Tuesday, April 16, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఎన్నెన్నో ప్రత్యేకతల అనంతపురము

ఎన్నెన్నో ప్రత్యేకతల అనంతపురము

The History of Anantha: రెండున్నర ఎకరాలకు మించి విస్తరించిన తిమ్మమ్మ మర్రిమాను ఉన్నా…కనుచూపుమేర పచ్చదనం కనిపించదు. చోళసముద్రం, నాగసముద్రం, రాయలచెరువు… ఊర్ల పేర్లలో చెరువులు, సముద్రాలకు కొదవలేకపోయినా… అక్కడ నీళ్లు పారేది మాత్రం మనుషుల కళ్లలోనే! వజ్రాలు దొరికే వజ్రకరూరు, బంగారం లభ్యమయ్యే రామగిరి… ఉంటే మాత్రం ఏంటి? సామాన్యుల ముఖాలలో నాట్యమాడేది దైన్యమే! పట్టుచీరలకు పేరుమోసిన ధర్మవరమూ అక్కడిదే… అయితేనేం! చాలామంది శ్రామికులకు వంటినిండా బట్టలు ఉండవు. పాతిక ఎకరాలున్న రైతు అయినా సరే…వరుసగా రెండేళ్లు వానలు కురవకపోతే ఇల్లూ నేలా వదిలిపెట్టి వలస పోవాల్సిందే. అలా అక్కడ కూటికీ, నీటికీ కొరతెంత ఉన్నా…భాషా, సాహిత్య, సాంస్కృతిక సంపదలకు కొదువలేదు. అదే అనంతపురం.

అక్షర క్రమంలో మొదటిది, అభివృద్ధిలో ఆఖరిది అయిన ఈ జిల్లా… వైవిధ్యమైన తెలుగు మాటల తోటలకు మాత్రం పేరెన్నికగలది.  ఊరికి చివరి గుడిసెలాగా ఆంధ్రప్రదేశ్‌కు దక్షిణ కొసన ఉందీ అనంతపురం. కరువుకు మారుపేరైన ఈ జిల్లా కక్షలకు నిలయమయ్యింది. పురాతన ఆవాసభూమి అయిన ఈ ప్రాంతం బతికిచెడిన గడ్డ.

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ తరువాత దేశంలోనే అతి తక్కువ వర్షపాతంగల అనంతపురం… ఎడారిగా మారిపోతుందన్నది పర్యావరణవేత్తల హెచ్చరిక. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఉన్న రెండు వేల చెరువుల్లో ఇప్పుడు 200 కూడా కనిపించట్లేదు. నీటికి కటకటలాడే ప్రాంతం కాబట్టే ఉభయ గోదావరులకన్నా ఎక్కువ వైశాల్యం ఉన్నా… జనసాంద్రత చాలా తక్కువ. వేయి గ్రామాలతో ఉండే ఈ జిల్లాలో జనాభా మాత్రం 40 లక్షలకు కాస్త ఎక్కువ.

శాతవాహనులు, పల్లవులు, రాష్ట్రకూటులు, దేవగిరి యాదవులు, వైదుంబులు, విజయనగర రాజులు, హండే, కందుర్తి పాలకులెందరో ఏలిన గడ్డ ఇది. బుక్కరాయల భార్య అనంతమ్మ పేరిట ‘అనంతపురం’ నిర్మితమైందని చరిత్ర సాక్ష్యమిస్తోంది. ఒకప్పుడు బళ్లారి జిల్లాలో భాగమైన ఈ ప్రాంతం 1882లో ప్రత్యేక జిల్లాగా ఆవిర్భవించింది. హిందూ ముస్లిములు ఎక్కువ సంఖ్యలో గల ఈ జిల్లాలో మార్వాడీలు, తమిళులు, కన్నడిగులు, మలయాళీలూ నివసిస్తున్నారు. వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటూ ఇక్కడి ప్రజలతో కలసి జీవిస్తున్నారు.

అనంతపురం జిల్లావాసులకు బెంగళూరుతో అనుబంధం అధికం. ఇచ్చిపుచ్చుకోవడాలు వ్యాపారాలు, ఉపాధికోసం వలసలు… అన్నీ కర్ణాటకతోనే ఎక్కువగా జరుగుతుంటాయి. హిందూపురం, రాయదుర్గం, మడకసిర, విడపనకల్లు, కణేకల్లు, అమరాపురం ప్రాంతాలలో తెలుగు కన్నడ మిశ్రమభాషలో మాట్లాడుతుంటారు. కురవలు, జంగాలు, దళితుల్లో మాదిగలు (ఎక్కువభాగం), మధ్వ బ్రాహ్మణులు వంటి వాళ్లకు తల్లిభాష కన్నడమే. మరోవైపు… కర్ణాటకలోని బళ్లారి, చింతామణి, కోలారు మొదలైనవి తెలుగు ప్రాంతాలే. అక్కడ తెలుగువాళ్లే అధిక సంఖ్యాకులు. అయితే, వాళ్ల మీద కన్నడ ప్రభావం తప్పనిసరి.

