We are Ready: ఆత్మకూరు ఉపఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. తిరుపతి, బద్వేల్ ఎన్నికల్లో పోటీ చేశామని, అదే విధానాన్ని ఇక్కడా పాటిస్తామని తెలిపారు. పార్టీలో ప్రస్తుతం ఉన్నవారో, కొత్తగా చేరబోయే వారో ఎవరో ఒకరు అభ్యర్ధిగా ఉండొచ్చని సూత్రప్రాయంగా వెల్లడించారు. నెల్లూరు బిజెపి కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి సోము మీడియా సమావేశంలో మాట్లాడారు. ఒంగోలులో అక్రమంగా బియ్యం తరలిస్తున్నవారిని అరెస్ట్ చేయకుండా ఆ తరలింపును అడ్డుకున్న తమ పార్టీ నేతలపై కేసు పెట్టడం దారుణమని విమర్శించారు. ఈ ప్రభుత్వం బ్లాక్ మార్కెటీర్లను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. లారీ డ్రైవర్ మీద కేసు పెట్టకుండా ఆటను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తమ నేతలపై కేసు పెట్టడమేమిటని ప్రశ్నించారు.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ప్రభుత్వం అంతర్మథనం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో కూడా కేంద్రం వాటా ఉందన్నారు. రైతు భరోసాలో కేంద్రం వాటా 6 వేల రూపాయలు ఉందని, కోటి మందికి జాబ్ కార్డ్స్ ఇచ్చారని, మధ్యాహ్న భోజన పథకంలో కూడా కేంద్ర నిధులు ఉన్నాయన్నారు. మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కరోనాను ధీటుగా ఎదుర్కొని కూడా ఆర్ధిక పరిస్థితిని సమర్ధంగా ముందుకు తీసుకు వెళుతుందన్నారు. రాష్ట్రంలో సంక్షేమాన్ని నెపంగా చూపి అభివృద్ధిని విస్మరిస్తున్నారని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై సమగ్రమైన వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
కోర్టుల్లోనే దొంగతనాలు జరగడం తన జీవితంలోనే మొదటి సారి చూశానని, నెల్లూరులో జరిగిన సంఘటన తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ ఇచ్చిన వివరణ కామెడీ తలపించిందని, అదికార పార్టీకి వత్తాసు పలుకుతున్న ఇలాంటి అధికారుల వైఖరి ఆశ్చర్యంగా ఉందని, ఇలాంటి వారికి లెఫ్ట్ రైట్ ఇవ్వాలని వ్యాఖ్యానించారు. అధికార పార్టీ నాయకులు ఇక్కడ పోటీగా సభలు పెడితే అక్కడకు పోలీసులు వెళ్ళరని, కానీ ప్రతిపక్షంగా తాము సభలు పెట్టుకున్తామంటే పోలీసులతో నిలువరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : ప్రాజెక్టులపై సిఎంకు శ్రద్ధ లేదు: సోము