Friday, November 22, 2024
HomeTrending NewsRajya Sabha Polls: మూడు సీట్లకూ వైసీపీ పోటీ

Rajya Sabha Polls: మూడు సీట్లకూ వైసీపీ పోటీ

రాజ్యసభ ఎన్నికల్లో మూడు సీట్లకూ పోటీపెట్టాలని వైఎస్సార్సీపీ అధినేత, సిఎం జగన్ నిర్ణయించారు. ముగ్గురు అభ్యర్ధుల పేర్లనూ ఖరారు చేశారు. మాజీ ఎంపి, వైవీ సుబ్బారెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు, కడప జిల్లాకు చెందిన వ్యాపారవేత్త మేడా రఘునాథ రెడ్డిలను బరిలో నిలపనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రేపో మాపో రానుంది.

కాగా మొత్తం 175 సీట్లలో151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ మూడింటినీ గెల్చుకోవడం నల్లేరు మీద నడక కావాల్సి ఉంది. కానీ గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే నలుగురు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటేశారు. ఆ తరువాత ఆళ్ళ రామకృష్ణా రెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

మరోవైపు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల జాబితాను వైసీపీ వరుసగా విడుదల చేస్తూ వస్తోంది. ఇప్పటికే ఆరు జాబితాలు ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొందరికి సీట్లు నిరాకరించారు. వీరితో పాటు పార్టీ పట్ల అసంతృప్తితో రాజీనామా చేస్తున్న కె.పార్థ సారథి, వసంత కృష్ణ ప్రసాద్;  సీట్ల మార్పుతో అలిగిన కోనేటి ఆదిమూలం, మంత్రి గుమ్మనూరు జయరాం; సీట్లు కోల్పోయిన ఆర్. వరప్రసాద్, రక్షణ నిధి, కొండేటి చిట్టిబాబు, పెండెం దొరబాబు, జ్యోతుల చంటిబాబు, పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, సిద్దారెడ్డి, చెన్నకేశవరెడ్డి లాంటి వారు  ఉన్నారు.  వీరిలో కొందరు టిడిపి, జనసేనలో చేరుతున్నట్లు ఇపటికే ప్రకటించగా, మరికొందరు పార్టీ పట్ల అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.  వీరంతా రాజ్యసభ ఎన్నికల్లో ఏం చేస్తారనేది చివరి వరకూ అనుమానాస్పదమే.

రాజ్యసభకు పోటీపై టిడిపి ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. 15న నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ. పోటీ అనివార్యమైతే ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుంది. ఈ దశలో టిడిపి పోటీకి దిగుతుందా, ఒకవేళ దిగితే వైసీపీలోని అసంతృప్త ఎమ్మెల్యేలను ‘మేనేజ్’ చేసి సీటు గెల్చుకుంటుందా అనేది ఆసక్తిగా మారింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్