సముద్రఖని .. తెలుగు తెరపై పెర్ఫెక్ట్ విలన్. డైలాగ్స్ తో అరిచిగోల పెట్టడం అలవాటు లేని విలన్. కంటి చూపుతోనే హీరోను కంగారు పెట్టగలిగిన విలన్. ఆయన బాడీ లాంగ్వేజ్ … డైలాగ్ డెలివరీ ఆడియన్స్ కి బాగా నచ్చుతాయి. తాను వచ్చింది కోలీవుడ్ నుంచి అయినప్పటికీ, తెలుగులో తన పాత్రకి తానే డబ్బింగ్ చెప్పుకోవడం ఆయనకి అలవాటు. ప్రస్తుతం ఆయన తెలుగులో స్టార్ విలన్. నటుడిగా ఇక్కడ ఆయన జోరు పెరుగుతూ వస్తోంది. సముద్రఖనిని తీసుకోవడానికి మేకర్స్ ఉత్సాహాన్ని చూపిస్తున్నారు.
తమిళంలో కూడా నటుడిగా సముద్రఖని బిజీగానే ఉన్నాడు. అక్కడ ఆయన ఆర్టిస్ట్ కనుక,నటుడిగానే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడని చాలామంది అనుకుంటారు. ఒక ఆర్టిస్ట్ గా వచ్చిన ఆయన, పవన్ తో సినిమా చేయడమేంటని అనుకున్నవారు కూడా లేకపోలేదు. ఎందుకంటే కోలీవుడ్ లో ఆయన స్టార్ డైరెక్టర్ అనే విషయం చాలా కొంతమందికి మాత్రమే తెలుసు. అందువల్లనే ఆయనకి ఛాన్స్ ఇవ్వడానికి పవన్ కల్యాణ్ పెద్దగా ఆలోచన చేయలేదు. పవన్ కోరుకున్నట్టుగానే 21 రోజుల్లో ఆయన పోర్షన్ ను పూర్తి చేసిన డైరెక్టర్ సముద్రఖని. అలా వారి కాంబినేషన్లో వచ్చిన సినిమానే ‘బ్రో’.
పవన్ తో ఇన్ని తక్కువ రోజులు షూటింగు చేసి ఇంత పెద్ద హిట్ ఇచ్చిన దర్శకుడు సముద్రఖని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు పవన్ ఖాతాలో ఈ సక్సెస్ వేసి .. ఆయన హ్యాట్రిక్ హిట్ అందుకోవడానికి కారణమయ్యాడు. అలాగే చాలా తక్కువ గ్యాపులో సాయితేజ్ రెండో హిట్ ను అందుకోవడంలో ముఖ్యమైన పాత్రను పోషించాడు. 3 రోజుల్లోనే ఈ సినిమాను దాదాపు 100 కోట్ల వసూళ్ల వరకూ తీసుకుని వెళ్లాడు. అందువలన ఇకపై సముద్రఖని ఇక్కడి స్టార్ హీరోలతో దర్శకుడిగా వరుస సినిమాలు చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.