Saturday, November 23, 2024
HomeTrending Newsమునుగోడులో అధికార దుర్వినియోగం - బండి సంజయ్

మునుగోడులో అధికార దుర్వినియోగం – బండి సంజయ్

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 12న రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ సభకు కనీవినీ ఎరగని రీతిలో భారీగా జన సమీకరణ చేసేందుకు సిద్ధమైంది. కనీసం లక్ష మందికి తగ్గకుండా బహిరంగ సభను విజయవంతం చేయాలని భావిస్తోంది. ప్రధాని రాక నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, జన సమీకరణపై పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అధ్యక్షతన ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.

పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి బండి సంజయ్ తోపాటు ఎంపీ సోయం బాబూరావు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, జి.వివేక్, మాజీ మంత్రులు జి.విజయరామారావు, సుద్దాల దేవయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, ఎన్వీఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఏమన్నారంటే…

• ఈనెల 12న ప్రధాని రాక సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని లక్ష మందిని సమీకరించాలి. ఈ సభకు భారీ ఎత్తున రైతులను భారీగా తరలించాలి.

• జన సమీకరణ, సభ విజయవంతం విషయంలో జిల్లా నాయకులంతా సమన్వయంగా పనిచేయాలి. ప్రధానికి భారీ స్వాగతం పలికేలా తెలంగాణ అంతటా వివిధ రూపాల్లో అలంకరణ చేయాలి. అన్ని నియోజకవర్గాలు రైతులు, కార్యకర్తలు తరలివచ్చేలా ర్యాలీలు నిర్వహించాలి.

• ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ముఖ్యంగా రూ.6120 కోట్ల వ్యయంతో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్దరించడంవల్ల రైతులకు కలిగే ప్రయోజాలను వివరించాలి. రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్దరణ ద్వారా తెలంగాణ, ఏపీ సహా దక్షిణ భారత రైతులందరికీ కొరత లేకుండా ఎరువులను సరఫరా చేయబోతున్నారని అవగాహన కల్పించాలి.

• మోదీ ప్రభుత్వం రైతు ప్రయోజనాల విషయంలో రాజీ పడటం లేదన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ…ఆ భారం రైతులపై పడకూడదనే ఉద్దేశంతో ఏటా వేలాది కోట్లు ఖర్చు పెట్టి సబ్సిడీపై ఎరువులు అందిస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి.

• మునుగోడు ఎన్నికల అంశాన్ని ప్రస్తావిస్తూ…. మునుగోడు ఎన్నికల్లో పెద్ద ఎత్తున అదికార దుర్వినియోగం చేశారు. ఒక్క ఉప ఎన్నిక గెలిచాందుకు వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేశారు. విచ్చల విడిగా మద్యం ఏరులై పారించారు.

• రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, పోలీస్ కమిషనర్, ఎస్పీ టీఆర్ఎస్ తొత్తులుగా మారారు. ఏడేళ్లుగా ఒకే పోస్టింగ్ లో ఉన్న పోలీస్ కమిషనర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కార్యకర్తల్లా పనిచేశారు. నిజాయితీ, నిబద్ధతతో పనిచేసే బీజేపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేసి కేసులు నమోదు చేశారు. ఇన్ని చేసినా ప్రజలు మనవైపే ఉన్నారు. మునుగోడులో బీజేపీ విజయం ఖాయం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్