పెళ్లంటే-
పందిళ్లు; సందళ్లు; తాళాలు; తలంబ్రాలు అని ఆత్రేయ రాస్తే కె వి మహదేవన్ అద్భుతంగా బాణీ కట్టాడు. అంతే చక్కగా బాలు- సుశీల పాడారు.
అయితే-
ఎడతెరిపిలేని కేరళ వర్షాల్లో ఒక పెళ్లికి పందిరి, సందడి, మేళం, తాళం, తలంబ్రాలు కుదరలేదు. అసలు పెళ్లి జరగాల్సిన గుడిలోకి వెళ్లడానికే కుదరలేదు. వర్షాలేమో ఇప్పట్లో ఆగేలా లేవు. దాంతో ఊరి జనానికి ఒక ఐడియా తట్టింది.
పెళ్లిళ్లకు వందల, వేల సంఖ్యలో అన్నం వండే పెద్ద గిన్నెను తొట్టె పడవలా పెళ్లి కూతురు- పెళ్లి కొడుకును కూర్చోబెట్టారు. ఊరు ఊరంతా మునిగినా ఎత్తు మీద ఉండడంతో గుడి భద్రంగానే ఉంది. ఇలా తలదాచుకోవడానికి చోటయినా ఉంటుందనే ముందు చూపుతో మనవారు ఎత్తుమీద గుళ్లు కట్టారేమో!
అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిగింది. మళ్లీ గిన్నె తొట్టెలోనే నవ దంపతులను కూర్చోబెట్టి ఊరి జనం భద్రంగా సాదరంగా ఇంటికి తీసుకొచ్చారు.
పెళ్లికి తెచ్చిన వంటపాత్రలో వంట వండకపోయినా…పెళ్లి జరగడానికి వంట పాత్రే ప్రధాన కారణమయ్యింది. కేరళలో అలప్పుజ జిల్లాలో జరిగింది ఈ వంటపాత్ర పెళ్లి!