హైదరాబాద్ లో నీటి ఎద్దడి మళ్ళీ మొదలైనట్టుగా కనిపిస్తోంది. నగరంలో అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. పశ్చిమ హైదరాబాద్ (మణికొండ, జూబిలీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, తెల్లాపూర్)లో పుడమితల్లి గుండెల్లో గునపాలు దింపుతున్నారు. ప్రభుత్వాలు టవర్ల పేరుతో అనుమతులు ఇస్తుంటే.. నిర్మాణ సంస్థలు అడ్డగోలుగా భూగర్భ జలాలు తోడుతున్నాయి.
రాష్ట్రంలో భూగర్భ నీటి మట్టం 8.7 మీటర్లు కాగా హైదరాబాద్ లో 8.2 మీటర్లుగా ఉంది. అమీర్ పెట్, సంజీవ రెడ్డి నగర్ ప్రాంతాల్లో 20 మీటర్ల దిగువ నుంచి నీటిని తోడుతున్నారు. అటు నగర శివార్లలో కూడా అదే జరుగుతోంది. శంషాబాద్ దాటాక షాద్ నగర్ వరకు ఇదే పరిస్థితి ఉంది. కూకట్ పల్లిలో ఏకంగా 42.35 మీటర్ల దిగువ నుంచి నీటిని తోడుతున్నారని రాష్ట్ర భూగర్భ నీటి శాఖ వెల్లడించింది. ఇది సాధారణం కన్నా చాలా అధికం.
హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో సమస్య తీవ్రంగా ఉంది. గత ప్రభుత్వం ఆకాశ హర్మ్యాలకు అనుమతులు ఇస్తూ పోయింది. సైబరాబాద్ సమీప ప్రాంతాల్లో 20 నుంచి 30 అంతస్తుల నిర్మాణం సాధారణం అయింది. రెండు కోట్లతో ఫ్లాట్ కొనుగోలు చేసిన వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న నిర్మాణ సంస్థలు సరిపడా నీటి సౌకర్యం కల్పించటం లేదు. దీంతో ప్రతి నెల నాలుగు వేలు అదనంగా నీటి కోసం వెచ్చిస్తున్నా సమయానికి నీటి ట్యాంకర్లు రావటం లేదని గృహిణులు మండిపడుతున్నారు.
నగర వ్యాప్తంగా రోజు 2.602.29 మిలియన్ లీటర్ల సరఫరా జరుగుతుండగా… ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ల నుంచి 4.47 శాతం, మంజీర-18.87 శాతం, కృష్ణా 1,2,3 దశల నుంచి 48.20 శాతం, గోదావరి ఒకటో దశ నుంచి 28.44 శాతం నీటిని ఐదు రిజర్వాయర్ల నుంచి సరఫరా చేస్తున్నారు.
2023-24 సంవత్సరంలో 6 శాతం అధికంగా వర్షాపాతం ఫిబ్రవరి నాటికీ నమోదైంది. నీటి దుర్వినియోగం అంతులేకుండా జరగటం వల్లే ఈ పరిస్థితి నెలకొందని స్వచ్చంద సంస్థలు చెపుతున్నాయి. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలలో ప్రత్యేకంగా మీటర్లు ఏర్పాటు చేసినా మార్పు రావటం లేదంటున్నారు.
మణికొండ, జూబిలీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్ పల్లి ప్రాంతాల్లో 65 శాతం బోర్లు ఎండిపోయాయి. గృహవినియోగాదారులు-46 శాతం, అపార్ట్మెంట్లకు 44 శాతం ట్యాంకర్ల బుకింగ్ పెరిగింది.
నిజాంపేట్, మియాపూర్, కూకట్ పల్లి, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి ప్రాంతాల్లో అపార్ట్మెంట్లలో వేసవి వచ్చిందంటే నీటి కొనుగోలు చేయటం షరామామూలు. గత ఏడాది ఒక్క ట్యాంకర్ తీసుకొని గృహవినియోగదారులు ఈ ఏడాది నెలకు ఆరు ట్యాంకర్లు తీసుకోవలిసిన దుస్థితి నెలకొంది. బస్తీల్లో పాత రోజులు మొదలయ్యాయి. ట్యాంకర్ల వద్ద బిందెలతో మహిళలు లైన్లు కట్టాల్సిన పరిస్థితి ఉత్పన్నం అయింది.
