Sunday, January 19, 2025
HomeTrending Newsఉత్త చేతులతో వచ్చిన మోడీ - కవిత

ఉత్త చేతులతో వచ్చిన మోడీ – కవిత

గులాబీ జెండాతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ ఖాళీ చేతులతో వచ్చారని, ఉత్తమాటలు, లేని మాటలు, ఉత్తుత్తి మాటలు చెప్పి పోయారు తప్పా చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. “ తెలంగాణకు ఏం చేశారని పలుసార్లు ప్రధానిని ముఖ్యమంత్రి  ప్రశ్నించారు. కానీ వాటికి మోడీ ఎక్కడా సమాధానం చెప్పకుండా తప్పించుకొని తిరుగుతూ ఇవాళ వచ్చి ఏదో చిన్న ప్రారంభోత్సవం చేసి వెళ్లిపోతున్నారు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనించాలి. ఉత్తి మాటుల చెప్పేవాళ్లేవరూ… అభివృద్ధి చేసే నాయకులేవరు .. ఉట్టి మాటలు చెప్పే పార్టీ ఏది… ముఖం చాటేసే పార్టి ఏది… అన్నది ప్రజలు గుర్తించేలా కార్యకర్తలు పనిచేయాలని” కవిత వ్యాఖ్యానించారు.

శనివారం  జగిత్యాల జిల్లా రాయికల్ లో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో కవిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్, విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీ ఎల్ రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. గులాబీ కండువా అధికారంలో ఉంటేనే తెలంగాణ ప్రజలు సురక్షితంగా ఉంటారని, ఎక్కడైతే గులాబీ జెండా ఎగురుతుందో ఆ నియోజకవర్గంలో అభివృద్ధి ఉంటుందని, కాబట్టి ఆ జెండాను నిలబెట్టడానికి 24 గంటల పాటు కార్యకర్తలు మొత్తం పనిచేయాలని సూచించారు. ఎన్ని ఇతర పార్టీలు ఉన్నా, సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి వంటి వారు ఉన్నా కూడా ఎన్నడూ ఒక చిన్న గ్రామాన్ని పట్టించుకోలేదని, గ్రామ సమస్యలను అడగలేదని చెప్పారు. రాయికల్ గతంలో వసతులు లేకుండా ఒక చిన్న గ్రామంగా ఉండేదని, ఆనాడు మంత్రి జీవన్ రెడ్డి రాయికల్ ను మున్సిపాలిటీగా అభివృద్ధి చేయాలనుకోలేదని గుర్తు చేశారు. రాయికల్ పట్టణం ఒకప్పుడు వలసల మండలంగా ఉండేదని, ఇప్పుడు పంటల మండలంగా మారిందని స్పష్టం చేశారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సీఎం కేసీఆర్ ముఖం చాటేశారని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. “అయ్యా జీవన్ రెడ్డి గారూ….. ఝూటో నో జోడో నో పాదయాత్ర చేసుకుంటూ ఇటీవలే రాహుల్ గాంధీ తెలంగాణలోకి వచ్చారు . ఆ సమయంలో మునుగోడులో ఎన్నికలు జరుగుతున్నాయి. మరి మీ నాయకుడు మునుగోడు ప్రజలకు ముఖం చాటేశారు. మా నాయకుడు తెలంగాణ ప్రజలకు ఎప్పడూ ముఖం చాటేయలేదు. ముఖం చాటేసే నాయకులు కాంగ్రెస్, బీజేపీ నాయకులే కానీ గలాబీ కండువా కప్పుకున్న వాళ్లు ఎప్పడూ ముఖం చాటేయరు.’’ అని తేల్చి చెప్పారు.

ఇవాళ మన నాయకుడు దేశవ్యాప్తంగా ఒక విప్లవం సృష్టించడానికి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారని, తెలంగాణను టీఆర్ఎస్ ఎలా అయితే బంగారుమయం చేసిందో.. రేపు భారత దేశంలో కూడా బీఆర్ఎస్ అదే విప్లవం సాధిస్తుందన్న సంపూర్ణ విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. కార్యకర్తలు ఇంటింటికి తిరిగి చేసిన పనులు చెప్పుకోవాలని సూచించారు. “ బోర్నపల్లి బ్రిడ్జి నిర్మిస్తానని హామీ ఇచ్చి జీవన్ రెడ్డి రెండు సార్లు ఎన్నికల్లో గెలిచారు. గెలిచిన తర్వాత హామీని మరిచిపోయాడు. ఓడ దాటేదాక ఓడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత బొడమల్లన్న అనేదే జీవన్ రెడ్డి విధానం.” అని కవిత అన్నారు. అదే తాము అలా చేయలేదని, బోర్నపల్లి బ్రిడ్జి కట్టిస్తామని చెప్పి ఇచ్చిన మాట తప్పకుండా రూ. 85 కోట్లతో బ్రిడ్జిని నిర్మించామని తెలిపారు.

కొంతమంది గందరగోళం సృష్టిస్తున్నారని, వాట్సప్ లలో దొంగ సందేశాలు పెడుతున్నారని, అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని, ఇబ్బంది పెట్టే మెసేజీలు పెడుతున్నారని, ఆ మోసాలను ఎండగట్టాల్సిన బాధ్యత కార్యకర్తలు, నాయకులపై ఉందని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ వరదలాగా నిధులు ఇస్తున్న విషయాన్ని ప్రజలకు అర్థం అయ్యేలా చెప్పాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్