Hydrogen Powered Car :
దేశంలో తొమ్మిది రోజుల్లో ఎనిమిది సార్లు పెట్రో ధరలు పెరిగాయి.ఈ రోజు ధరలను కలుపుకుంటే 5.60 పైసలు పెరిగాయి. చమురు ప్రభావంతో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పెట్రోల్, డిజిల్ ఇంధనాల ధరలు భారీగా పెరుగుతుండటంతో ప్రత్యామ్నాయ ఇంధనాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇథనాల్ బ్లెండ్ ని పెట్రోల్ లో కలపడంతో పాటు మరోవైపు హైడ్రోజన్ ద్వారా నడిచే వాహనాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు.
కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ రోజు పార్లమెంట్ కు తీసుకువచ్చిన కార్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. హైడ్రోజన్ తో నడిచే కారులో గడ్కరీ తన నివాసం నుంచి పార్లమెంట్ కు వచ్చారు. టొయోట కంపనీ అభివృద్ధి చేసిన ఈ కారు పేరు మిరాయ్…భవిష్యత్తు అని దీని అర్థం. ఇంధనాల విషయంలో స్వయం స్వావలంభన సాధించే విధంగా ఈ మిరాయ్ ఉండనుందని నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు.
భారత ప్రభుత్వం రూ. 3000 కోట్లతో మిషన్ ప్రారంభించిందని…త్వరలోనే హైడ్రోజన్ ఎగుమతి చేసే దేశంగా మారుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడ బొగ్గును ఉపయోగిస్తున్నామో.. అక్కడ గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగించబడుతుందని గడ్కరీ అన్నారు. భారత్ ఆత్మనిర్భర్ కావడానికి… నీటి నుంచి ఉత్పత్తి చేసే గ్రీన్ హైడ్రోజన్ ప్రవేశపెట్టామన్నారు. మిరాయ్ కారు పైలెట్ ప్రాజెక్ట్ అని అన్నారు. దేశంలో గ్రీన్ హైడ్రోజన్ తయారీని ప్రారంభిస్తామని.. పెట్రోల్ వంటి ఇంధన దిగుమతులను అరికడతామని ఆయన అన్నారు.
కారు ట్యాంక్ ఫుల్ చేసేందుకు కేవలం అయిదు నిమిషాల సమయం పడుతుంది. ఒకసారి ట్యాంక్ ఫుల్ చేస్తే ఆరు వందల కిలోమీటర్లు ఏకబిగిన వెళ్లేందుకు అవకాశం ఉంది. కిలోమీటర్ కు కేవలం రెండు రూపాయలు మాత్రమె ఖర్చు అవుతుంది. 2020 డిసెంబర్ లోనే విడుదల చేసినా పైలట్ ప్రాజెక్ట్ కింద పరీక్షలు జరుగుతున్నాయని వచ్చే నెలలో అందరికి అందుబాటులోకి వస్తుందని గడ్కరి చెప్పారు.
Also Read : గ్యాస్, పెట్రో ధరల పెరుగుదలకు నిరసనల సెగ