొప్ప కవికి వెయ్యేళ్ల ఆయుస్సు ఇచ్చినా…ఒక్క అన్నమయ్య జీవితకాలంలో సృష్టించినంత సాహిత్యంలో పదో వంతు కూడా ఇవ్వలేడు.

రాస్తున్న ప్రతి అక్షరాన్ని మంత్రమయం చేసి…భాషను, భావాన్ని పవిత్రీకరించిన పోతన పోతపోసిన తెలుగు భాగవతం భక్తికి సోపానం. తెలుగు భాషకు కీర్తి కిరీటం.

చిన్న చిన్న పద్యాల కొరడాలతో చెడు మీద పెద్ద పెద్ద వాతలు పెట్టి…సంఘానికి మంచి మార్గం చూపిన వేమన తెలుగు వెలుగు.

కొందరి వల్ల భాష పాడవుతుంది. కొందరి వల్ల భాష బతికి పట్టుబట్టలు కట్టి పల్లకీల్లో ఊరేగుతుంది. తెలుగును వినువీధిన నిలిపిన మహనీయుల్లో ఈ ముగ్గురూ ఎవరికి వారే ప్రత్యేకం.

పోతన పద్యం ఒక్కటయినా చదవని, వినని, కనీసం తెలియని వారిని తెలుగుభాషాభిమానులుగా గుర్తించడం కష్టం. ఒకప్పుడు బడి చదువుల్లో పోతన తప్పనిసరి. ఇప్పుడు ఉన్నాడో? లేడో? ఉన్నా…లేనట్లు ఉండి ఉంటాడు.

రచనలో “పద యోగ్యతా సంబంధం” అని ఒక ఆదర్శం. అంటే…చెబుతున్న విషయానికి తగిన పదాలను ఎంచుకోవడం. ఉదాహరణకు అన్నమయ్య ఉగ్ర నరసింహుడిని వర్ణిస్తున్నప్పుడు ఏ పదాలను ఎంచుకున్నాడు? అదే అన్నమయ్య వెంకన్నను ఉయ్యాల ఊచేప్పుడు ఏ పదాలను ఎంచుకున్నాడో చూస్తే తెలిసిపోతుంది.

ఉగ్ర నారసింహుడు:-
“ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీనారసింహా!

ప్రళయమారుత ఘోర భస్త్రీకాపూత్కార
లలిత నిశ్వాసడోలా రచనయా!
కులశైల కుంభినీ కుముదహిత రవిగగన-
చలన విధినిపుణ నిశ్చల నారసింహా!

వివరఘనవదన దుర్విధహసన నిష్ఠ్యూత-
లవదివ్య పరుష లాలాఘటనయా!
వివిధ జంతు వ్రాతభువన మగ్నౌకరణ
నవనవప్రియ గుణార్ణవ నారసింహా!”

ఉయ్యాల పాట:-
“లాలనుచు నూచేరు లలనలిరుగడల
బాలగండవర గోపాలనినుజాల
|| లాలీ లాలీ ||

ఉదుటు గుబ్బల సరము లుయ్యాలలూగ
పదరి కంకణరవము బహుగతుల మ్రోగ
వొదిగి చెంపల కొప్పు లొక్కింత లీగ
మెదురు చెమటల నళికములు తొప్పదోగ
|| లాలీ లాలీ ||

మలయ మారుతగతులు మాటికి చెలంగ
పలుకు కపురపుతావి పైపై మెలంగ
పలుగాన లహరి యింపుల రాల్గరంగా
బలసి వినువారి చెవి బడలిక దొలంగ
|| లాలీ లాలీ ||

లలనా జనాపాంగ లలిత సుమచాప
జలజలోచన దేవ సద్గుణ కలాప
తలపు లోపల మెలగు తత్త్వప్రదీప
భళిర గండవరేశ పరమాత్మరూప
|| లాలీ లాలీ ||”

“ప్రళయమారుత ఘోర భస్త్రీకాపూత్కార
లలిత నిశ్వాసడోలా రచనయా”
అన్నదీ అన్నమయ్యే.

“బలసి వినువారి చెవి బడలిక దొలంగ”
అన్నదీ అన్నమయ్యే.

అక్కడ ఉగ్రనారసింహుడు శబ్దంలోనే ఆవిష్కారమవుతున్నాడు. ఇక్కడ పొద్దుటినుండి విసుగు విరామం లేకుండా వినీ వినీ బడలికతో బరువెక్కిన వెంకన్న చెవుల బరువు దిగి హాయిగా నిద్రపుచ్చుతున్న దృశ్యం ఒత్తుల్లేని శబ్దంలోనే అక్షరాలా ఆవిష్కారమవుతోంది. “చెవిబడలిక తొలంగ…” అన్న మాటను అన్నమయ్య తప్ప బహుశా తెలుగు సాహిత్యంలో ఇంకెవరూ ప్రయోగించినట్లు లేరు.