సాహిత్యంలో సాటిలేదు
ఆధునిక ఛాయలుగల తొలి తెలుగుకావ్యం ‘ముసలమ్మ మరణం’ కథాస్థలం అనంతపురమే. ఆంధ్రనాటక పితామహుడు ధర్మవరం రామకృష్ణమాచార్యులు ఈ జిల్లావాడే. ధర్మవరం దగ్గర ‘నిమ్మలకుంట’ తోలుబొమ్మలకు ప్రసిద్ధి. గొరవయ్యలనే జానపద కళాకారులకు జిల్లాలో మంచిపేరు ఉంది. మహిళలను వేధించబోయిన బ్రిటిష్‌ సిపాయిలను ఎదుర్కొని అమరుడైన గొల్లహంపన్న, ప్రపంచ ప్రసిద్ధ నటుడు బళ్లారి రాఘవ, తొలితరం ఆధునిక తెలుగు సాహిత్య విమర్శకుడు, గాథాసప్తసతి అనువాదకుడు రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, ‘మన లిపి పుట్టు పూర్వోత్తరాల’ను వివరించిన ప్రముఖ భాషా విద్వాంసుడు తిరుమల రామచంద్ర, అనంతపురం జిల్లా నిర్దిష్ట వాస్తవికత అయిన కరువు వస్తువుగా ‘పెన్నేటిపాట’ రాసిన విద్వాన్‌ విశ్వం ఈ జిల్లా వాసులే.

Ananthapuram District

పుట్టింది శ్రీకాకుళమైనా, అనంతపురంతో అనుబంధంగల చిలుకూరి నారాయణరావు గొప్ప సామెతల సేకర్త. కవికోకిలలు, కవిచకోరాలు, మధురకవులు మనకు ఎక్కడైనా దొరుకుతారు కానీ, ‘కవికాకి’ (కోగిర జైసీతారాం) మాత్రం ఈ జిల్లాలోనే కనిపిస్తాడు. రాయలసీమేతర ప్రాంతాల నుంచి ఉద్యోగరీత్యా తనవద్దకు వచ్చిన కోరాడ మహదేవశాస్త్రి, కొలకలూరి ఇనాక్‌ వంటివాళ్లనూ అనంతపురం అక్కున చేర్చుకుంది.

సర్వమత సమ్మేళనం
హిందూ ముస్లిం సమైక్యతకు, సామరస్యానికి ప్రతీకలుగా ఇక్కడ రెండు క్షేత్రాలున్నాయి. అవి… పెనుగొండ (బాబయ్య దర్గా), గూగూడు (పీర్లపండగ). గూగూడులో కుళ్లాయిస్వామి, ఆంజనేయుడి ఆలయాలు ఒకేచోట ఉంటాయి. కుళ్లాయిస్వామికి చదివింపులు చదివించినవాళ్లు, హనుమంతుడికి కొబ్బరికాయ కొడతారు. ఈ రెండు పనులను హిందూ ముస్లిములిద్దరూ చేస్తారు. అలాగే, పీర్లపండగను రెండు మతాలవాళ్లు కలసి నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు ఇరుగుపొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుంచి ప్రజలెక్కువ సంఖ్యలో వస్తారు.

విజయనగర రాజులకు రెండవ రాజధాని, వేసవి విడిది అయిన పెనుగొండలో చారిత్రక కట్టడాల దగ్గరే బాబయ్య దర్గా ఉంది. అక్కడ ఉరుసు సందర్భంగా ప్రపంచ శాంతి కోరుతూ హిందూ ముస్లిం క్రైస్తవ మతాల గురువులు ధార్మిక సమ్మేళనం జరుపుతారు. కాస్త చరిత్రలోకి వెళ్తే, బాబా ఫకృద్దీన్‌ అనే పకీరు ఒక పర్షియన్‌ చక్రవర్తి. షీస్థాన్‌ పాలకుడు. రాజ్యాన్ని త్యజించి ఇస్లాం మత ప్రచారం చేస్తూ తిరుచినాపల్లి చేరాడు. అక్కడ గురువు అనుమతితో పెనుగొండకు వచ్చాడు. మిశ్వాన్‌ అనే పుల్లను రాత్రిపూట ఏ నేలలో నాటితే తెల్లారేసరికి చిగురిస్తుందో అదే నివాసంగా భావించమని ఆయనకు గురువు చెప్పాడని, అలా పెనుగొండలో జరిగినందువల్ల ఇక్కడ నివసించి సమాధి అయ్యాడని చెబుతారు! మతాలు, దేవుళ్ల విషయాలు పక్కనబెట్టి చూసినప్పుడు మనుషులు కలుసుకోడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి. ఈ సామరస్యం అనంతపురం జిల్లా జీవితంలోనూ, భాషా సంస్కృతులలోనూ ప్రభావం చూపిస్తుంది.

