Vangara Venkata Subbaiah:
తెలుగు సినిమా మాట నేర్చుకుని .. తడబడుతున్న అడుగులను సరిచేసుకుంటూ నడక నేర్చుకుంటున్న రోజులవి. అప్పటివరకూ నాటకాలే అందరికీ వినోదాన్ని కలిగిస్తూ ఉండేవి. ఆ కాలంలో నాటకాలలో అనుభవం ఉన్నవారిని మాత్రమే సినిమాల్లోకి తీసుకునేవారు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఎవరి మాట వాళ్లు మాట్లాడవలసిందే. ఎవరి పాటలను .. పద్యాలను వాళ్లు పాడుకోవలసిందే. అందువలన ప్రధానమైన పాత్రలను పోషించాలనుకువేవారికి రూపంతో పాటు నాటకానుభవం తప్పనిసరి. అలాగే మంచి గాత్రం ఉండటం అంతే అవసరం.
ఇక ఇతర పాత్రలను చేయాలకునేవారికి నాటకానుభవం .. డైలాగ్ చెప్పడంలో స్పష్టత ఉంటే సరిపోతుంది. ఆ ధైర్యంతోనే వంగర వెంకట సుబ్బయ్య కూడా అప్పట్లో మద్రాసు బాట పట్టారు. అందరూ కూడా ఆయనను ‘వంగర’ అనే పిలుస్తుండేవారు. 1897 నవంబర్ 24వ తేదీన ఆయన ఒంగోలు తాలూక ‘సంగం జాగర్లమూడి’ గ్రామంలో జన్మించారు. ఊహతెలిసిన దగ్గర నుంచి ఆయనకి నాటకాల పట్ల ఆసక్తి పెరుగుతూ వచ్చింది. ఒక వయసు వచ్చిన తరువాత ఆయన నాటకలలో బిజీ అయ్యారు.
మొదటి నుంచి కూడా తాను ఏ పాత్రలకి ఎక్కువగా పనికివస్తాననే విషయంపై ఆయనకి మంచి అవగాహన ఉండేది. అందువల్ల ఆ తరహా పాత్రలనే ఆయన చేస్తూ ఉండేవారు. అలా సాంఘిక .. జానపద .. పౌరాణిక పాత్రలను నాటకాలలో పోషించి ఆయన శభాష్ అనిపించుకున్నారు. అప్పట్లో ఆయన పోషించిన పాత్రలను చేయడానికి ఎవరూ కూడా సాహసించేవారు కాదు. అంతగా ఆయన ఆ పాత్రల ద్వారా పేరుప్రతిష్ఠలను తెచ్చుకున్నారు. ఆయన డైలాగ్ డెలివరీ .. బాడీ లాంగ్వేజ్ .. సహజమైన నటనను ప్రేక్షకులు మంత్రముగ్ధులై చూస్తుండిపోయేవారు.
అలా ఒంగోలు చుట్టుపక్కల ప్రాంతాల్లో నాటకాల ద్వారా ఎంతో అనుభవాన్ని గడించిన ఆయన, ఆ తరువాత స్నేహితుల ప్రోత్సాహంతో సినిమాల్లో నటించడానికి ఆసక్తిని చూపించారు. 1936లో ‘బాలయోగిని’ సినిమా ద్వారా ఆయన తెలుగు తెరకి పరిచయమయ్యారు. స్టేజ్ పై నటించడానికి .. కెమెరా ముందు నటించడానికి మధ్య గల తేడా ఆయనను కాస్త ఇబ్బంది పెట్టింది. అయినా నిదానంగా పరిశీలన చేసి కొన్ని పట్లు పట్టేశారు. ఆ తరువాత ఇక కెమెరా ముందు కూడా విజృంభించారు. మాలపిల్ల .. రైతుబిడ్డ .. మనదేశం .. సినిమాల్లో వరుస అవకాశాలను అందుకుంటూ వెళ్లారు. ఈ ‘మనదేశం’ సినిమా ద్వారానే ఎన్టీ రామారావు పరిచయమైంది.