సందర్భానికి తగిన పదాలను ఎంచుకోవడం, సృష్టించడం ఒక ఎత్తు. పోతన గజేంద్ర మోక్షణంలో మరో మెట్టు పైకెళ్లి సందర్భానికి తగిన పదాలతో పాటు…ఆ సందర్భానికి ప్రతిబింబంగా, ప్రతీకగా, కదిలే పద చిత్రంగా తగిన అక్షరాలను కూడా ఎంచుకున్నాడు.

ఒక్కొక్క పద్యాన్ని ఇలాంటి పద యోగ్యత, అక్షర యోగ్యతా ప్రమాణంతో వివరిస్తూ పోతే ఇదో గ్రంథమవుతుంది. మచ్చుకు మూడు పద్యాలను చూద్దాం.

Babia Crocodile

“కరిదిగుచు మకరి సరసికి
గరి దరికిని మకరి దిగుచు గరకరి బెరయన్
గరికి మకరి మకరికి గరి
భరమనుచును నతల కుతల భటులదిరిపడన్”

భావం:-
ఏనుగు మీద కోపంతో ఉన్న మొసలి ఏనుగును సరసులోకి లాగుతోంది. ఏనుగు మొసలిని ఒడ్డుకు లాగుతోంది. రానురాను ఏనుగుకి మొసలి భారమైంది. మొసలికి ఏనుగు భారమైంది. అతల కుతల లోకాలలో అంటే భూలోకానికి కింద ఉన్న లోకాల్లో వీరులు ఈ రెండిటినీ చూసి భయపడుతున్నారు.

అక్షర యోగ్యతా సంబంధం:-
ఏనుగు మొసలిని పట్టుకోవడం, మొసలి ఏనుగును తొక్కుతూ ఒడ్డు దాకా లాక్కురావడం, మళ్లీ మొసలి ఏనుగును సరసు మధ్యలోకి లాక్కెళ్లడం…ఒకపరికొకపరి పరి పరి విధాలుగా కరి- మకరి(మొసలి) పెనుగులాట అక్షరాల్లోనే ఒక దృశ్యంగా కనిపిస్తోంది. పలికితే వినిపిస్తోంది. ఏనుగు సర సర జారిపోతోంది. మొసలి బిర బిరా బిగిస్తోంది./

“అడిగెదనని కడువడి జను
నడిగిన దను మగుడ నుడవడని యుడుగన్
వడివడి జిడిముడి తడబడ
నడుగిడునడుగిడదు జడిమ నడుగిడునెడలన్”

భావం:-
తన భర్త విష్ణుమూర్తి హడావుడిగా ఎక్కడికి వెళుతున్నాడో అర్థం కాలేదు లక్ష్మీదేవికి. ఆ విషయం తెలుసుకోవాలనే ఉద్దేశంతో త్వరత్వరగా ఆయన వెంట పరుగె త్తింది. ఆ తొందరలో విషయం ఏమిటని అడిగినా ఆయన బదులు చెప్పడని ఠక్కున ఆగిపోతుంది. అంతలోనే కలవరపడుతూ ముందుకు అడుగు పెట్టింది. మళ్లీ అంతలోనే ఏ విషయమూ సరిగా చెప్పడనే భావనతో కదలక మెదలక నిలబడిపోయింది.

అక్షర యోగ్యతా సంబంధం:-
నడకలో తడబాటు. హడావుడి. అడిగితే ఒక గొడవ. అడక్కుంటే ఇబ్బంది. అన్ని పదాల్లో తడబడే గడబిడలో ఉన్న ‘డ’ అక్షరాన్ని బిగించాడు పోతన. ఇలాంటి అక్షర విన్యాసాన్ని అర్థం దెబ్బ తినకుండా చదవడానికి కూడా పెట్టి పుట్టాలి.

Babia Crocodile

“పాద ద్వంద్వము నేల మోపి, పవనున్‌ బంధించి పంచేంద్రియో
న్మాదంబున్‌ బరిమార్చి, బుద్ధి లతకున్‌ మాఱాకు హత్తించి, ని
ష్ఖేద బ్రహ్మ పదావలంబన రతిం గ్రీడించు యోగేంద్రు మ
ర్యాదన్‌ నక్రము విక్రమించె గరి పాదాక్రాంత నిర్వక్రమై”

భావం:-
మహాయోగి వాయువులు బంధించి తన పంచేంద్రియాల ఆడంబరాన్ని అణగార్చి, బుద్ధి తీగకు మారాకు పట్టించి, పట్టుదలగా దుఃఖ రాహిత్య ఆనందమయ పరబ్రహ్మ పదాన్ని అందుకొని ఆనందించినట్లు మొసలి ఊపిరి బిగబట్టి ఏనుగు కాళ్లను వదలకుండా గట్టిగా పట్టుకుని…జయింపరానిదై విజృంభించింది.

