ఆక్వా వ్యాపారులు సిండికేట్ గా మారి ధరలు తగ్గించి తమను మోసం చేస్తున్నారని రైతులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను వారు సిఎం దృష్టికి తీసుకు వెళ్ళారు. ఆక్వా ధరల పతనం, ఫీడ్ పెంపుపై వారు సిఎంకు వివరించారు. ధరలు పతనం కావడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని వారు ఏకరువు పెట్టారు. ఈ విషయాన్ని సిఎం జగన్ తీవ్రంగా పరిగణించారు, దీనిపై మంత్రులు, అధికారులతో ఓ ఉన్నత స్థాయి కమిటీని నియమించారు. ఈ కమిటీలో మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, డా. సీదిరి అప్పల రాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. సమీర్ శర్మ, సీనియర్ ఐ ఎస్ ఎస్ అధికారులు విజయానంద్, మాలకొండయ్య, కన్నబాబు ఉన్నారు.
వారం రోజుల్లో ఈ కమిటీ రైతుల సమస్యలపై అధ్యయనం చేసి ఓ నివేదిక ఇవ్వాలని, దీరి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు. రైతులకు నష్టం కలిగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని సిఎం జగన్ హెచ్చరించారు.