Friday, October 18, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకాదేదీ గొడవకనర్హం?

కాదేదీ గొడవకనర్హం?

That is Must:
“శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణిః”

సంగీతానికి ఏ ప్రాణి అయినా కరిగి, తలలూపాల్సిందే. కాలకూట విషాన్ని కోరల్లో దాచుకున్న పాములయినా…సంగీతానికి పడగ విప్పి నాట్యం చేయాల్సిందే. అలాంటిది సామాన్య మానవులు సంగీతం కోసం చెవులు కోసుకోకుండా ఎలా ఉంటారు? తప్పకుండా కోసుకుంటారు.

అదే జరిగింది భువనగిరిలో. ఊరేగింపు మాట వ్యుత్పత్తి మీద భాషాశాస్త్రజ్ఞులకు ఎందుకో ఏకాభిప్రాయం కుదరలేదు. అసలు ఆ మాట “ఊరేగింపు” కాదు; అది “ఊరెరిగింపు”. కాలక్రమంలో పలకడంలో ఒకటి రెండు అక్షరాలు జారిపోతూ ఉంటాయి. ఊరికి ఎరిగింపు(తెలియజేయడం) కాస్త “ఊరేగింపు” అయ్యిందని ఒక వాదన. తెలుగు మాటలే దేవాతావస్త్రమయినప్పుడు ఇక మాటల వ్యుత్పత్తి గొడవ మనకెందుకు?

బరాత్ అంటే తెలుగులో పెళ్లి ఊరేగింపు. ఆ ఊరేగింపులో బాజా బజంత్రీలు, బాణా సంచా కాల్చడాలు, పూలు చల్లుకోవడాలు సహజం. యుగధర్మం ప్రకారం ఇప్పుడు డి జె తప్పనిసరి. గుండెలు అదిరి, చెవులు చిల్లులు పడి, చెవుల్లో రక్తాలు కారే ఆ డి జె విధ్వంసానికి రాత్రంతా ఊరేగింపులో వీధి నాట్యం చేయడం మర్యాదస్తులు విధిగా చేయాల్సిన పెళ్లి తంతు.

అలా భువనగిరి వీధుల్లో ఒక బరాత్ సాగుతోంది. డి జె పాటల మోతతో వీధి గుండె గుభేలుమంటోంది. అబ్బాయి- అమ్మాయి తరుపువారు అరమరికలు లేకుండా ఊగిపోతూ స్టెప్పులు వేస్తున్నారు. ఈలోపు ఫలానా పాట వేయాలని అబ్బాయి తరుపువారు…కాదు…కాదు ఫలానా పాటే…డి జె లో ప్లే చేయాలని అమ్మాయి తరుపువారు పట్టుబట్టారు. చినికి చినికి గాలివాన పెద్దయ్యింది. ఇరు పక్షాలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లేకుండానే కర్రలతో కొట్టుకునే దాకా వెళ్లింది వారి సంగీత స్పర్ధ. రెండు వైపులా తలలు పగిలి రక్తాలు కారాయి. ఊరేగింపులో ఉన్న కార్ల అద్దాలు పగిలాయి. సుబ్బి పెళ్లి ఎంకి చావుకొస్తుంది కాబట్టి ఈ పెళ్లి పోలీసులకు శాంతి భద్రతల సమస్యగా పరిణమించింది.

తలలదేముంది? పగిలితే…అతుక్కుంటాయి.
కార్ల అద్దాలదేముంది?
ఇన్సూరెన్స్ ఉంటే…కొత్తవి వస్తాయి.
భువనగిరి ఊరేగింపు డి జె లో పాటల పట్టింపు సమాజంలో సంగీతం పట్ల ఉన్న గాఢానురక్తిని రక్తాక్షరాలతో మరోమారు రుజువు చేసింది. సంగీతానికి చెవులే కోసుకోవాలని నియమేమీ లేదు. మెడ కోసుకున్నా సంగీతమేమీ అనుకోదు. పైగా తనకోసం పరస్పరం మెడలు కోసుకునే ఆత్మాహుతి దళాలు ఉన్నందుకు గర్వపడుతుంది. సంతోషిస్తుంది. పులకిస్తుంది. నిలువెల్లా మురిసిపోతుంది.

Clashes Marriages

ఇలాంటిదే మరొక వార్త. ఇది కూడా భువనగిరి జిల్లాలో జరిగిందే. పెళ్లి తరువాత విందులో మాంసం, మద్యం ఈరోజుల్లో సహజం. కనీస మర్యాద. గౌరవం. అలా పెళ్లి విందులో మాంసం కూర వడ్డింపు దగ్గర వచ్చింది గొడవ. రెండు ముక్కలు ఎక్కువ వేయకుండా…ఏమిటీ ముక్కల కక్కుర్తి? అని పంక్తి భోజనంలో ఎవరో నసిగారు. అంతే…వీధి కుక్కల్లా ముక్కల కోసం రక్కుకుంటారా? అని ఇంకెవరో గట్టిగానే అన్నారు. ముక్కలు ముక్కలుగా ఇరుపక్షాల్లో ఎముకలు విరిగి విస్తళ్లలో పడ్డాయి. తెల్లటి అన్నం మీద ఎర్రటి రక్తం చిందింది. తగ్గేదే ల్యా! అని ఓపిక ఉన్నంతవరకు ముక్కల యుద్ధంలో పాల్గొని…ముక్కాలా…ముక్కాబులా…పాటలు పాడుకుని…చివరికి పోలీసు స్టేషన్లో ఇద్దరూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుని…ముక్కలయిన హృదయాలతో ఎవరి దారిన వారు పోయారు.

“ఆలోచనామృతం సాహిత్యం;
ఆపాతమధురం సంగీతం”.

భువనగిరికి కూడా ఇదే ఆదర్శం.
“ఆపాతమధురం డి జె గీతం;
ఆలోచనామృతం మాంసం”.


రాజకీయ పార్టీల ర్యాలీలకు ముందుగానే పోలీసులు భద్రత ఏర్పాటు చేయడం ఆనవాయితీ. శాంతి భద్రతల దృష్ట్యా అవసరం కూడా. అలా పెళ్లి ఊరేగింపులు, విందులకు కూడా గట్టి పోలీసు భద్రత ఏర్పాటు చేయాల్సిన రోజులొచ్చాయి.

డి జె పాట లేదా?
మాంసం ముక్క లేనే లేదా?
అయితే దయచేసి మమ్మల్ను పెళ్లికి పిలవనే పిలవకండి.
ప్లీజ్!

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : 

భార్య బ్యాటింగ్ – భర్త వీపింగ్

Also Read : 

బట్టతలల భవిత ఏమిటి?

RELATED ARTICLES

Most Popular

న్యూస్