Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

ఏడవాలో? నవ్వాలో? అర్థం కాని వార్త ఇది. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి వేగానికి, ఉధృతికి దేశంలో ఏ ఆసుపత్రిలో బెడ్లు చాలడం లేదు. ఐ సి యూ ల్లో వెంటిలేటర్లు చాలడం లేదు. ఆక్సిజన్ సిలిండర్లు చాలడం లేదు. చివరకు- వల్లకాట్లో చోటు కూడా చాలడం లేదు. మరణ దూత తీక్షణమయిన దృష్టులతో అవని పాలించే భస్మ సింహాసనమయిన శ్మశానం కూడా తొలిసారి ఎడతెరిపిలేకుండా వస్తున్న శవాలను బూడిద చేయలేక నెత్తి కొట్టుకుంటోంది. శ్మశానాలకు తొలిసారి ఊపిరి ఆడడం లేదు.

అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ అధిపతి నుండి పదో తరగతి పది సార్లు ఫెయిలయినవారి వరకు అందరూ ఇప్పుడు వైద్యం గురించి తప్ప వేరే మాట్లాడ్డం లేదు. నిజానికి కరోనాకు ప్రత్యేకమయిన వైద్యం ఇంతదాకా లేనే లేదు. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం … ఇలా విడి విడి లక్షణాలకు ఏ మందులు వాడుతున్నారో స్థూలంగా అవే కరోనాకు కూడా వాడుతున్నారు. రోగులు వైద్యం గురించి చెబుతుంటే వైద్యులు వినాల్సిన రోజులొచ్చాయి. ఖర్మ కొద్దీ కరోనాకు తోడు- సామాజిక మాధ్యమాల వైద్యం కూడా రాజ్యమేలుతోంది. వాట్సాప్ ను మించిన వైద్యుడు లేడన్నది రోగుల బలమయిన నమ్మకం. యూ ట్యూబ్ ను మించిన సర్జన్ ఉండడు అన్నది రోగుల అనుభవం. ఎన్నడూ చూడని డ్రై ఫ్రూట్స్ కొండలు కరుగుతున్నాయి. సి విటమిన్ , డి విటమిన్ బిళ్లలు భోంచేస్తున్నారు.

 

The Rich now bring hospitals into their homes india

ఎకనామిక్ టైమ్స్ లో ఒక వార్త వచ్చింది. భారత దేశంలో సంపన్నులు ఇళ్లనే ఆసుపత్రులుగా మార్చుకుంటున్నారు. నిజమే. డబ్బుంటే కొండ మీద కోతే దిగి వస్తుంది. అలాంటిది ఐ సి యూ వెంటిలేటర్ ఇంటికి రాదా? నాన్ ఇన్వేసివ్ వెంటిలేటర్ అంటే ఇళ్లల్లో ఏర్పాటు చేసుకోదగ్గ వెంటిలేటర్లు యాభైవేల నుండి రెండున్నర లక్షల లోపల దొరుకుతున్నాయి. సంపన్నులు ఆసుపత్రులకు పోవడం మానేసి- వీటిని కొని ఇంట్లో ఒక గదిని ఐ సి యు గా మార్చుకుంటున్నారు. ఇంట్లో కోవిడ్ కేర్ కు ఇలాంటి పరికరాలతో రోజుకు పదిహేను వేల నుండి పాతిక వేల దాకా ఖర్చు అవుతుంది. నెలకు ఏడున్నర లక్షలు. సంవత్సరానికి దాదాపు కోటి. అంతే కదా? హాయిగా ఇంట్లోనే కోలుకోవచ్చు.

ఈ వార్త విచిత్రంగా ఉన్నా తాత్వికంగా ఇందులో ఎన్నో రహస్యాలు, ఎన్నెన్నో అంతరార్థాలు దాగి ఉన్నాయి.

“ఇల్లు ఇల్లంటావు
ఇల్లాలు అంటావు
నీ ఇల్లు ఎక్కడే చిలకా?
అల్లంతదూరాన వల్లకాటిలోన
నీ ఇల్లు ఉన్నదే చిలుకా!
అస్తిరమ్ములయిన ఆస్తిపాస్తులకొరకు
గస్తీలు నీకేల చిలుకా!
జబ్బ పుచ్చుకు యముడు దబ్బు దబ్బున లాగ
తబ్బిబ్బు పడనేల చిలుకా!”

అని అజ్ఞాత రచయిత తత్త్వం అనాదిగా ప్రచారంలో ఉంది. “అనాయాసేన మరణం- వినా దైన్యేన జీవనం” అని గుడిలో దేవుడి దర్శనం తరువాత ఒక సెకెను కూర్చుని అనుకోవాలని ఆచారం. ఎప్పుడో పడవల్లో ప్రయాణం చేసినప్పటి ఆచారమిది. ఇప్పుడు జెట్లు, రాకెట్లు వచ్చేశాయి. అన్నిట్లో స్పీడ్ పెరిగింది. ఐ సి యూ కూడా రెక్కలు కట్టుకుని ఇంటికి ఎగిరి వస్తోంది. వెంటిలేటర్ వంటింట్లో మన చుట్టూనే తిరుగుతోంది.

అనాయాసంతో మరణం ఇప్పుడు తప్పు కాదు. వినా దైన్యేన జీవనం ఇప్పటి ఆదర్శం కాదు!

-పమిడికాల్వ మధుసూదన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com