Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Suspension: హైదరాబాద్ గచ్చిబౌలిలో అధికారిక విధుల్లో ఉన్న ఏపీ ఇంటెలిజెన్స్ ఉద్యోగిపై దాడి ఘటనను ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ విభాగానికి చెందిన ఇద్దరు సిబ్బందిపై సీఆర్పీఎఫ్ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ దాడి ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ పోలీసు శాఖ స్పష్టం చేసింది.

దీనికి సంబంధించిన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా ఇరు రాష్ట్రాల పోలీసులు బందోబస్తు విధుల్లో ఉన్నారు. ప్రధాని పర్యటనలో ఎవరైనా వ్యక్తులు, సంఘాలు ఆందోళన చేసే అవకాశాలపై సమాచారం సేకరించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ఇంటెలిజెన్స్ విభాగం కూడా కొందరు ఉద్యోగులను డ్యూటీలో నియమించింది. ఏపీ ఇంటలిజెన్స్ విభాగంలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అనంతపురానికి చెందిన ఫరూక్ భాషను హైదరాబాదులోని ఐ.ఎస్.బి గేటు వద్ద స్పాటర్ గా నియమించారు.

కాగా, గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్ లో ఉన్న ఎంపీ రఘురామకృష్ణరాజు నివాసానికి ఇది దాదాపు కిలోమీటర్ దూరంలో ఉందని, ఫరూక్ విధులకు, రఘురామరాజు ఇంటితో సంబంధమేమీలేదని ఏపీ పోలీసు వర్గాలు చెబుతున్నాయి. కారులో వచ్చి తనను లాక్కెళ్ళి రఘురామకృష్ణరాజు సమక్షంలోఅతని కుమారుడు భరత్, సిఆర్పిఎఫ్ సిబ్బంది శారీరకంగా దాడి చేశారని, నడిరోడ్డుపైనే పిడిగుద్దులు కురిపించారని, తాను ఇంటిలిజెన్స్ కానిస్టేబుల్ అని గుర్తింపు కార్డు చూపిస్తున్నానని చెప్పినా వినిపించుకోకుండా గుర్తింపు కార్డును లాక్కున్నారని ఫరూక్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీనిపై   గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ (Cr.No.707/2022, U/s 365,384,323,324,332,504,506,295(b) r/w 34,109 IPC) గా నమోదైంది. దీనిలో ఏ1 గా రఘురామ కృష్ణం రాజు, ఏ2గా, రఘురామ కొడుకు భరత్, ఏ3గా సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ సందీప్, ఏ4గా సీఆర్పీఎఫ్ ఏ ఎస్ఐ, ఏ5గా రఘురామ పిఏ శాస్త్రిలను చేర్చారు.

మరోవైపు ఏపీ పోలీసులు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు.  బాధ్యులపై ఏపీ లో కూడా కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com