ఇక ‘షావుకారు’ సినిమా గోవిందరాజుల సుబ్బారావు పోషించిన చెంగయ్య పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఆ పాత్రను సపోర్ట్ చేసే పంతులు పాత్రలో వంగర ఇమిడిపోయారు. ఆ సినిమాలో ‘అదంతేలే .. ‘ అనే అర్థంతో నోటితో చిత్రమైన సౌండ్ చేస్తూ చేయి ఎగరేస్తారు. అప్పట్లో ఆ మేనరిజం జనానికి బాగా నచ్చేసింది. ఆ తరువాత నుంచి ఆయన ఊరి పెద్ద మనుషులకు అనుకూలంగా ఉంటూ .. వాళ్ల దుర్మార్గాలలో పాలుపంచుకునే పాత్రలను ఎక్కువగా చేస్తూ వెళ్లారు. అలాంటి సినిమాల్లో ‘పెద్దమనుషులు’ ఒకటి.
ఒకప్పటి గ్రామీణ జీవనవ్యవస్థకు ‘పెద్దమనుషులు’ సినిమా అద్దం పడుతుంది. ఆ సినిమాలో ఛైర్మన్ భజనపరుడైన సిద్ధాంతి పాత్రలో వంగర నటన చూసి తీరవలసిందే. గుడిలో ఉన్న నిధిని రహస్యంగా ఛైర్మన్ కి చెందేలా చేయాలనే స్వార్థంతో ఆయన ప్రాణాల మీదకి తీసుకుని రావడమే కాకుండా, తాను కూడా ప్రాణాలను పోగొట్టుకునే పాత్రలో ఆయన జీవించారు. ఇక ‘కన్యాశుల్కం’లో కరటక శాస్త్రిగా .. ‘తెనాలి రామకృష్ణ’లో తాతాచార్యులవారి శిష్యుడిగా ఆయన ప్రదర్శించిన నటన అలా గుర్తుండిపోతుందంతే.
ఇక తెలుగు పౌరాణికాలలో మకుటాయమానమై నిలిచిన ‘మాయాబజార్’లోను వంగర చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆ సినిమాలో అత్యంత కీలకమైన వివాహ వేడుకకి సంబంధించిన సన్నివేశాల్లో వంగర చాలా సేపు కనిపిస్తారు. తమకి మర్యాదలు జరగడం లేదంటూ అల్లూతో కలిసి రమణారెడ్డి బృందంపై అసహనాన్ని వ్యక్తం చేసే ‘శాస్త్రి’ పాత్రలో ఆయన ప్రేక్షకులను నవ్విస్తారు. ఆ తరువాత చెంచులక్ష్మి .. శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం .. మహాకవి కాళిదాసు .. నర్తన శాల .. పరమానందయ్య శిష్యుల కథ వంటి ఆణిముత్యాలు ఆయన జాబితాలో కనిపిస్తాయి.
ఇలా వంగర తెలుగు సినిమా తొలినాళ్లలో ఓ మారుమూల గ్రామం నుంచి మద్రాసుకు వెళ్లి, అక్కడ సినిమాల్లో అవకాశాలను దక్కించుకుని, తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. ఎస్వీఆర్ వంటి వారంతా ఆయన తరువాత ఇండస్ట్రీకి వచ్చి ఆయన కళ్లముందు ఎదిగినవారే. సీనియర్ ఆర్టిస్ట్ గా వాళ్ల నుంచి ఆయన గౌరవాన్ని పొందినవారే. సహజమైన నటనకు చిరునామాగా చెప్పుకునే ఆయన జయంతి నేడు. ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ఒకసారి ఆయనను స్మరించుకుందాం.
(వంగర వెంకట సుబ్బయ్య జయంతి ప్రత్యేకం)
— పెద్దింటి గోపీకృష్ణ
Also Read :