Saturday, May 11, 2024
HomeTrending Newsరేవంతుడి ముందు కొండంత లక్ష్యం

రేవంతుడి ముందు కొండంత లక్ష్యం

తెలంగాణ కాంగ్రెస్ లో ఇంతవరకు నెలకొన్న సస్పెన్స్ కు అధినాయకత్వం ఎట్టకేలకు తెరదించింది. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని యువనేత, మల్కాజిగిరి పార్లమెంటు సభ్యుడు రేవంత్ రెడ్డికి కట్టబెట్టింది. చర్చోపచర్చలు, రాయ’బేరా’లు, అలకలు, బుజ్జగింపుల నడుమ… నెలలు నెలలుగా నానబెట్టి భేషైన నిర్ణయం తీసుకుంది. వేరే పార్టీ నుంచి వచ్చిన వారికి పార్టీ పగ్గాలు ఇస్తే ఊరుకోము అంటూ ఆ పార్టీ సీనియర్లు ఎంత మొత్తుకున్నా రేసులో ముందు వరుసలో నిలిచి, అధిష్ఠానం పెద్దల  దృష్టిలో పడి, ఇటు పార్టీ కార్యకర్తల దృష్టినీ ఆకర్షించిన రేవంత్ రెడ్డికే  ఆ అదృష్టం వరించింది. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి అగమ్యగోచరంగా వుంది.

ఒకరికొకరు పొసగని నేతలు, పొంతన లేని అభిప్రాయాలు రాష్ట్రంలో కాంగ్రెస్ భవిష్యత్తు ఏంటన్న మీమాంస నడుమ, కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో రేవంత్ పగ్గాలు చేపడుతున్నారు. తన హస్త వాసిని పరీక్షించుకుంటూనే, పార్టీ హస్తవాసిని మార్చే బాధ్యత ఇప్పుడు ఈ యువనాయకుడిపై పడింది. కురువృధ్దులతో కుంచించుకు పోతున్న టీ-కాంగ్రెస్ కు తిరిగి జవసత్వాలు తీసుకురావాల్సిన బరువైన బాధ్యతను మల్కాజిగిరి ఎంపీ మల్లయోధుడిలా తలకెత్తుకున్నారు. చూడడానికి బక్కపల్చగా కనిపించినా, రాజకీయ కదన రంగంలో వైరి పక్షాన్ని సమర్థంగా ఎదుర్కొనే సత్తా, తన దళాన్ని ముందుకు ఉరికించే చతురత ఈ యువనేతకు మెండుగానే ఉన్నాయి.

అధికార టీఆర్ఎస్ ను, ముఖ్యమంత్రి కేసీఆర్ ను సమయానుకూలంగా  విమర్శిస్తూ కాంగ్రెస్ లో చేరిన నాటి నుంచి రేవంత్ తన వాణిని సమర్థంగా వినిపిస్తూ వస్తున్నారు. సై అంటే సై అంటూ ముందుకురికి వైరి పక్షాలకు కొరకరాని కొయ్యగా మారారు. ఇంతవరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, యువ నేతగా, ఎంపీగా దూకుడు ప్రదర్శిస్తూ వచ్చిన రేవంత్ రెడ్డి, పార్టీని చక్కదిద్దాలి అంటే కార్యకర్తల్లో తిరిగి ఉత్సాహం తీసుకు రావాలి అంటే- పార్టీ పగ్గాలు ఈయనకే అప్పగించాలని అందరితో అనిపించుకున్నారు. టీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పార్టీ సీనియర్లతో పోటీ పడ్డారు. అందర్నీ ఒప్పించి మెప్పించగలిగారు.

అయితే పిసీసీ పీఠం ఆశించి భంగపడిన పార్టీలో తన సీనియర్లను రేవంత్  ఎలా కలుపుకొని వెళతారన్నది   మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. నల్గొండ జిల్లాకు చెందిన మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి కోసం ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఈమారు చివరి క్షణం వరకూ ఈయన పేరు వినిపించింది. మరోవైపు విహెచ్ వంటి సీనియర్ నేత, రేవంత్ రెడ్డిని డైరెక్ట్ గానే టార్గెట్ చేశారు. వి.హనుమంతరావుతో గొంతు కలిపి రేవంత్ ను వ్యతిరేకీంచిన మరో సీనియర్ నేత జగ్గారెడ్డి కి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ల జాబితాలో స్థానం కల్పించి బుజ్జగించారు. అయితే అందరినీ మెప్పించి, ఒప్పించడం అంత తేలికేమీ కాదు.

