తన సభలకు జనం తండోపతండాలుగా వస్తున్నారని చెబుతున్న చంద్రబాబు రోడ్లపై ఎందుకు సభలు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. తనకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి తట్టుకోలేక జీవో 1 తెచ్చారని బాబు చెప్పుకుంటున్నారని, అలాంటప్పుడు అయన ఎక్కడ సభ పెట్టినా అక్కడకు జనం వస్తారుగా అంటూ వ్యాఖ్యానించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు.
కందుకూరులో ఎనిమిది మంది, గుంటూరులో ముగ్గురు చనిపోయిన తరువాత… ప్రజల ప్రాణాలు రక్షించడం ఓ బాధ్యత గల ప్రభుత్వం కనీస ధర్మమని అందుకే జీవో నంబర్ 1 తీసుకు వచ్చామని సజ్జల వివరించారు. ఈ ప్రభుత్వం జీవో తీసుకురావడమేమిటి, దాన్ని తాము పాటించడం ఏమిటి అన్న చందంగా తెలుగుదేశం పార్టీ, చంద్రబాబుల వ్యవహార శైలి ఉందని విమర్శించారు. దీనికోసమే ఆయన కుప్పంలో దండయాత్రకు వెళ్ళారని అన్నారు. గత మూడు రోజలుగా చంద్రబాబు చేస్తోన్న డ్రామా చూస్తే సిగ్గనిపిస్తోందని వ్యాఖ్యానించారు. వ్యవస్థలన్నీ తన కాలికింద వేసి నలుపుతా అన్నట్లు ఆయన ప్రవర్తన ఉందని సజ్జల విస్మయం వ్యక్తం చేశారు. గత రెండు సంఘటనల దృష్ట్యా ఈ జీవో అవసరమా లేదా అనేది ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
కుప్పం పర్యటనలో…. ప్రభుత్వం జీవో తెచ్చినందున ఏయే ప్రదేశాల్లో సభలు పెట్టుకుంటారో తెలియజేస్తే తాము అనుమతిస్తామని పోలీసులు చంద్రబాబుకు చెప్పారని సజ్జల వివరించారు. కానీ మొండి పట్టుదలకు పోయి తాను రోడ్ షో లు చేసి తీరుతానని చెప్పడం ఎంతవరకూ సబబని అడిగారు. అసలు కందుకూరు సంఘటన జరిగి ఉండకపోతే ఈ జీవో తీసుకు రావాల్సిన అవసరం ఏముంటుందని అన్నారు. పోలీసు యాక్ట్ కు లోబడే ఈ జీవోను తీసుకు వచ్చామని సజ్జల స్పష్టం చేశారు.
Also Read : రోడ్డుపై బైఠాయించిన బాబు