Vyaghrapada Kshetram: వరదరాజస్వామి అనగానే అందరికీ ‘కంచి’ గుర్తుకు వస్తుంది. అనేక ఆలయాల సమాహారంగా కనిపించే ‘కంచి’లో వరదరాజ స్వామి కొలువై ఉన్నారు. ఆ స్వామి సౌందర్యం చూడటానికి రెండు కళ్లూ చాలవేమో అనిపిస్తుంది. అక్కడ ఆ స్వామి లీలా విశేషాలను గురించి భక్తులు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి వరదరాజస్వామిని తన ఊరికి రప్పించిన ఒక మహర్షి కథ మనకి ‘పెదపులివర్రు’లో కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ .. గుంటూరు జిల్లా .. బాపట్ల మండలంలోని కృష్ణానదీ తీరంలో ఈ క్షేత్రం అలరారుతోంది. దీనిని ‘వ్యాఘ్రపాద క్షేత్రం‘ అని కూడా పిలుస్తుంటారు.
వ్యాఘ్రపాద మహర్షి .. భగవంతుడి అనుగ్రహంతో పులి పాదాల వంటి పాదాలను పొంది, అమితమైన వేగంతో ప్రయాణం చేసేవారని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. అంత వేగంతో ఆయన వివిధ ప్రదేశాల నుంచి అనేక రకాలైన పూలను సేకరించి తెచ్చి తన ఇష్టదైవమైన వరదరాజ స్వామిని పూజించేవారట. ఈ క్షేత్రంలో ముందుగా ‘శ్వేతలింగం’ ఉండేది. ఈ శివలింగాన్ని సాక్షాత్తు నారద మహర్షి ప్రతిష్ఠించాడని స్థల పురాణం చెబుతోంది. ఇక్కడ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్న వ్యాఘ్రపాదులు అనునిత్యం ఆ శివలింగానికి పూజాభిషేకాలు నిర్వహించేవారు.
అనునిత్యం శ్వేతలింగానికి పూజాభిషేకాలు చేసిన వెంటనే ఆయన పులివేగంతో ‘కంచి’కి వెళ్లి, వరదరాజస్వామిని దర్శించుకుని తిరిగి వచ్చేరట. ఒకసారి భయంకరమైన తుఫాను వచ్చింది. అయినా లెక్కచేయకుండా ఆయన శివారాధన ముగించి, ఆ తుఫానులోనే ‘కంచి’కి చేరుకున్నారు. తనకి వరదరాజస్వామి దర్శనభాగ్యం కలగని రోజు అనేది ఉండకూడదనీ, తాను నివాసమున్న ప్రదేశంలో కొలువై ఉండమని స్వామివారిని కోరుకున్నారు. ఆ తరువాత ఆశ్రమానికి తిరిగి వచ్చిన వ్యాఘ్రపాదులు, ఆ మరుసటి రోజున కృష్ణానదిలో స్నానానికి వెళ్లగా, నీటిపై తేలుతూ వరదరాజస్వామి మూర్తి ఆయన దగ్గరికి వచ్చి అక్కున చేరింది.
ఊహించని ఆ సంఘటనకు వ్యాఘ్రపాదులు ఆనందాశ్చర్యాలకు లోనయ్యారు. ఆ మూర్తిని చూస్తూ ఆయన మురిసిపోయారు. .. పరవశంతో గుండెలకి హత్తుకున్నారు. స్వామివారి మూర్తిని పసి పిల్లాడిలా అపురూపంగా తీసుకుని వచ్చి, శ్వేతలింగానికి ఎదురుగా తూర్పు భాగంలో ప్రతిష్ఠ చేశారు. ఆ రోజు నుంచి స్వామివారికి నిత్య పూజాభిషేకాలు నిర్వహిస్తూ వచ్చారు. వ్యాఘ్రపాదులు తపస్సు చేసిన ప్రదేశం కావడం వలన .. ఆయన కారణంగా ఇది హరి హర క్షేత్రంగా వెలుగొందుతూ ఉండటం వలన ‘వ్యాఘ్రపాద క్షేత్రం’గా పిలవబడి, కాలక్రమంలో ‘పెదపులివర్రు’గా మారిందని అంటారు.
తొండమాన్ చక్రవర్తి ఈ క్షేత్రాన్ని దర్శించుకుని ఆలయ ప్రాకారాలను నిర్మించాడనీ, రాజనరేంద్రుడు .. అదే వంశానికి చెందిన మల్లవర్మ మరింత అభివృద్ధికి కృషి చేశారని చరిత్ర చెబుతోంది. ప్రతి నిత్యం సూర్యోదయం సమయంలో కిరణాలు శివుడి ఫాలభాగంపై పడతాయి. సూర్యాస్తమవేళ వరదరాజస్వామి పాదాలపై పడతాయి. ఈ క్షేత్రానికి సంబంధించినంత వరకూ ప్రధానమైన విశేషంగా ఇది కనిపిస్తుంది. శైవ .. వైష్ణవ సంబంధమైన పర్వదినాలలో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. చారిత్రక నేపథ్యం .. ఆధ్యాత్మిక పరమైన వైభవం కలిగిన ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన, సమస్త దోషాలు తొలగిపోయి, సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం.
– పెద్దింటి గోపీకృష్ణ
Also Read :
Also Read :