అక్షర యోగ్యతా సంబంధం:-
ఏనుగు గురించి అయితే మత్తేభ పద్య వృత్తం ఉండనే ఉంది. ఇక్కడ సందర్భం మొసలి బలం. ఏనుగుకు మత్తేభం ఉన్నట్లు దురదృష్టం కొద్దీ మొసలికి పద్య వృత్తం లేదు. ఉంటే పోతన ఆ వృత్తాన్నే వాడి ఉండేవాడు. ఏనుగుకు సింహం అంటే సింహస్వప్నం. నిద్రలో కూడా వణుకు. కుంభస్థలం మీద కొట్టే పులి పంజా దెబ్బలా మొసలి దెబ్బ కొట్టిందన్న సూచనకు ప్రతీకగా శార్దూల వృత్తం ఎంచుకున్నాడు.

మూడు పాదాలు అయి నాలుగో పాదం దగ్గరికి రాగానే…
నక్రము
విక్రమించె
పాదాక్రాంతము
నిర్వక్రమై అన్న పదాల్లో…
క లేదా కా అక్షరం కాలు పట్టుకున్నట్లు క్రావడి/ ర వత్తును బిగించాడు. పైన మూడు పాదాలను వదిలి కింద నాలుగో పాదాన్నే “పాదాక్రాంతం” మాటతో స్పష్టంగా, ఒడుపుగా, గట్టిగా పట్టుకోవడం అనన్యసామాన్యం. “పాదం”తో మొదలు పెట్టి “పాదాక్రాంతం”తో పద్య పాదాన్ని ముగించడం కూడా పద్య శిల్పంలో ఒక చమత్కృతి. ఏనుగు కాలు కింది భాగాన్నే మొసలి పట్టుకోవడానికి ఇది ప్రతీక. ఇక్కడ “క” ఏనుగు; దాని కింద క్రావడి/వత్తు మొసలి.

“నాభి హృత్కంఠ రసన నాసాదులయందు” అని శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే కీర్తనలో త్యాగయ్య గొప్ప మాటన్నాడు. మనం మాట్లాడే మాట పెదవి దగ్గర పుట్టదు. నాభి, ఊపిరితిత్తులు, కంఠం, నాలుక, ముక్కు, పెదవి…ఇలా ఒక్కో శబ్దం లేదా ఒక్కో అక్షరం పుట్టడానికి నాభి నుండి పెదవి దాకా ఒక్కో చోటు ఉంటుంది.

Babia Crocodile

శబ్దం పుట్టే చోటును బట్టి-
కంఠ్యాలు, తాలవ్యాలు, మూర్ధన్యాలు దంత్యాలు, ఓష్ఠ్యాలు, అనునాసికాలు, కంఠతాలవ్యాలు, కంఠోష్ఠ్యాలు అని వ్యాకరణం స్పష్టంగా గుర్తించి, విభజించింది.

ఈ సూత్రంతో పోతన వాడిన క్ర, క్రా లను గమనించండి. “ర” పలుకుతున్నప్పుడు నాలుక పై దవడకు మాత్రమే తగులుతుంది. “క్ర” పలికేప్పుడు నాలుకను వెనుకకు మడతపెట్టి, కింది దవడకు గట్టిగా తగిలించి, బలంగా పైకి తెస్తే తప్ప క్ర శబ్దం పుట్టదు. ఇక్కడ ఏట్లో మొసలికి నోట్లో నాలుక; రాసిన అక్షరం, పలికిన శబ్దం…అన్నీ ప్రతిరూపాలే. ప్రతినిధులే. ప్రతీకలే. పోతన ఇవన్నీ తెలిసే రాశాడు. కాకతాళీయం అనుకుంటే…మన అజ్ఞానాన్ని భార్యకు కూడా చెప్పకుండా అల వైకుంఠపురం మందార వనాల నుండి ఉన్నవాడు ఉన్నట్లు పరుగెత్తుకొచ్చిన మహా విష్ణువు కూడా క్షమించలేడు. ఈ పద్యానికి ముందు, వెనుక ఇతర సందర్భాల్లో పోతన అక్షరాలతో ఆవిష్కరించిన చిత్రాలు, దృశ్యాలే ఇది కాకతాళీయం కాదనడానికి పెద్ద రుజువు.

