Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅజారుద్దీన్ నిర్లక్ష్యం

అజారుద్దీన్ నిర్లక్ష్యం

‘Block’ Market: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్- హెచ్ సి ఏ అధిపతిగా అజారుద్దీన్ నిర్లక్ష్యం, వైఫల్యం వల్ల అభిమానుల ఎన్ని కాళ్లు విరిగాయి? ఎన్ని చేతులు దెబ్బలు తిన్నాయి? ఎన్ని వీపులు విమానం మోత మోగాయి? ఎన్ని వేల కాళ్లు చెప్పుల్లేనివై నడిరోడ్డు మీద పరుగులు పెట్టాయి? ఊపిరి ఆగిన ఎంతమంది వీరాభిమానులకు పోలీసులు నోట్లో ఊపిరి ఊది బతికించారు? చిటికెలో అమ్ముడుబోయిన దాదాపు 12 వేల టికెట్లు బ్లాకా? వైటా? సక్రమమా? అక్రమమా? 21 వేల టికెట్లు ఒక్క సెకనులో అమ్మగలిగిన అజారుద్దీన్ జింఖానా గ్రౌండ్ లో పేటిఎం కౌంటర్లను ఎందుకు తెరిచారు? ఆ పెట్టిన నాలుగు కౌంటర్లలో ఒక కౌంటర్లోనే సిస్టం పని చేసి…మిగతా మూడు కౌంటర్లు నామ్ కే వాస్తే కావడం కాకతాళీయమేనా? ఉద్దేశపూర్వకమా? బ్లాక్ లో అయిదు వేల రూపాయల వరకు ఒక్కో టికెట్టు అమ్ముకున్నదెవరు?

మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం…
ఇంతటి విషాదం, ఒత్తిడిలో కూడా తెలంగాణ క్రీడా మంత్రి దాదాపు 200 టికెట్లు/పాసులు కావాలని లేఖ రాయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

క్రీడాభిమానులు పెట్టిన మూడు కేసుల ప్రకారం అజారుద్దీన్ మీద చర్యలు ఉంటాయా? లేక సినీ తారల మాదక ద్రవ్యాల కేసుల్లా ఇది కూడా ఎటూ తేలకుండా ఉండిపోతుందా?

హెచ్ సి ఏ అవినీతి, అక్రమాలు, అరాచకాల సంగతి తేల్చాల్సిందెవరు? తేలేది ఎప్పటికి?

అంత తొక్కిసలాట, అభిమానులు అంతగా గాయపడ్డాక అజారుద్దీన్ అనాల్సిన మాటలేనా అవి?

మనిషి ప్రాణానికి అజారుద్దీన్ దృష్టిలో విలువ లేకపోవచ్చు. ఒక పార్టీలో పదవులు అనుభవించి ఇప్పుడు మరో పార్టీ ప్రాపకంతో హెచ్ సి ఏ కిరీటం ఆయన నెత్తిన పెట్టుకుని ఉండవచ్చు. ఇదే ఆస్ట్రేలియా- ఇండియా ట్వంటీ ట్వంటీ రెండు మ్యాచ్ లు హైదరాబాద్ కంటే చిన్న నగరాలయిన నాగపూర్, మొహాలీలో జరిగినప్పుడు లేని రాద్ధాంతం, తొక్కిసలాట, అయోమయం, లాఠీ ఛార్జ్ లు ఇక్కడే ఎందుకు జరిగాయో ప్రపంచం తిరిగిన అజారుద్దీన్ కు తెలియదా?

దుర్ఘటన తరువాత మీడియాతో సొల్లు కబుర్లు మాట్లాడేంత సమయం తనకు లేదని…మ్యాచ్ పనులు చూసుకోవాలని లెక్కలేనితనంతో మాట్లాడిన అజారుద్దీన్ మ్యాచ్ నిర్వహణకు తదేక దీక్షతో నిద్రాహారాలు మాని చేసిన ఏర్పాట్లేమిటో గాయపడిన అభిమానుల గుండెలనడిగితే తెలుస్తుంది. విరిగిన ఎముకలనడిగితే తెలుస్తుంది. విరిగిన లాఠీలనడిగితే తెలుస్తుంది. ఆగిపోబోయిన ప్రాణాలనడిగితే తెలుస్తుంది. పోయిన హైదరాబాద్ పోలీసుల పరువు, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను అడిగితే తెలుస్తుంది.

దెబ్బలనుండి తప్పించుకోవడానికి అభిమానుల పరుగుల్లో జారిపడ్డ చెప్పులు..చెప్పుకోలేని విషాదాన్ని అజారుద్దీన్ కు అర్థమయ్యేలా చెప్పేవారు లేరు. అజారుద్దీన్ ఆడిన రోజుల్లో ఎలా ఆడాడో…ఎలా ఓడాడో…ఎలా ఓడించాడో…తరువాత సంగతి. ఇప్పుడు మాత్రం అభిమానుల ప్రాణాలతో ఆడుకుంటున్నాడు.

ఏ కెమెరా పట్టుకోవాలి ఇప్పుడు దోషిని?
ఏ థర్డ్ అంపైర్ చెప్పాలి ఇప్పుడు తీర్పు?

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

రాయలసీమకు నామకరణం

Also Read :

భాష గాలిలో దీపం

RELATED ARTICLES

Most Popular

న్యూస్