Saturday, July 27, 2024
HomeTrending Newsఊరికో గ్రంథాలయం, ఇంటికో స్వచ్ఛాలయం: వెంకయ్య

ఊరికో గ్రంథాలయం, ఇంటికో స్వచ్ఛాలయం: వెంకయ్య

Venkaiah Naidu Visited Historical Rammohan Library At Krishnalanka Vijayawada :

గ్రంథాలయాలు సమాజ ఉన్నతికి దారిదీపాలని, ‘ఊరికో గ్రంథాలయం, ఇంటికో స్వచ్ఛాలయం’ అన్నది మన నినాదం కావాలని  భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపు ఇచ్చారు. అందరి చేతిలో పుస్తకం ఉండాలని, పుస్తకాలు చదవడం అందరూ అలవరుచుకోవాలని సూచించారు.  ‌గ్రంధాలయం, దేవాలయం, సేవాలయం ప్రతీ ఊరిలో ఉండాలని, రోజులు మారాక గ్రంధాలయాలు కనపడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

విజయవాడ కృష్ణ లంకలోని రామ్ మోహన్ గ్రంధాలయాన్ని వెంకయ్య నాయుడు సందర్శించారు. ఈ ప్రదేశంతో దీనితో తనకున్న అనుబంధాన్ని ఆయన నెమరువేసుకున్నారు. గతంలో రామ్మోహన గ్రంధాలయంలో ఉపన్యసించేవాడినని గుర్తు చేసుకున్నారు.  పలు గదులు కలియదిరిగి పుస్తకాలను తీక్షణంగా పరిశీలించారు. రిజిస్టర్ లో సంతకం చేశారు. గ్రంధాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భరతమాత, సర్దార్ వల్లభాయ్ పటేల్, అబ్దుల్ కలాం, ఇతర స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా అయన చేసిన ప్రసంగ పాఠంలో రామ్మోహన్ గ్రందాలయంపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

గ్రంథాలయాలు జాతి ఉన్నతికి పట్టుగొమ్మలు. చరిత్రలో యుద్ధాల కంటే విజ్ఞానమే ఎక్కువ స్వేచ్ఛను రగిలించింది…. వికాసానికి నాంది పలికింది. చరిత్రలో అలాంటి అనేక మార్పులకు నాంది పలికిన విజయవాడలోని రామ్మోహన్ గ్రంథాలయాన్ని సందర్శించడం ఎంతో ఆనందాన్ని అందించింది. దాదాపు 118 ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ గ్రంథాలయం స్వరాజ్య ఉద్యమంలో ఎంతో మందిలో పోరాట స్ఫూర్తిని రగల్చడమే గాక, గ్రంథాలయ ఉద్యమానికి, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం ఏర్పాటుకు కేంద్రబిందువుగా నిలిచింది. వందేమాతర ఉద్యమానికి ముందే మొదలైన ఈ గ్రంథాలయం ఎందరో మహనీయుల కృషికి నిదర్శనం, త్యాగాలకు ఫలితం.”

“ఆంధ్రప్రదేశ్ లో గ్రంథాలయ ఉద్యమం తొలినాళ్ళలో బెజవాడలోని కొందరు సాహిత్యాభిమానుల చొరవతో ఈ సంస్థకు అంకురార్పణ జరిగింది. 1903 ఏప్రిల్ లో బ్రహ్మసమాజం వారి నేతృత్వంలో ఆస్తిక పుస్తక భాండాగారం పేరుతో మొదలైన ఈ సంస్థ… 1908లో విజయవాడలోని బీసెంట్ రోడ్ కు మారింది. 1911లో ప్రస్తుతం గ్రంథాలయం ఉన్న చోటకు మారింది. యువతే స్వయంగా ఏర్పాటు చేసుకున్నఈ గ్రంథాలయం శ్రీ అయ్యంకి వెంకటరమణయ్య గారు కార్యదర్శిగా ఎన్నిక కావడం ద్వారా అభివృద్ధి పథంలోకి అడుగు పెట్టింది. శ్రీ అయ్యంకి వెంకట రమణయ్య గారు, శ్రీ సూరి వెంకట నరసింహ శాస్త్రి తదితరులు చందాలు పోగేసి, అప్పు చేసి ఈ గ్రంథాలయ స్థలాన్ని కొన్న సంఘటన స్ఫూర్తిని రేకెత్తిస్తుంది. నేటి యువత ఇలాంటి మహనీయుల నుంచి ప్రేరణ పొందాల్సిన అవసరం ఉంది. యువత తలచుకుంటే చరిత్ర గతి మారుతుందన్న విషయాన్ని ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది. నాడు వారు ఈ చొరవ తీసుకోకపోయి ఉంటే, ఈ మార్పు సాధ్యమై ఉండేది కాదేమో. సమాజానికి మేలు చేయాలనే సంకల్పమే ఆ మహానీయులను ముందుకు నడిపింది”

“స్వరాజ్య సంగ్రామంలోనూ రామ్మోహన్ గ్రంథాలయం పోషించిన పాత్ర చిరస్మరణీయమైనది. మహాత్మాగాంధీ మూడు మార్లు ఈ గ్రంథాలయాన్ని సందర్శించడం తెలుగు వారు మరచిపోలేని విషయం. 1919 జనవరి 30న, 1921 మార్చి 31న, 1929లో మరోసారి మహాత్ముడు ఈ గ్రంథాలయంలో కాలు మోపారు”

“అలాంటి చారిత్రక విశిష్టత ఉన్న గ్రంథాలయాన్ని సందర్శించడం, ఇక్కడ కొలువైన పుస్తకాలను చూడడం ఎంతో ఉత్సాహాన్ని అందించింది. అజ్ఞానం నుంచి విషయ పరిజ్ఞానంతో విజ్ఞానం, మెరుగైన జీవితం తద్వారా మెరుగైన సమాజం, దేశం, ప్రపంచం రూపొందుతాయి. ప్రతి గ్రామంలో ఓ విద్యాలయం, దేవాలయంతో పాటు ఓ గ్రంథాలయం అందుబాటులో ఉండాలి. “ఊరికో గ్రంథాలయం, ఇంటికో స్వచ్ఛాలయం” నినాదం కావాలి. స్వచ్ఛభారత్ కార్యక్రమంలా ఇదో ప్రజా ఉద్యమంగా రూపుదాల్చి స్వచ్ఛత, విజ్ఞానం ఏకకాలంలో దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలి. ముఖ్యంగా రామ్మోహన్ గ్రంథాలయాల వంటి చారిత్రక స్థలాలను యువత సందర్శించాలని సూచిస్తున్నాను. నాటి స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తిని మదిలో నింపుకుని, విజ్ఞానవంతులైన యువత దేశాన్ని నవ్యపథంలో ముందుకు నడపాలని ఆకాంక్షిస్తున్నాను” అని వెంకయ్య నాయుడు సందేశం ఇచ్చారు.

Must Read :ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్