 

తనను టీపీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ నుంచి ప్రకటన రాగానే రేవంత్ రెడ్డి పార్టీ సీనియర్ల నివాసాలకు వెళ్లి వారి వారి ఆశీస్సులు తీసుకునే ప్రయత్నం చేయడం ద్వారా  అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నాల్లో రేవంత్ వ్యూహాత్మకంగా ఒక అడుగు ముందుకు వేశారు. జానారెడ్డి, షబ్బీర్ అలీ, శాసనసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఇండ్లకు వెళ్లి ఆశీస్సులు పొందారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమ బంధువే అంటూ అందరినీ కలుపుకొని పోతానన్న సంకేతాలు ఇచ్చారు. తెలుగుదేశం నుంచి వచ్చి కాంగ్రెస్ లో కీలక నేతగా ఎదిగిన రేవంత్ , కాంగ్రెస్ కల్చర్ నరనరానా జీర్ణించుకున్న సీనియర్లను ఎలా కలుపుకొని పోతారు… వ్యతిరేకంగా పనిచేసే వారిని ఎలా అడ్డు కుంటారన్న అనుమానాలూ ఇప్పటి నుంచే మొదలయ్యాయి. ఎన్నికలలో ఘోర పరాభవాలను చవిచూస్తూ వస్తున్న టీ-కాంగ్రెస్ నుంచి పలువురు కీలక నేతలు పార్టీకి హ్యాండిచ్చి, టీఆర్ఎస్, బీజేపీల బాట పట్టారు. కింద నుంచి పైవరకూ మరికొందరు నేతలు పార్టీ మారేందుకు సిద్దంగా వున్నారు. ఈ పరిణామాలలో ఇంకెవ్వరూ పార్టీని వీడకుండా కట్టడి చేయడం, పార్టీని తిరిగి బలోపేతం చేయడం రేవంత్ ముందున్న పెను సవాల్ గా చెప్పవచ్చు.

మరోవైపు, కార్యనిర్వాహక అధ్యక్షులుగా అజారుద్దీన్‌, గీతారెడ్డి, ఎం.అంజన్‌కుమార్‌ యాదవ్‌, టి.జగ్గారెడ్డి, బి.మహేశ్‌కుమార్‌ గౌడ్‌లను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఉపాధ్యక్షులుగా సంభాని చంద్రశేఖర్‌ , దామోదర్‌రెడ్డి, రవి మల్లు, పొడెం వీరయ్య, సురేశ్‌ షెట్కార్‌, వేం నరేందర్‌రెడ్డి, రమేశ్‌ ముదిరాజ్‌, గోపిశెట్టి నిరంజన్‌, టి.కుమార్‌ రావు, జావేద్‌ ఆమీర్‌‌ వంటి సీనియర్ల కు అవకాశం ఇచ్చింది. . ప్రచార కమిటీకి ఛైర్మన్‌గా మధు యాస్కీ గౌడ్‌, కన్వీనర్‌గా సయ్యద్‌ అజమ్‌తుల్లా హుస్సేనీ, ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా దామోదర్‌ సి.రాజ నర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌గా ఆలేటి మహేశ్వరరెడ్డి నియమితులయ్యారు.

అయితే ఈ జాబితాలో ముగ్గురు నలుగురు మినహా మిగిలిన వారంతా పీసీసీ సారధిగా రేవంత్ రెడ్డి కి అండగా నిలిచేవారేనని ఆ జాగ్రత్తలు ముందు గానే అధిష్ఠానం తీసుకుందన్న వార్తలూ వస్తున్నాయి.ఈ నేపథ్యంలో రేవంత్ దూకుడు వైఖరిని కొంత తగ్గించి, అందరినీ ఐక్యం చేయగలిగితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తిరిగి బట్ట కట్టగలుగుతుంది. పార్టీలో ప్రజాస్వామ్యం అంటూ పార్టీ వేదికలపైనే రెచ్చిపోయే కాంగ్రెస్ కల్చర్ లో పీసీసీ అధ్యక్షుడు గా రేవంత్ పెను భారాన్ని మోయాల్సిందే. ప్రస్తుతం రాబోయే హుజూరాబాద్ ఉప ఎన్నిక ఈ యువనేత ముందున్న ప్రధమ లక్ష్యం కాగా, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పక్కాగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి వుంది. అగ్రెసివ్ లీడర్ గా రేవంత్ ఎంత వరకు ముందుకు వెళ్ళతారన్నది వేచి చూడాలి.  రేవంత్ సారధ్యంలో టీ-కాంగ్రెస్ హస్తవాసి ఎలా మారుతుందో చూడాలి.

– వెలది.కృష్ణకుమార్

RELATED ARTICLES

Most Popular

న్యూస్