Thursday, May 9, 2024
HomeTrending Newsనెలాఖరు వరకూ గడువు: ఏపీ ఉద్యోగ జేఏసి

నెలాఖరు వరకూ గడువు: ఏపీ ఉద్యోగ జేఏసి

AP Employees JAC :
నెలాఖరులోపు పీఆర్సీ నివేదిక బైటపెట్టాలని, ఉద్యోగుల ఇతర సమస్యలపై కూడా ప్రభుత్వం స్పందించాలని లేకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఏపీ ఉద్యోగ సంఘాల నేత బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. నిన్న జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో తమ సమస్యలను పరిష్కారం చూపే విధంగా ప్రభుత్వం స్పందించలేదని, ఆర్ధిక, ఆర్ధికేతర డిమాండ్లపై ప్రకటన ఇస్తారని ఆశించినా అది కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీపీఎఫ్, ఎన్ క్యాష్ మెంట్ ఆఫ్ ఎర్నడ్ లీవ్స్, సరెండర్ లీవ్స్, మెడికల్ బిల్స్,  ఉద్యోగి చనిపోతే మట్టి ఖర్చులు, సిఎఫ్ఎంఎస్ లాంటి సమస్యలపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని, ఇవన్నీ మార్చి నాటికి పరిష్కారం అవుతాయని చెప్పారని బండి వివరించారు.

గత నెల 29నే పీఆర్సీ నివేదిక కావాలని డిమాండ్ చేశామని, రెండ్రోజుల్లో ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకూ ఇవ్వలేదని, కనీసం మేము దాచుకున్న డబ్బులు ఇవ్వాలని అడుగుతున్నా మార్చి వరకూ ఆగాలని చెబుతున్నారని బండి అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి కూడా కొంత సమయం ఇవ్వాలనే నెలాఖరు వరకూ సమయం ఇవ్వాలని అనుకున్నామని, ఈ నెల 27 లోపు జిల్లా స్థాయిల్లో అన్ని సంఘాల సమావేశాలు నిర్వహిస్తామని, ఆ తర్వాత 28న ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర స్థాయిలో సమావేశమై కార్యాచరణను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇస్తామని ప్రకటించారు.

ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన ఏ ఒక్క సమస్యనూ ఈ ప్రభుత్వం రెండున్నరేళ్లుగా పరిష్కరించలేకపోయిందని ఏపీ జేఎసి అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు  అన్నారు. డిఏలు ఎప్పటికప్పుడు ఇస్తామని చెప్పారని, కానీ ఏడు డీఏలు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. పీఆర్సీ నివేదికలో మార్పులు చేసే అధికారం అధికారుల కమిటీకి లేదని బొప్పరాజు స్పష్టం చేశారు. ఉద్యోగుల హెల్త్ కార్డులు అనారోగ్యంగా తయారయ్యాయని, కొంత కాలంగా మా డబ్బులతో వైద్యం చేయించుకొని రీఇంబర్స్ చేసుకుందామనుకున్నా దాదాపు 40 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ లో పడ్డాయని, ఈ ఆగస్ట్ నుంచి రీఇంబర్స్ ఉత్తర్వులు కూడా ఇంకా ఇవ్వలేదని, నిన్నటి సమావేశంలో ఈ ఒక్క జీవో ఇవ్వడానికి మాత్రం అంగీకరించారని వివరించారు.

ఇవి కూడా చదవండి:  రేపు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్