Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఆర్గానిక్ సాగు శ్రీలంక కొంప ముంచిందా?

ఆర్గానిక్ సాగు శ్రీలంక కొంప ముంచిందా?

Sri Lanka’s overnight flip to total organic farming has led to an economic disaster

ప్రకృతంటే కొండలూ, కోనలు, జంతువులు, పక్షులు, క్రిమీకీటకాలు, నదులు, సెలయేళ్లే కాదు… అందులో మనిషీ భాగమే. మనిషి ఉన్నపళంగా తన ఆచార, ఆహారపలవాట్లనూ ఎలాగైతే మార్చుకోలేడో… ప్రకృతీ అంతే. ఎందుకంటే అలవాటు అనే మాటకున్న మహత్యమే అది. మరలాంటి ప్రాక్టీస్ ను ఉన్నపళంగా బంద్ పెట్టి… కొత్త ఎక్సర్ సైజ్ చేయాలంటే అంత వీజీనా…?

హరిత విప్లవం పోకడల నుంచి… సేంద్రీయ విధానానికి వందశాతం ఉన్న పళంగా మారడం సాధ్యమేనా…? దాని పర్యవసానాలెలా ఉండబోతాయన్న చర్చ ఇప్పుడు భారత్ లోనే కాదు… పొరుగుదేశాలనూ కుదిపేస్తోంది.ఇప్పుడంతా ఇన్ స్టంట్. వేడి వేడి ఛాయ్, కాఫీ నుంచి ఇడ్లీ, దోస, కిచ్డీ ఏదైనా నిమిషాల్లో రెడీ చేసుకునే ప్యాకింగ్ లు ప్రతీ సూపర్ మార్కెట్ లో కనిపిస్తూనే ఉన్నాయి. మరలాంటి ఆహారాన్ని అంత ఇన్ స్టంట్ గా కోరుకునే మనిషికి… వాటిని పండించడంలో మాత్రం అంత టైం వేస్ట్ కార్యక్రమమవసరమా…? అదిగో అదే అదనుగా పుట్టికొచ్చిందే హరిత విప్లవం. వ్యవసాయంలో యాంత్రీకరణ, రసాయనిక, క్రిమిసంహారక మందుల వాడకం, సంకరజాతి వంగడాల వాడకంతో అధిక దిగుబడులను సాధించటమే హరిత విప్లవం.. లేదా సాంధ్ర విప్లవమంటామనీ తెలిసిందే!

1960 తర్వాత భారత్ ఎదుర్కొన్న క్షామాన్ని దృష్టిలో ఉంచుకుని… ఎక్కడో మెక్సికోలో నార్మన్ బోర్లాగ్ నేతృత్వంలో సాధించిన విజయగాధతో… ఎంఎస్. స్వామినాథన్, పి. సుబ్రహ్మణ్యం వంటివారి చొరవతో మనదేశంలో ఈ హరిత విప్లవానికి నాంది పడింది.

ఆ తర్వాత పంజాబ్, యూపీ. ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా వంటి రాష్ట్రాల్లో గోధుమల దిగుబడులు ఎలా పెరిగాయో కూడా ఈ దేశం చూసిందే! దాని కొనసాగింపుగా పుట్టుకొచ్చిన పింక్ రెవల్యూషన్, బ్లూ రెవల్యూషన్, రౌండ్ రెవల్యూషన్, రెడ్ రెవల్యూషన్, యెల్లో రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, గోల్డెన్ రెవల్యూషన్.. ఇలా పలు రకాల ఉత్పత్తుల పెంపు పేరిట పుట్టుకొచ్చిన విప్లవాల సంగతీ సరేసరి!

అయితే ఏ రెవల్యూషనైనా కొద్దికాలమే. సైకిల్ చక్రం తిరిగినట్టుగా పరిస్థితులు మారి… మళ్లీ మూలాల్లోకి తిరిగివెళ్లి వెతుక్కోవడం మానవుడికి అలవాటే. అందుకే.. గత కొద్దికాలంగా హరిత విప్లవ పోకడలతో పెరిగిన రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులతో విభేదిస్తూ.. సేంద్రీయమే ముద్దనే ప్రచారమూ.. దానికి తగ్గ ఆచరణా పెరిగాయి.

అయితే ఉన్నపళంగా ఇన్ స్టంట్ గా పెస్టిసైడ్ షాపుల్లో లభించే యూరియా, ఎరువులు, క్రిమిసంహారక మందులను కాదనుకుని… మన సుభాష్ పాలేకర్ చెప్పినట్టుగా ఓ ఆవును కొనుక్కుని… ఆవు పేడతో తయారయ్యే జీవామృతం, ఘనామృతాలను తయారు చేసుకుని సాగు చేసే వారి సంఖ్య ఎంత ఉంటుంది…? లెక్క పక్కాగా లేకపోయినా… రసాయినిక ఎరువులతో సాగు చేసేవారి కంటే తక్కువే!

అయితే ఇదే క్రమంలో ఆర్గానిక్ వ్యవసాయంతో పంటలను పండించడం వల్ల…వి ఒంటికి మంచి పోషకాలనివ్వడంతో పాటు… భూసారం దెబ్బ తినకుండా ఉంటుంది. ఈ క్రమంలో 1961-2000 మధ్య జరిగిన హరిత విప్లవానికి ధీటుగా… ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులు ప్రాంతాలకతీతంగా మొగ్గు చూపుతున్నారు. ఇది మన దేశంలో మరింత హెచ్చు స్థాయిలో ఇప్పటికే అమల్లోకొచ్చింది కూడాను!

అయితే భారత్ తో పాటు… శ్రీలంక, భూటాన్ వంటి పొరుగుదేశాలు కూడా వందశాతం సేంద్రీయ సాగు పద్ధతులను తమ దేశాల్లో తీసుకొస్తామని ప్రకటించడంతో పాటు… ఆ దిశగా అడుగులేస్తున్నాయి. ఆర్గానిక్ కల్టివేషన్ కు ఎవరూ ససేమిరా అనకపోయినా… ఉన్నపళంగా ఇంతకాలం రసాయినిక ఎరువులతో పండించిన పంటలన్నింటినీ వందశాతం సేంద్రీయం పేరుతో మళ్లించడంపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు కూడా పెదవి విర్చే పరిస్థితి తలెత్తింది.

ఆహారభద్రతకే ప్రమాదమని… దేశీయ ఆర్థిక వ్యవస్థలనే అతలాకుతలం చేసే పనంటూ ఉన్నపళంగా వందశాతం సేంద్రీయ వ్యవసాయాన్ని వ్యతిరేకిస్తున్నారు వారు.

శ్రీలంక వంటి దేశాల్లోనైతే ఏకంగా రసాయినిక ఎరువుల వాడకంపై నిషేధం విధించి.. పూర్తిగా సేంద్రీయ వ్యవసాయమే చేయాలంటూ రాజపక్సే సర్కార్నోటిఫికేషన్ జారీ చేయడం ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా టీపొడి, దాల్చినచెక్క, మిరియాల వంటి ఉత్పత్తులకు పెట్టింది పేరైన శ్రీలంకలో ఈ విధానాలు ఇప్పుడు తీవ్రంగా ప్రభావం చూపుతాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలూ, అగ్రికల్చర్ ప్రొఫెసర్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఏ దేశమైనా… ఏ ప్రభుత్వమైనా… మనిషి తన అలవాట్లను మార్చుకునేందుకు కనీసం ఎంత సమయమైతే పడుతుందో.. ఆ లెక్కలోనైనా ప్రకృతి గురించి.. పంటసాగు చేసే రైతుల గురించి ఆలోచించాల్సి ఉందంటున్నారు మేధావులు. నిపుణులతో నేల స్వభావాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేయించడం.. ఎక్కడవసరమో అక్కడ మాత్రమే సేంద్రీయ సాగును ప్రోత్సహించడం ద్వారా… ఉత్పాదకతతో పాటు సుస్థిరమైన సాగును కొనసాగించవచ్చన్నది వారి అభిప్రాయం. ఎందుకంటే ఇప్పటికే ఉండే రసాయినిక నిల్వలు రైతులకు బాసటవుతాయి. మొత్తంగా వందశాతం సేంద్రీయమంటే అది కుదరని పనని వారు హెచ్చరిస్తున్నారు. అందుకే భూటాన్ ను ఓ ఉదాహరణంగా చూపిస్తున్నారు శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు.

2020 వరకూ పూర్తిగా సేంద్రీయ విధానంలోనే సాగు చేయాలని 2008లో లక్ష్యాన్ని నిర్ణయించుకున్న భూటాన్… తదనంతరం ఏర్పడ్డ ఆహార సంక్షోభంతో 2018లో తన పంథాను మార్చుకుంది. దిగుబడులు తగ్గడంతో పాటే… దిగుమతులు పెరగడం వల్ల ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభం భూటాన్ ని కుదిపేసింది. అందుకే తన లక్ష్యాన్ని భూటాన్ ఇప్పుడు 2035కి మార్చుకుంది.

అయితే సేంద్రీయసాగును వందశాతం అమలు చేసిన ప్రాంతాలు లేవా అంటే…? అందుకు మనదేశంలోని సిక్కిం రాష్ట్రమే ఓ ఉదాహరణ. 2003లోనే సిక్కిం ఈ నిర్ణయం తీసుకోగా… 2016 వరకే సిక్కిం పూర్తిగా సేంద్రీయ పద్ధతుల్లో సాగు చేసే రాష్ట్రంగా గుర్తింపు పొందింది. అయితే ఆది నుంచీ రసాయినిక ఎరువుల వాడకంలో అప్రమత్తంగా ఉన్న సిక్కిం వంటి రాష్ట్రానికే పూర్తిగా సేంద్రీయం వైపు మొగ్గడానికి 13 ఏళ్లు పట్టిందంటే… శ్రీలంకలో ఉన్నపళంగా సేంద్రీయ వ్యవసాయం చేయాలంటే అంత సులువా అన్న నిపుణుల ప్రశ్నలకు… ఇప్పుడా ప్రభుత్వం దగ్గర శాస్త్రీయ సమాధానాలు లేవు. అందుకే… ఏ దేశమైనా, ప్రాంతమైనా.. మొత్తంగా ఒకేసారి మార్పు కోరుకోవడం వల్ల ఓవర్ నైట్ లో లక్ష్యాలను సాధించలేకపోగా… వాటి పర్యవసానాలు ఆయా దేశాల ఆహరభద్రతకూ, ఆర్థికభద్రతకూ విఘాతం కల్గించే అవకాశాలే ఎక్కువన్నది స్థూలంగా వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తల నిశ్చితాభిప్రాయం!

-రమణ కొంటికర్ల

Also Read:

సార్ పోస్ట్!

Also Read:

పండోరా బాగోతం

Also Read:

ఫార్మా కంపెనీల లీలలు

Also Read:

RELATED ARTICLES

Most Popular

న్యూస్