Saturday, January 18, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంయాక్టర్ నుంచి డాక్టరేట్ వరకు

యాక్టర్ నుంచి డాక్టరేట్ వరకు

Swaroop Sampat : హీరోయిన్స్ సినిమాల్లో టీచర్ పాత్రలో నటించడం మామూలే. కానీ నిజజీవితంలో పోషించడం చాలా అరుదు. తళుకు బెళుకుల తారాలోకం హంగులు, విలాసాలకు దూరంగా విద్యావ్యవస్థకు అండగా నిలబడిన అసలైన హీరోయిన్ స్వరూప్ సంపత్ముఖ్యంగా వికలాంగులు, ఇతర సమస్యలున్నవారిని చూసి చలించిపోయి ఉపాధ్యాయినిగా మారి అనితర సేవలందిస్తున్న అందాల రాణి, నటి ఈమె మాత్రమే.

స్వరూప్ సంపత్ … ఎనభై నుంచి తొంభైయ్యవ దశకం వరకు ఇంటింటా చిరపరిచితమైన పేరు. అప్పటికే సింగార్ కుంకుమ్ వంటి ప్రకటనల ద్వారా గుర్తింపు ఉంది. ‘ఏ జో హై జిందగీ ‘ అనే సీరియల్ తో దేశవ్యాప్తంగా ఇంటింటికి ‘రేణు’ గా పరిచయమై దగ్గరైంది. కొన్ని సినిమాల్లోనూ నటించింది. తండ్రి గుజరాతీ నటుడు. తల్లి డాక్టర్ . సహజంగానే ఆ ప్రభావం ఉండేది.  మిత్రులు సన్నిహితుల ప్రోత్సాహంతో అంతగా ఇష్టం లేకపోయినా 1979 లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని టైటిల్ సాధించింది. ఆ తర్వాత ప్రకటనలు, నటనలో అవకాశాలు చాలా వచ్చాయి. నటుడు పరేష్ రావల్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాక మెల్లగా తానే అవకాశాలు తగ్గించుకుంది. కుటుంబం పైన దృష్టి పెట్టింది . అప్పుడే ఆమె విద్యావిధానాన్ని నిశితంగా పరిశీలించింది. ముఖ్యంగా వికలాంగులు, మానసిక సమస్యలున్న పిల్లలు చదువుకోడంలో ఇబ్బందులు గమనించింది. దాన్ని సరి చేయాలనుకుంది.

 Swaroop Santosh

టీచింగ్ మెథడ్స్ లో వర్సెస్టర్ యూనివర్సిటీ నుంచి పీహెడీ చేసింది. విద్యా వ్యవస్థలో లోపాలను సవరించమంటూ ప్రభుత్వానికి లేఖలు రాసేది. కళలు, చర్చలు పిల్లలలో చదువుకు సంబంధించిన సమస్యలు ఎలా పరిష్కరిస్తాయో చేసి చూపింది. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ స్వరూప్ విధానాలు మెచ్చుకుని గుజరాత్ మాస్టర్జీ అని పిలిచేవారు. ఆమెకు సంబంధిత బాధ్యతలు అప్పగించారు.మెల్లగా స్వరూప్ అనేక జాతీయ, అంతర్జాతీయ సెమినార్లలో తన పరిశోధనా వివరాలు సమర్పించారు. ఎన్నో అవార్డులందుకున్నారు. యూనివర్సల్ టీచింగ్ మెథడ్ అభివృద్ధి చేశారు.

సేవ్ ది చిల్డ్రన్ సంస్థ ద్వారా ఎందరో పిల్లలను బడికి పంపించారు . విద్యా విధానాలపై టీచర్లకు అవగాహన కలిగించారు. గ్లోబల్ టీచర్ అవార్డుకు పోటీపడ్డారు. కొన్ని వేల అప్లికేషన్స్ నుంచి ఎంపిక చేసిన పదిమంది జాబితాలో స్వరూప్ పేరు ఉండటం విశేషం. చక్కటి సంస్థ స్థాపించి విద్యార్థులకు మరింత మేలుచేయాలని ఉందనే స్వరూప్ తారే జమీన్ పర్ సినిమా ప్రేరణతో డిస్లెక్సియా వంటి సమస్యల గురించి పుస్తకం రచించారు. యాక్టర్ నుంచి డాక్టర్ వరకు స్వరూప్ సంపత్ జీవనయానం స్ఫూర్తిదాయకం.  రెండ్రోజుల క్రితం దేశవ్యాప్తంగా  గురుపూర్ణిమ  ఘనంగా జరుపుకున్న సందర్భంలో ఇలాంటి అరుదైన గురువులను స్మరించుకోవడం ఎంతో అవసరం. స్వరూప్ సంపత్ కు శుభాభినందనలు.

-కె. శోభ

Also Read :

పట్టుదలతో ఉన్నత శిఖరాలకు…..

RELATED ARTICLES

Most Popular

న్యూస్