Tuesday, September 24, 2024
HomeTrending Newsతెలంగాణ రోడ్లన్నీ శాటిలైట్ సిస్టంతో మ్యాపింగ్

తెలంగాణ రోడ్లన్నీ శాటిలైట్ సిస్టంతో మ్యాపింగ్

రాష్ట్రంలోని రోడ్లన్నింటినీ శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ సిస్టంతో మ్యాపింగ్ చేయనున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. మంత్రుల నివాసంలోని క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రిమోట్ సెన్సింగ్ అప్లికేషన్ సెంటర్ ( ట్రాక్ ) ( Telangana Remote Sensing Application Centre — TRAC ) అదనపు డైరెక్టర్ జనరల్ జీ. శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో సైంటిస్టులు, అధికారులు వినోద్ కుమార్ తో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా వినోద్ కుమార్ ట్రాక్ ఏ.డీ.జీ., అధికారులు, సైంటిస్టులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో పంచాయతీ రాజ్, రోడ్లు – భవనాలు, స్టేట్ హైవేస్, నేషనల్ హైవేస్ వంటి నాలుగు రకాల రోడ్లు ఉన్నాయని.. ఈ రోడ్ల పొడవు, వెడల్పు స్థితిగతులను, రోడ్డు మార్గమధ్యలో కల్వర్టులు, బ్రిడ్జిల అవశ్యకతను శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ సిస్టం ద్వారా మ్యాపింగ్ చేయనున్నట్లు పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఇప్పటికే గ్రామ మండల జిల్లా రాష్ట్రస్థాయిలో డబుల్ రోడ్లు నాలుగు లైన్ల రోడ్లు ఉన్నాయని ప్రతి గ్రామానికి రోడ్డు కనెక్టివిటీ సౌకర్యం ఉందని వినోద్ కుమార్ వివరించారు. భవిష్యత్తులో షార్ట్ కట్ రోడ్స్ కనెక్టివిటీ సిస్టం కోసం శాటిలైట్ మ్యాపింగ్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వినోద్ కుమార్ తెలిపారు.

సిస్టం రోడ్ మ్యాపింగ్ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికకు గైడ్ గా ఉపయోగపడుతుందని వినోద్ కుమార్ అన్నారు.

నిర్ణీత గడువులోగా రోడ్డు శాటిలైట్ మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని వినోద్ కుమార్ అధికారులకు సూచించారు.

ఈ సమావేశంలో ట్రాక్ సంస్థ ఏ.డీ.జీ. శ్రీనివాస్ రెడ్డితోపాటు అధికారులు రాజోజు నరసింహ చారి, మోహన్ రెడ్డి, బాలకృష్ణ, గౌతమ్, ప్రకాష్, భాస్కర్ రెడ్డి, అశ్విన్, కమలాకర్, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్