కెనడాలోని బ్రాంప్టన్‌లోని హిందూ ఆలయంపై భారత్‌కు వ్యతిరేకంగా గ్రాఫిటీ(గోడ రాతలు) వేశారు. దీంతో అక్కడి భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మందిరం గోడలపై ఉన్న హిందూ దేవుళ్ళ బొమ్మలపై రంగులు పులిమారు. ఖలిస్తానీ మద్దతుదారులే ఈ దారుణానికి ఒడిగట్టారని అనుమానిస్తున్నారు. ఆస్ట్రేలియాలో జరిగిన గొడవలకు ప్రతీకారంగా ఖలిస్తానీలు ఈ పని చేసినట్టు హిందూ వర్గాలు ఆరోపించాయి.
గౌరీశంకర్ మందిరంపై గ్రాఫిటీ వేసిన ఘటనను ఖండిస్తున్నట్లు టొరంటోలోని భారతీయ కౌన్సులేట్ జనరల్ పేర్కొన్నారు. కెనడాలో ఉన్న భారతీయుల మనోభావాలను దెబ్బతీసినట్లు కౌన్సులేట్ జనరల్ ఒక ప్రటకనలో తెలిపారు. బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్ కూడా ఈ ఘటనను ఖండించారు. కెనడా అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. విద్వేషపూరిత చర్యలకు ఈ దేశంలో స్థానం లేదన్నారు. ప్రార్థనా స్థలం వద్ద ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలన్నదే తమ ఉద్దేశమని మేయర్ తెలిపారు.
కెనడాలో ఆలయాన్ని ధ్వంసం చేయడం ఇదే తొలిసారి కాదు. 2022 సెప్టెంబర్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నది. స్వామినారాయణ్ మందిర్‌ను యాంటీ ఇండియా గ్రాఫిటీతో ఖలిస్తాన్ తీవ్రవాదులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.