ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి లేదని, సిఎం జగన్ అలాంటివి ఏమాత్రం ప్రోత్సాహించరని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. తాము ఇలాంటి వాటి మీద ఆధారపడి పాలన చేయడం లేదని, అడ్డదారిలో వెళ్ళడం సిఎం కు అస్సలు ఇష్టం లేదన్నారు. ఏదైనా ఒక ఆడియో తన దృష్టికి వచ్చినప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ ఒక శ్రేయోభిలాషిగా శ్రీధర్ రెడ్డికి పంపి ఉంటారని సజ్జల అభిప్రాయపడ్డారు. పార్టీతో సంబంధాలుతెంచుకుని వెళ్లిపోతామంటే అది వారి ఇష్టమని, కొత్తనీరు వస్తుందని వ్యాఖ్యానించారు. ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలపై సజ్జల స్పందించారు.
పదవులు దక్కనప్పుడో, తాము అనుకున్నవి కానప్పుడు కొందరికి అసంతృప్తి ఉంటుందని, ఇది సహజమేనని పేర్కొన్నారు. అలాంటి వారిని పార్టీ పిలిచి నచ్చజెబుతుందని, కానీ ఒక స్థాయికి మించి వెళ్ళినప్పుడు తాము చేయగలిగేది ఏమీ లేదని, వేరే పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకొని ఇలా ఆరోపణలు చేస్తే అది వారిష్టమని అన్నారు. ఒకవేళ శ్రీధర్ రెడ్డి తమ వద్దకు వచ్చి ఏదైనా చెబితే దానిపై ఆలోచన చేసేవాల్లమని, కానీ సంకుచిత ఆలోచనలతో నేరుగా మీడియా ముందుకు వెళ్లి మాట్లాడిన తరువాత ఇంకా మాట్లాడాల్సింది ఏముంటుందని సజ్జల ప్రశ్నించారు. పార్టీ మారుతున్నట్లు శ్రీధర్ రెడ్డి ముందే చెప్పారని అలాంటప్పుడు ఏమి చేస్తామని, ఇది తమకూ కలిసొచ్చే అంశమేనని, ముందే బైట పడ్డారు కాబట్టి వారి స్థానంలో కొత్త నాయకత్వాన్ని తయారు చేయడానికి ఉపయోగపడుతుందని సజ్జల వివరించారు.
Also Read : ట్యాపింగ్ ముమ్మాటికీ నిజం: శ్రీధర్ రెడ్డి