Trs Rastaroko : రాష్ట్రంలో జాతీయ రహదారులపై టీఆర్ఎస్ పార్టీ రాస్తారోకోలు, ఆందోళనలు చేపట్టింది. తెలంగాణలో రైతులు పండించిన యాసంగి వరి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొని తీరాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పాటు కార్యకర్తలు ధర్నాలకు దిగారు. పలు చోట్ల రహదారులపై నాయకులు బైఠాయించారు. నాగపూర్, ముంబై, బెంగళూరు, విజయవాడ జాతీయ రహదారులపై నిరసన తెలుపాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
బుధవారం ఆయా జాతీయ రహదారులు వెళ్లే నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొని, రాష్ట్ర రైతాంగం పక్షాన టీఆర్‌ఎస్ ధర్మాగ్రహాన్ని ప్రకటిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సూర్యాపేట జిల్లాలో జగదీశ్‌రెడ్డి, జనగామ జిల్లాలో ఎర్రబెల్లి దయాకర్‌రావు, నిర్మల్ జిల్లా కడ్తాల్ జంక్షన్ వద్ద ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, రైతుబంధు సమితి బాధ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
వరి ధాన్యం కొనుగోలు చేసేవరకు కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కొట్లాడుతామని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. తెలంగాణలో యాసంగిలో పండించిన రైతులు పండించిన ధాన్యాన్ని పంజాబ్ తరహాలో కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం నాగ్ పూర్ జాతీయ రహదారిపై కడ్తాల్ జంక్షన్ వద్ద రైతులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిదులు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. జాతీయ రహదారిపై బైటాయించి రైతులను అరిగోస పెడుతున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల పక్షనా దర్నా చేస్తున్న వారికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంఘీభావం తెలిపారు. వరి ధాన్యం కొనుగోళ్ళలో కేంద్ర వైఖరిని నిరసనగా వరి గొలుసులను ప్రదర్శించి, నాగలి పట్టారు.
Also Read : ధాన్యం కొనుగోలు కోసం తెరాస ఎంపీల ఆందోళన