కొద్ది రోజులుగా ప్రశాంతంగా ఉన్న ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో మళ్ళీ గొడవలు రాజుకుంటున్నాయి. కులాల కుంపటిగా మారిన విశ్వవిద్యాలయంలో అగ్ర వర్ణాలు… బహుజనులుగా రెండు వర్గాలు ఏర్పడ్డాయి. ఒక వర్గానికి వామపక్షాలు, కాంగ్రెస్ మద్దతు ఇస్తుండగా… మరో వర్గానికి బిజెపి దన్నుగా నిలుస్తోంది. గతంలో ఎంతో చైతన్యవంతంగా ఉన్న JNUలో కులాల మధ్య చిచ్చు రేగటం మంచిది కాదని మేదావులు, విద్యావంతులు అంటున్నారు.
ఇదే కోవలో జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) లో మరోసారి వివాదం తలెత్తింది. వర్సిటీ గోడలపై బ్రాహ్మణ వ్యతిరేక నినాదాలు కనిపించాయి. క్యాంపస్‌లోని రెండు, మూడు అంతస్థుల్లో ఉన్న స్కూల్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్ విభాగం గోడలు, పలువురు ఫ్యాకల్టీ గదుల డోర్లపై దుండగులు అభ్యంతరకరమైన రాతలు రాశారు. బ్రాహ్మణులు క్యాంప్‌సను విడిచి వెళ్లాలి, బ్రాహ్మణ్-బనియా మీ కోసం వస్తున్నాం.. ప్రతీకారం తీర్చుకుంటాం, బ్రాహ్మిన్ భారత్ చోడో వంటి నినాదాలను గుర్తుతెలియని వ్యక్తులు రాశారు. దీనిని ఖండించిన వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ శాంతిశ్రీ డీ పండిట్ దర్యాప్తునకు ఆదేశించారు. కాగా, బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఇది లెఫ్టిస్ట్ భావజాలం ఉన్న విద్యార్థుల పనేనని ఆరోపించింది.