Ananthapuram District

అలాగే గుత్తికి దగ్గరగా గొల్లలదొడ్డి సమీపంలో గిరిజనులకు సంబంధించిన ‘సేవాగడ్‌’ అనే క్షేత్రమూ చెప్పుకోదగినదే. మహారాష్ట్రకు చెందిన మహావీరుడైన సాధువు సేవల్‌భాయ్‌ అనే ఆయన లంబాడీ జాతి మూలపురుషుడని… వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ చివరికి ఇక్కడకు వచ్చి స్థిరపడ్డాడని చెబుతారు! ఈ స్థలానికి పూర్వనామం భావన్‌ బారాడా. అంటే 52 కొండలని అర్థం. వీటి మధ్య ఉన్న అడవిని ‘ఝమరీర్‌ ఝాల్‌’ అనేవారు. ఏటా ఫిబ్రవరి 15న ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి.

వైవిధ్యానికి కారణమదే
ఈ సమ్మేళనాలవల్ల అనంతపురం జిల్లా భాష తనదైన మౌలికతను నిలుపుకుంటూనే, ఇతర భాషల పదజాలాన్ని కూడా తనలో కలుపుకుంటోంది. ప్రాచీన తెలుగు కావ్యాలలోని కొన్ని పదాలు ఇక్కడింకా వ్యవహారంలో ఉన్నాయి. కంతులు (వాయిదా), గంటు (సొమ్ము), పారాట (పారువేట), పార్నాట, ఇరులు (చీకటి), దాంక (దనుక, దాకా), ఐనూరు (అయిదువందలు) వంటివి ఇందుకు ఉదాహరణలు. పండుగ వెళ్లిన మర్నాడు చేసుకునే మాంసాహార విందును ‘పార్నం’ అంటారిక్కడ. పండిన వేరుశెనగచెట్టును పీకడాన్ని ‘పాయడ’మని పిలుస్తారు. పురుషులను ‘అప్ప’ అని సంబోధిస్తారు. అది గౌరవవాచకం. ‘ఏమప్పా!’ అంటే ‘ఏమండీ’ అని పిలిచినట్లు. బాగా గ్రామీణ వాసన ఉన్న వాళ్లు ‘ప్పో’ అనీ పిలుస్తారు. పుట్టపర్తి వంటి సరస్వతీపుత్రులు సైతం ‘ఆయప్ప, ఈయప్ప’ అంటూ ఉంటారు. సంజీవప్ప, సుబ్బరామప్ప, హనుమంతప్ప, రామప్ప, శంకరప్ప ఇలా… చాలామంది పేర్లు ‘అప్పతో’ ముగుస్తాయి. కర్ణాటకలోనూ ఈ సంప్రదాయం కనిపిస్తుంది.

ఇక ‘ఎక్కడికి’ అనడానికి ‘యాటికి’ అంటారు. డబ్బుల్ని ‘లెక్క’ అని పిలుస్తారు. ‘నాకడ లెక్కలేదు’ అంటే డబ్బులేదని అర్థం. ధర ఎక్కువ అయితే ‘పిరిం’ (ప్రియం), తక్కువ అయితే ‘అగ్గవ’! బురుగులలో మసాలా కలిపి తినే పదార్థం ‘ఉగ్గాణి’ ఇక్కడి వారికిష్టం. ‘పుష్కరిణి’ అనే తత్సమపదం కన్నడంద్వారా తెలుగు ఉక్రేని, వక్రేని అయ్యందని ఆదవాని హనుమంతప్ప అంటారు. పెద్దవాళ్లు చిన్నవాళ్లను పిలిచేటప్పుడు సాధారణంగా ‘ఏమిరా’ అంటుంటారు కదా, అనంతపురంలో ‘ఏమిలే’ అంటారు. ‘లే’ అని క్లుప్తంగా కూడా పలుకుతారు. ‘వలెను’ అనే రూపాన్ని ‘వల్ల’ అని ఉచ్చరిస్తారు. పోవల్ల, రావల్ల, చెప్పల్ల, ఉండల్ల, జరగల్ల… ఇలా అన్నమాట. ‘ఏ’తో పలికే పదాలను ఇక్కడ ‘య’ వత్తుతో (నేస్తుడు – న్యాత్తుడు, తిండిలేక – తిండిల్యాక) పలుకుతారు. అక్షరాలను కుదించి పలకడంలో పదరూపం మారిపోవడాన్ని అనంతపురం భాషలో గమనించవచ్చు. ఉదాహరణకు… ఒకవేళ – వొగాల, రావడానికి – రానీకి, పోవడానికి – పొయ్యేకి. ‘పిలుచుకుని రండి’ అన్నది ఇక్కడ ‘తోలకరండి’ అవుతుంది. ‘వస్తున్నాడు’… ‘వస్తాండాడు’గా మారుతుంది. బండి నారాయణస్వామి ‘గద్దలాడతండాయి’ ఇలాంటిదే. ఇక ‘వనారుగా, వొయినంగా’ అంటే ‘పథకం ప్రకారం’! ఇష్టం లేకుండా మాట్లాడితే ‘కొన్నాలికతో పలకడం’ అంటారు.