“నక్రామతీతి నక్రః.
కుంభినో గజాన్ రాతీతి కుంభీరః”
ఏనుగును పట్టి ఈడ్చుకుని వెళ్ళేది  అని అమరకోశం నక్రము, కుంభినో పదాలకు వ్యుత్పత్తి అర్ధం స్పష్టంగా చెబుతోంది.   మొసలికి మకరం, కుంభి, పదగ్రాహం, జలజిహ్వం ఇలా లేక్కలేనన్ని పర్యాయ పదాలు ఉండగా నక్రము అని ఆ ఒక్క మాటనే ఈ సందర్భంలో పోతన ఎందుకు వాడాడో చెప్పాల్సిన పనిలేదు.

తన్మయత్వంతో సంగీతం పాడేవారిని, వాయించే వారిని గమనిస్తే…ఆ రాగం, స్వరాలకు తగినట్లు వారి ముఖ కవళికలు, శరీరం కదలికలు మారిపోతూ ఉంటాయి. అంటే అందులో భావాన్నో, రూపాన్నో వారు దర్శిస్తుండాలి. అలానే రాసేవారు కూడా ఆ భావాన్ని, సందర్భాన్ని దర్శిస్తే, అనుభవిస్తే అక్షరం, శబ్దం, భావం, భాష అన్నిట్లో అదే ప్రతిఫలిస్తుంది. ఇదొక అక్షర యజ్ఞం. అక్షర యోగసిద్ధి.

Babia Crocodile

అందుకే జాషువా అన్నాడు-
“పోతనార్యుని గేహమున భారతీ దేవి చిగురుజేతుల వంట చేయునాడు” అని. పూరి గుడిసెలో ఒక పక్క భాగవతం రాస్తూ…మరో పక్క కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ ఇబ్బంది పడుతున్న పోతనను చూసి…చలించిపోయిన సరస్వతి… “నాయనా! నువ్ భాగవతం రాసుకో! నేను వంట చేస్తాలే”...అని పొయ్యి ముందు కూర్చుందట.

భావానికి తగిన భాష; భావానికి తగిన శబ్దం; సందర్భానికి తగిన అక్షరాలను ఇలా కూర్చగల నేర్పు ప్రపంచంలో ఎందరికుందో? ఇలాంటి అవకాశం ప్రపంచంలో ఎన్ని భాషలకుందో నాకయితే తెలియదు గానీ…తెలుగులో ఉన్నందుకు గర్విస్తాను. అలాంటి తెలుగుతో పోతన వ్రేపల్లె, మధుర, ద్వారక నుండి శ్రీకృష్ణుడిని తెచ్చి తెలుగు రోకటికి కట్టి పడేసినందుకు పులకిస్తాను.

Babia Crocodile

ఇంతకూ-
ఈ గజేంద్ర మోక్షణం, పోతన, పద్యం, కాలు, మొసలి, క్రావడికి నేపథ్యం ఏమిటంటే…
కేరళ గుడి కొలనులో దశాబ్దాలుగా శాకాహారిగా దేవుడికి నైవేద్యం పెట్టిన బెల్లం ప్రసాదం తింటూ కృష్ణా! రామా! అనుకుంటూ సన్యాసి జీవితం గడిపిన ఒక మొసలి వయసు మళ్ళి మరణించింది. చుట్టు పక్కల ఊళ్ల జనం మొసలి కన్నీరు కార్చకుండా నిజంగా కన్నీరు మున్నీరు అయ్యారు. మొసలి మెడలో పూల హారాలు వేసి, బరువెక్కిన గుండెలతో అంతిమ సంస్కారాలు చేశారు.

అనంత పద్మనాభుడి గుడి కొలనులో మొసలి అది. ఏ గూటి పక్షి ఆ పాటే పాడుతుంది అన్నట్లు- ఆ గుడి కొలనులో మొసలి ఆ దేవుడి మాటే విన్నట్లుంది.

కాళహస్తిలో నోరు లేని సాలె పురుగు, పాము, ఏనుగు కూడా మోక్షం పొందాయి…మనిషిగా నాకెప్పటికో మోక్షం అన్నాడు ధూర్జటి.

ఏ ధూర్జటి చెప్పాలి ఈ మొసలి శాకాహార వ్రత నియమం గురించి?

ఏ పోతన రాయాలి ఈ మకరి మోక్షణ భాగవతం గురించి?

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

నీటిపై తేలుతూ వచ్చిన వరదరాజస్వామి

Also Read :

తిరుపతిలో గౌరిపెద్ది విగ్రహావిష్కరణ

RELATED ARTICLES

Most Popular

న్యూస్