Kiwis Power: బంగ్లాదేశ్ తో జరుగుతోన్న రెండో టెస్టులో న్యూ జిలాండ్ తమ ప్రతాపం చూపింది. తొలి టెస్టులో ఎదురైన ఓటమికి దీటుగా బదులిచ్చింది. తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్లకు 526 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిన కీవీస్, బంగ్లాను తొలి ఇన్నింగ్స్ లో 126 పరుగులకే ఆలౌట్ చేసి 395 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. కివీస్ బౌలర్లు సౌతీ, బౌల్ట్ బంగ్లా బ్యాట్స్ మెన్ ను ముప్పు తిప్పలు పెట్టారు. బౌల్ట్ ఐదు వికెట్లు తీసుకుని టెస్టుల్లో 300 వికెట్ల మైలురాయిని చేరుకోవడంతో పాటు తోమ్మిదోసారి ఐదు వికెట్ల మార్కును అందుకున్నాడు.

ఒక వికెట్ నష్టానికి 349 పరుగుల ఓవర్ నైట్ స్కోరు వద్ద నేడు రెండోరోజు ఆట కివీస్ ప్రారంభించింది. నిన్న 186 పరుగులు చేసిన కెప్టెన్ లాథమ్ డబుల్ సెంచరీ దాటి 252 పరుగుల వద్ద మొనిముల్ బౌలింగ్ లో ఔటయ్యాడు. నిన్న సెంచరీ కి ఒక పరుగు దూరంలో ఉన్న కాన్వె 109 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు.  ఆ తర్వాత రాస్ టేలర్ ­28 చేయగా టామ్ బ్లండేల్ అర్ధ సెంచరీ (57) సాధించాడు. బంగ్లా బౌలర్లలో షోరిఫుల్ ఇస్లామ్, ఎబాదోత్ హోస్సేన్ చెరో రెండు; కెప్టెన్ మొనిముల్ ఒక వికెట్ పడగొట్టారు.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా వెంట వెంట వికెట్లు కోల్పోయింది, కీలక భాగస్వామ్యం నమోదు చేయడంలో బ్యాట్స్ మెన్ విఫలమయ్యారు. ఏడు పరుగులకే తొలి వికెట్ (షాద్ మాన్ హుస్సేన్-7) కోల్పోయింది, స్కోరు 11వద్ద మూడు వికెట్లు కోల్పోయి (మహ్మద్ నయీమ్-0, నజ్ముల్ హుస్సేన్ శాంతో-4, కెప్టెన్ మొనిముల్ హక్-0) కష్టాల్లో పడింది.  మొత్తం జట్టులో ఇద్దరు ఆటగాళ్ళు యాసిర్ అలీ-55; నూరుల్ హుస్సేన్-41 మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ ఐదు, టిమ్ సౌతీ మూడు, కేల్ జేమిసన్ రెండు వికెట్లు పడగొట్టారు.

Also Read : బంగ్లాదేశ్ తో రెండో టెస్ట్- న్యూజిలాండ్ 349/1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *