Saturday, November 23, 2024
HomeTrending Newsఎల్లుండి నుంచి గొర్రెల పంపిణీ

ఎల్లుండి నుంచి గొర్రెల పంపిణీ

పూర్తిస్థాయిలో వాటా సొమ్ము చెల్లించిన లబ్దిదారులకు ఈ నెల 24 వ తేదీ నుండి గొర్రెల యూనిట్లను పంపిణీ చేయనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని కార్యాలయంలో పశుసంవర్ధక, మత్స్య శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్య, షీఫ్ ఫెడరేషన్ MD రాంచందర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కరోనా మహమ్మారి కారణంగా గొర్రెల పంపిణీ కార్యక్రమానికి కొంత విరామం ఏర్పడిందని వివరించారు. పెరిగిన గొర్రెల యూనిట్ ధరకు అనుగుణంగా 2,797 మంది లబ్దిదారులు గతంలో చెల్లించిన వాటా కు అదనపు నిధులు (రూ.12,500) చెల్లించారని, వారికి ఈ నెల 24 వ తేదీ నుండి గొర్రెల యూనిట్లను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. DD చెల్లించిన మిగిలిన లబ్దిదారులు కూడా అదనపు లబ్దిదారుడి వాటా ధనాన్ని చెల్లించి గొర్రెల యూనిట్లను పొందాలని కోరారు.

చేప, రొయ్య పిల్లల పంపిణీ ని వేగవంతం చేయాలి

ఉచిత చేప, రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేసి నవంబర్ 15 నాటికి 100 శాతం లక్ష్యాన్ని సాధించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలతో  చెరువులు, రిజర్వాయర్  ల నుండి నీటి ఓవర్ ఫ్లో కారణంగా చేప, రొయ్య పిల్లల విడుదల కొంత నెమ్మదిగా జరుగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు 13,043 నీటి వనరులలో 32.26 కోట్ల చేప పిల్లలను 5 రిజర్వాయర్ లలో 12.60 లక్షల రొయ్య పిల్లలను విడుదల చేసినట్లు వివరించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్న చేప, రొయ్య పిల్లలను మాత్రమే విడుదల చేయాలని, విడుదల ప్రక్రియను తప్పకుండా వీడియో, ఫోటోగ్రఫీ చేయాలని ఆదేశించారు. ఎవరైనా నిబంధనలకు విరుద్దంగా  వ్యవహరించినట్లు తమ దృష్టికి వస్తే ఉపేక్షించబోమని హెచ్చరించారు. కొన్ని జిల్లాలలో చేప పిల్లల విడుదల కార్యక్రమం అనుకున్నంత వేగంగా జరగడంలేదని, వాటికి కారణాలను సమీక్షించి నిర్దేశించిన గడువు లోగా పూర్తిస్థాయిలో పంపిణీ చేయాలని ఆదేశించారు.  చేప, రొయ్య పిల్లల విడుదల కార్యక్రమంలో MLA లు, MLC లు, MP లు, రాజ్యసభ సభ్యులు ఇతర ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. మత్స్య ఫెడరేషన్ ద్వారా కోర్రమేను చేప పిల్లల ఉత్పత్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసి నివేదిక అందించాలని మత్స్య శాఖ కమిషనర్ ను మంత్రి ఆదేశించారు. అదేవిధంగా వచ్చే సంవత్సరం ఉచితంగా పంపిణీ చేయనున్న చేప పిల్లలను మన రాష్ట్రంలోనే ఉత్పత్తి చేసేందుకు అవసరమైన చర్యలను ఇప్పటి నుండే చేపట్టాలని చెప్పారు. త్వరలో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి వారి ఆధీనంలో ఉన్న జలవనరుల వద్ద మత్స్య శాఖ కార్యక్రమాలను నిర్వహించడానికి రూపొందించిన అంశాలపై చర్చించి తగు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్