అదే నగరంలోని మిగతా ప్రాంతాలను తీసుకుంటే గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 20వేల లీటర్లు ఉచిత నీటి సరఫరా సరిపోతోంది. నగర పశ్చిమ ప్రాంతంతో పోలిస్తే ఇతర ప్రాంతాల్లో నీటి కొరత ఉన్నా మరి ఇంత దారుణంగా లేదని మహానగర నీటి పారుదల సంస్థ అధికారులు వివరిస్తున్నారు.
ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని… మితిమీరిన నీటి దుర్వినియోగం, ఇంకుడు గుంతల ఏర్పాటు నామమాత్రంగా ఉండటం, టవర్ల పేరుతో కాంక్రీట్ జంగల్ నిర్మించటం ప్రధాన కారణాలని స్వచ్చంద సంస్థల పరిశోదనలో వెల్లడైంది. ఇంత జరుగుతున్నా పశ్చిమ నగరంలోనే ఇళ్ళ నిర్మాణం జోరుగా జరుగుతోందని, అక్కడే డిమాండ్ ఉందని జోన్స్ లాంగ్ లసల్లె(JLL)సంస్థ సర్వేలో బహిర్గతం అయింది. పశ్చిమ ప్రాంతంలో నీటి కొరతకు తగినంతగా నీటి ట్యాంకర్లు లేకపోవటం, సరిపడా సరఫరాదారులు లేకపోవటం కూడా ఒక కారణం అని అధికారులు చెపుతున్నారు.
దూరదృష్టి లోపించిన ప్రభుత్వాలు, పాలకుల విధానాలతోనే ఈ దుస్థితి తలెత్తింది అనటంలో సందేహం లేదు. ప్రభుత్వంలో కీలకమైన పదవుల్లో ఉన్నవారి బినామీలు, అనుమాయులు, బంధువులకు పశ్చిమ ప్రాంతంలో భూములు ఉన్నాయి. వారికి మేలు చేసేందుకు వాటికి సమీపంలో ఐటి కంపనీలకు అనుమతులు ఇస్తున్నారు. ఐటి కంపనీలు రాకముందే మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు.
సామాన్యుడు పశ్చిమ ప్రాంతం వైపు కన్నెత్తి చూడలేని రీతిలో అభివృద్ధి చేసి ధరలు పెంచారు. ఉమ్మడి రాష్ట్రంలో తూర్పున కూడా కంపెనీలను తీసుకువచ్చేందుకు సింగపూర్ టౌన్ షిప్ ప్రాంతంలో ఐటి పార్కులు ఏర్పాటు చేశారు. తూర్పులో తగినంత భూమి లభ్యత, సౌకర్యాలు ఉన్నా పాలకులు ప్రోత్సహించటం లేదు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఈ జాడ్యం మరింత పెరిగింది. కెసిఆర్, కేటిఆర్ ల ఏలుబడిలో నగరం నలుమూలల ఐటి పార్కులు అని చెప్పినా కార్యాచరణలో అన్నీ పశ్చిమంలోనే కేంద్రీకృతం అయ్యాయి. తత్ఫలితమే నీటి కొరత. వేసవిలో నీటి కొరత. వర్షాకాలం వచ్చిందంటే కాలనీలు చెరువులు అవుతాయి. గేటెడ్ కమ్యునీటిల నుంచి వరద కాలువలు వెళ్ళటం బహిరంగ రహస్యం.
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయంలో సమాలోచనలు చేసి తగిన చర్యలు తీసుకోవాలని స్వచ్చంద సంస్థలు కోరుతున్నాయి. అన్ని రంగాల్లో బెంగళూరుతో హైదరాబాద్ కు పోటీ ఉంటుంది. మౌలిక సదుపాయాల కల్పనలో చొరవ తీసుకొని నగరం నలుదిశలా కొత్తగా వచ్చే కంపెనీలను విస్తరిస్తే నీటి కొరత, పోటెత్తే వరదలను నియంత్రించవచ్చని స్వచ్చంద సంస్థలు సూచిస్తున్నాయి.
-దేశవేని భాస్కర్