మనసు బాగాలేనపుడు-ఓదార్చే తోడు.
ఒంటరిగా ఉన్నప్పుడు-సేద తీర్చే నేస్తం.
అలసటకు- సాంత్వన.
ఆకలేస్తే- ఆహారం.
ఆర్థికానికి- సలహాదారు.
ఇవన్నీ టెక్నాలజీ చేస్తుందంటే?
పిడికిలి మూసినంత వరకే రహస్యం అని సామెత. శాస్త్ర సాంకేతికరంగాల్లో పురోగతి అనేక రహస్యాలు బట్టబయలు చేస్తోంది. ఏదో ఉన్నదాంట్లో గుట్టుగా కాపురం చేసుకునే జీవితాల్లో మూడో వ్యక్తిలా అమెజాన్ అలెక్సా, ఆపిల్ సిరి మొదలైన ధ్వన్యనుసరణలు/వాయిస్ కాచర్స్ ప్రవేశిస్తున్నాయి. ఆ మధ్య స్విచ్ ఆపడం మర్చిపోయిన పాపానికి అలెక్సా భార్యాభర్తల సంభాషణలు బయటపెట్టడం అది పెద్ద గొడవ కావడం తెలిసిందే. అప్పటి నుంచీ ఇటువంటి టెక్నాలజీ అవసరమా అనే ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి.
శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగతి అద్భుతాలు చేస్తోంది నిజమే. ప్రపంచంలో ఎక్కడున్నా ఏ విషయమైనా తెలుసుకునే వీలు ఉంది. కానీ మనకు తెలియకుండానే మన ఆశలు, ఆశయాలు, భావాలు, ఆరోగ్యం తెలుసుకుని ఆ డేటా అంతా మార్కెటింగ్ శక్తులకు చేరవేస్తే ? బ్యాంకులు లోన్ ఇవ్వటానికి నిరాకరించవచ్చు. ఆస్పత్రుల మార్కెటింగ్, కొన్నిసార్లు పోలీసులు కూడా అనుమానించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఇప్పటికే కొన్ని కాల్ సెంటర్ల వాళ్ళు ఈ విధమైన టెక్నాలజీ వాడుతున్నారు. కస్టమర్ కోపంగా ఉంటే వాళ్ళని శాంతపరచడానికి ప్రత్యేక ఆపరేటర్ లను నియమిస్తున్నారు. స్పాటిఫై మ్యూజిక్ కూడా వయసు, జెండర్, ఎమోషన్స్ ఆధారంగా ఏం పాటలు వినాలో చెప్తోంది. అమెజాన్ హలో హెల్త్ ట్రాకింగ్ బ్రాసెలెట్ ధరిస్తే గొంతులో ధ్వనించే ఆశావహ దృక్పధం, ఎనర్జీ కనిపెట్టి మరింతగా కమ్యూనికేషన్, ఇతరులతో సంబంధాలు పెంచుకోడానికి సహాయపడుతుందట. ఇలా చెప్తే ఎన్నో ఆవిష్కరణలు… అంతులేని లాభాలు అనిపిస్తాయి. పొంచిఉన్న ఆపదలు కూడా గమనించమని నిపుణుల సలహా. అయితే ఒక్కసారి అలవాటు పడ్డాక టెక్నాలజీ వాడకుండా ఉండలేరుకాబట్టి ముందే ప్రమాదకర మైన అంశాలు నిషేధించాలని ప్రభుత్వాలను కోరుతున్నారు. ఇప్పటికే ఫేస్ బుక్, వాట్సాప్ ల మోసాలు విన్నాం. చూశాం. అయినా పర్లేదు అడ్డంగా టెక్నాలజీ ఇకముందు కూడా కొనసాగిస్తామంటే మన ఖర్మ!
-కె. శోభ