Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఏ మేరె వతన్ కే లోగో!

ఏ మేరె వతన్ కే లోగో!

A Song of Emotions: ఒక్కో భాషకు ఒక్కో ప్రత్యేకత, మాధుర్యం ఉంటాయి. అలా ప్రఖ్యాత “ఏ మేరె వతన్ కే లోగో!” హిందీ పాటకు ప్రతి పదార్థాలు తెలుగులో వెతుక్కుంటే దాని అసలయిన సారం మనకు అందదు. హిందీలో అలా వింటుంటే…మనకు తెలియకుండానే మన మనసు బరువెక్కుతుంది. మనకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు సుళ్లు తిరుగుతాయి. లతా మంగేష్కర్ గొంతులో విషాద జీరను వర్ణించలేక మాటలు కూడా మూగబోతాయి.

“ఏ మేరె వతన్ కే లోగో!
జర ఆంఖ్ మే భర్ లో పానీ…
జర యాద్ కరో కుర్బానీ..

ఓ దేశవాసులారా!
వినండి…
ఇది మనందరికీ శుభ సందర్భం…

మన స్వేచ్ఛకు చిహ్నంగా మువ్వన్నెల జెండా ఎగురుతున్నవేళ…
ఆ స్వేచ్ఛకోసం సమిధలై ఇంటికి తిరిగిరాని వీర సైనికులను స్మరించుకోవాలి…
వారికోసం కళ్ళల్లో నీళ్లు నింపుకోవాలి.

మన కోసం వారు ఎముకలు కొరికే హిమాలయాల్లో ఆఖరి శ్వాసవరకు పోరాడారు…
మన దేశాన్ని కాపాడ్డానికి వారు ప్రాణాలను పణంగా పెట్టారు…
వారి త్యాగాలను మనం గుర్తు చేసుకోవాలి.

Aye Mere Watan Ke

మనం దీపావళి చేసుకుంటుంటే…
వారు చీకటిలో హోళీ రంగులను వెతుక్కుంటున్నారు…
మనం ఇంట్లో హాయిగా కూర్చుని ఉంటే…
వారు తూటాలకు ఎదురెళ్ళారు…
అటువంటి అమరజవానుల త్యాగాలను మనం ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండాలి.

సిఖ్
జాట్
మరాఠా
మద్రాసీ
గుర్ఖా…ఎవరయినా…
సరిహద్దుల్లో మరణించిన ప్రతి వీరుడూ మన భారతీయుడే.
అక్కడ పర్వతం మీద చిందిన ప్రతి రక్తపు చుక్క మన భారతీయుడిదే.

శరీరం జల్లెడ కంతల్లా చిల్లులు పడి రక్తం కారుతున్నా…ఒక్కో సైనికుడు పది మంది శత్రువులను మట్టుబెట్టాడు…
మృత్యువు ఒడిలో కన్ను మూసే ముందు కూడా వారు దేశవాసుల సంతోషాన్నే కాంక్షించారు.
అలాంటి వీరులను, వారి త్యాగాలను, వారి గాథలను మరచిపోవద్దు”.

రచన:-
కవి ప్రదీప్

సంగీతం:-
సి. రామచంద్ర

గానం:-
లతా మంగేష్కర్

సందర్భం:-
1962లో భారత్- చైనా సరిహద్దుల్లో మరణించిన భారత్ వీర సైనికులను స్మరించుకుంటూ 1963 రిపబ్లిక్ డే వేడుకల్లో ఢిల్లీలో రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్, ప్రధాని జవహర్ లాల్ నెహ్రు పాల్గొన్న సభలో లతా మంగేష్కర్ పాడిన పాట.

ప్రభావం:-
ఆ సభలో నెహ్రు మొదలు పాల్గొన్నవారందరూ కళ్ళల్లో ఉబికిన నీళ్లతో మాట పెగలక చాలా సేపు మౌనంగా ఉండిపోయారు. స్టేడియం బరువెక్కిన గుండెతో గంభీరంగా మారిపోయింది.

సిగ్నేచర్ ట్యూన్:-
అప్పటి నుండి ఇప్పటి దాకా ఆగస్టు పదిహేను, జనవరి 26 రోజుల్లో ప్రాంతాలు, భాషలకతీతంగా దేశమంతా మారుమోగే పాట.

ప్రస్తుతం:-
ఆజాదీ కా అమృత మహోత్సవం పేరిట 75 ఏళ్ల స్వాతంత్ర్య ఉత్సవాలను చేసుకుంటున్నవేళ…
ఈ పాటలో కవి కోరుకున్నట్లు…
మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యానికి కారణమయిన వారి త్యాగాలను పదే పదే గుర్తు చేసుకోవాలి. వారి ప్రాణ త్యాగాలకు మన స్మృత్యంజలి కనీస కర్తవ్యం.

జర యాద్ కరో కుర్బానీ.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : 

ఎన్నికల చుట్టూ రాజకీయాలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్