తెలుగు మాటల మధ్య ఉర్దూ పదాలు వాడటం సర్వసాధారణం. పీర్, ఆజాద్, జోర్, కుదేల్, సతానా, సలాం మొదలైన పదాలు వాడుకలో వినిపిస్తుంటాయి. అలాగే, లంబాడీలు తమ భాషలో మాట్లాడుకునేటప్పుడు తెలుగు పదాలు సహజంగానే దొర్లుతుంటాయి. కడపమాను, కడశీల, గుంటకనొగ వంటి వాటిని వారు యథాతథంగా వాడుతుంటారు. అలాగే, తెలుగు బంజారా భాషల మిశ్రమ పదాలు కూడా వాళ్ల వ్యవహారంలో ఉంటాయి. గుడిన్‌ జామా, దేవళం జామా (గుడికి పోదామా) తదితరాలు ఇలాంటివే.

రసజ్ఞత చావలేదు!
పాఠశాల అధ్యాపకుడైన కోగిర జైసీతారాం అనంతపురం స్థానిక భాషలో ‘చలిమంట’ అనే కవితను నాటకీయంగా చదువుతుంటే జనం మైమరచి వినేవాళ్లు. ఆయనే చెప్పేదాకా ఆ కవిత తేటగీతి పద్యాల్లో ఉందని ఎవరూ గుర్తించలేక పోయేవాళ్లు. అలాగే, తొలినాటి అనంతపురం జిల్లా కథకుడు గుత్తి రామకృష్ణ… ఏ సదస్సుకు హాజరైనా ప్రసంగాలు పూర్తికాగానే వేదికపైకి వచ్చేవారు. జేబులోని కాగితాలు బయటికి లాగి అనంతపురం స్థానిక పదాలను కొన్నింటిని పరిచయం చేసేవారు. ఇప్పటి నవల, కథల విషయానికి వస్తే,… స్వామి ‘గద్దలాడతండాయి’, ‘మీరాజ్యం మీరేలండి’, ‘రెండు కలలదేశం’, ‘వీరగల్లు’ వంటి రచనల్లో కళ్యాణదుర్గం, రాయదుర్గం ప్రాంతపు స్థానికభాషా మెరుపులు కనిపిస్తాయి. దస్తగిరి ‘అపద్దమాడరాదు’, శాంతినారాయణ ‘పెన్నేటి మలుపులు’, ‘నమ్ముకున్నరాజ్యం’, ‘నాగలకట్టసుద్దులు’ వంటి వాటిల్లోనూ… సింగమనేని నారాయణ కథల్లోనూ… చిలుకూరి దేవపుత్ర ‘పంచమం’, ‘అద్దంలో చందమామ’, ‘ఆరు గ్లాసులు’ తదితరాల్లోనూ అనంతపురం పరిసర గ్రామాల భాషను సజీవంగా తొణికిసలాడుతుంది.

Ananthapuram District

ఒకానొక దశలో ప్రజాభాషలో ప్రజాజీవితాన్ని కథలుగా మలిచే ప్రక్రియకోసం తెలుగువాళ్లంతా అనంతపురం జిల్లా వైపు చూశారన్నది వాస్తవం. ముఠాకక్షలు ప్రజాజీవితాన్ని ఛిద్రం చేస్తున్నా…కరువు ప్రజల మూలుగులను పీల్చేస్తున్నా… నండూరి రామకృష్ణమాచార్య మాటల్లో చెప్పాలంటే ఇక్కడ ‘రసజ్ఞత మాత్రము చావలేదు’.

(అజ్ఞాత రచయితకు కృతజ్ఞతలు. పేరు తెలిస్తే…తరువాతయినా ప్రస్తావిస్తాం)

Also Read :

చరితకు సాక్షి- లేపాక్షి

Also Read :

హంపీ వైభవం-1

 

 

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్