Tributes to Gowtham: నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజీకి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెడతామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆరు వారాల్లో ఈ సంగం ప్రాజెక్టు పూర్తవుతుందని, దాని ప్రారంభోత్సవం రోజున గౌతమ్ పేరు పెడతామని చెప్పారు. అలాగే గౌతమ్ తండ్రి రాజమోహన్ రెడ్డి కోరిన విధంగా మెరిట్స్ కాలేజీలో ప్రభుత్వ వ్యవసాయ, ఉద్యానవన కాలేజీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశలోనే ఉదయగిరి ప్రాంతాన్ని కూడా చేరుస్తామని, ఉదయగిరి కాలేజీని కూడా అభివృద్ధి చేస్తామని సిఎం భరోసా ఇచ్చారు.
రాష్ట్ర శాసన సభ గౌతమ్ రెడ్డికి ఘనంగా నివాళులర్పించింది. సంతాప తీర్మానాన్ని సిఎం జగన్ ప్రవేశపెట్టగా, స్పీకర్ తమ్మినేని సీతారాం సంతాప తీర్మానాన్ని ఆమోదించి వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
గౌతమ్ రెడ్డి చిన్నప్పటి నుంచి ఒక స్నేహితుడిగా, అనుచరుడిగా ఉండేవారని, వయసులో తనకంటే ఏడాది పెద్దవాడైనా తనను ఎప్పుడూ అన్నా అని సంభోదిన్చేవారని సిఎం గుర్తు చేసుకున్నారు. తాను సొంత పార్టీ పెట్టినప్పుడు రాజమోహన్ రెడ్డి తన వెంట నడిచేందుకు సిద్ధపదడడం వెనుక కూడా గౌతమ్ పాత్ర ఎంతో ఉందన్నారు.
మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఆర్కే రోజా, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఆదిమూలపు సురేష్, అబ్బయ్య చౌదరి, హఫీజ్ ఖాన్, ధర్మాన ప్రసాదరావు, సంజీవయ్య, ఏలూరి సాంబశివ రావు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు, వరప్రసాద్, మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డి మాట్లాడగా చివర్లో మాట్లాడిన సిఎం జగన్, గౌతమ్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.