అమరావతి రాజధాని ప్రకటన తర్వాతే తాను ఇక్కడ భూములు కొన్నానని ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమని తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రకటించారు. ప్రకటనకు ముందు తాను కొని ఉంటే వాటిని బైట పెట్టాలని, అలా చేస్తే ఆ భూములను బుగ్గన సూచించిన వారికి తాను రాసిస్తానని వెల్లడించారు. పరిపాలనా వికేంద్రీకరణపై జరిగిన స్వల్ప కాలిక చర్చ సందర్భంగా మంత్రి బుగ్గన తనపేరు ప్రస్తావించడంపై పయ్యావుల మండిపడ్డారు. రాజధాని ప్రకటన వచ్చిన తరువాతే, నా ఆస్తుల నుంచి తాను ఇక్కడ భూమి కొనుక్కుంటే దానిలో తప్పేముందని ప్రశ్నించారు.
రాజధాని భూముల విషయంలో తనపై కేసులు పెట్టి మళ్ళీ ఉపసంహరించుకున్నారని, కేంద్రం బినామీ చట్టం తీసుకు వచ్చిందని, దాని ప్రకారం తనకు బినామీ భూములుంటే వాటిని స్వాధీనం చేసుకోవచ్చని సవాల్ విసిరారు. ఇన్ సైడర్ పేరుతో కోర్టులకు వెళ్లి చివాట్లు తిన్నారని కేశవ్ ఎదురుదాడి చేశారు. అమరావతి భూములపై సుప్రీం కోర్టులో కనీసం కేసు వేసే ధైర్యం కూడా ఈ ప్రభుత్వానికి లేదని ఎద్దేవా చేశారు. ఈ మూడేళ్ళలో విశాఖలో జరిగిన భూముల క్రయ విక్రయాలపై విచారణ జరిపించే ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా అని నిలదీశారు.
Also Read : లేపాక్షి భూములపై ప్రజా, న్యాయ పోరాటం: కేశవ్