Penugonda Sculpture: పెనుగొండలో శిల్పం కులుకు చూపులు చూస్తోంది. సిగ్గు తెరల మాటున నిలుచున్న సజీవ శిల్పం ఎవరి భావలతకు పూచిన పువ్వో!
నునులేత చర్మానికి అంటీ అంటనట్లుండే కుచ్చిళ్ళ పట్టు పావడలు కట్టుకున్న యువతుల శిల్పాలు, శరీర లావణ్యం కొట్టొచ్చినట్లు కనపడే శిల్పాలు కళ్లను కట్టి పడేస్తాయి.
తేనెలో ఉలిని చిలికి కనుకొనలను చెక్కారేమో! శిల్పాల కడగంట మధురభావాలు దోబూచులాడుతున్నాయి.
నాలుగు వందల ఏళ్ల వయసు మీద పడ్డా ఈ శిల్పాలకు వార్ధక్యం రాలేదు. ప్రకృతిలో ఉన్న అందాన్నంతా పోతపోసి ఈ శిల్పాలుగా తీర్చి దిద్దినట్లున్నారు.
మెలికలు తిరిగిన శిల్పాల నుదుటి మీద ముంగురుల అందాన్ని కూడా శిల్పి వదిలిపెట్టలేదు. పాయలు దీసి ముడి వేసిన జుట్లు, పాపట బొట్టు, కనుబొమల మధ్య సమంగా దిద్దిన కుంకుమ బొట్టు, సర్వాభరణాలతో ముద్దులు మూటగట్టిన శిల్పాలివి.
సత్కవి అంతరంగంలో అందమైన భావనలకు అద్దాల్లా ఉన్నాయి ఈ శిల్పాలు. కాటుక కళ్లతో వాలుచూపులు విసిరే ఈ శిల్పాలను తీర్చి దిద్దిన శిల్పుల నైపుణ్యం ఊహాతీతం.
మండపాలకు రాతి గొలుసులు తీర్చారు. స్తంభాలకు తీగలు పాకించారు. గోడలకు చిత్రాలు వేశారు. ద్వారాలకు రాతి పూల హారాలను వేలాడదీశారు. రాతిని మైనం ముద్దలా మలచిన వీరి పనితనం చూస్తే… తలవంచి నమస్కరించాలనిపిస్తుంది.
మహమ్మదీయ రాజుల దాడుల్లో పెనుగొండ సౌందర్యం దెబ్బతింది. వల్లకాట్లో పెరిగిన మల్లె చెట్టులా అక్కడక్కడా ఒకటి అరా ఆనాటి వైభవానికి గుర్తుగా మిగిలి ఉన్నాయి.
బహమనీ పాదుషాల పగకు పెనుగొండ బలి అయిపోయింది. శిల్పకళా ప్రపంచం గుండె చెదిరింది. విధ్వంసం శిథిలాలను మిగిల్చింది.
ఆగ్రాకు మల్లెదండలా ఆకాశాన్ని కౌగిలించే గొప్ప తాజమహలు నిర్మించాడని షాజహానును పొగుడుతూనే ఉన్నాము కదా! మరి ఆ పాదులోనే పెరిగిన పాదుషాలు హంపీలో, పెనుగొండలో ఇంతటి కళా సౌధాలను నేల మట్టం చేయడానికి చేతులెలా వచ్చాయో? మతం పేరిట చెరిచిన కళ ఎంతగా రోదిస్తోందో!
రేపు:
పెనుగొండలక్ష్మి-10
“గగనమహలు”
-పమిడికాల్వ మధుసూదన్
9989090018