Sunday, May 19, 2024
HomeTrending Newsచట్ట సభల ఔన్నత్యం నిలబడాలి: ధర్మాన

చట్ట సభల ఔన్నత్యం నిలబడాలి: ధర్మాన

Don’t interfere : వ్యవస్థలన్నీ ప్రజల కోసమే ఉన్నాయని…శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు వేటికవే స్వతంత్రంగా వ్యవహరించాలి తప్ప ఒకరి విధుల్లో మరొకరు జోక్యం చేసుకోవడం సరికాదని సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు  అభిప్రాయపడ్డారు.  అమరావతి రాజధానిపై హైకోర్టు తీర్పు తర్వాత ఈ అంశంపై కూలంకషంగా చర్చించాల్సి ఉందని సిఎం జగన్ కు లేఖ రాశానని, ఇదే విషయమై న్యాయ నిపుణులతో కూడా చర్చించానని ధర్మాన అన్నారు.  ఈ విషయమై సభలో చర్చకు అవకాశం కల్పించిన  స్పీకర్ కు ధన్యవాదాలు తెలిపారు.

గతంలో రాజరిక వ్యవస్థ ఉండేదని,  రాజు ఏది చెబితే అదే నడిచేదని, అధికారం మొత్తం రాజు దగ్గరే ఉండడంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. కానీ మనం ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామని, అద్భుతమైన రాజ్యాంగం ఆధారంగా పరిపాలన చేసుకుంటున్నామన్నారు.

ప్రభుత్వం మారినప్పుడు దానికి విధానపరమైన నిర్ణయాలు తీసుకునే హక్కు లేదన్నప్పుడు, ఇంకా ఈ ప్రజాస్వామ్యం ఎందుకని ప్రశ్నించారు. గత ప్రభుత్వ విధానాలు నచ్చకనే ప్రజలు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని, కానీ గత ప్రభుత్వ విధానాలు మార్చడానికి వీల్లేదని చెప్పడం దేనికి నిదర్శనమన్నారు, అలాంటప్పుడు ఎన్నికలు అవసరం లేదని, ప్రభుత్వాలు మారాల్సిన అవసరం లేదన్నారు.

ప్రజలు ఆత్మార్పణ చేసి సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరించవద్దని  అందరూ కోరుతుంటే, ఇది విధాన నిర్ణయమని కేంద్రం చెబుతున్న విషయాన్ని గమనంలోకి తీసుకోవాలన్నారు.  సరళీకృత ఆర్ధిక విధానాలు, రాజాభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ, ఆడపిల్లలకు ఆస్తి  హక్కు లాంటివి శాసనసభ తీసుకున్న విధాన నిర్ణయాలేనని గుర్తు చేశారు.

చట్టసభల ఔన్నత్యాన్ని కాపాడాల్సిన అవసరంసభ్యులుగా  మనందరిపై ఉందని,  చట్ట సభల విధాన నిర్ణయాల్లో తప్పులు ఉంటే సవరించవచ్చని, కానీ నిర్ణయాన్ని తప్పుబట్టడం సరికాదని చెప్పారు. ప్రజల ఆవేదనలను, వారి సమస్యలను తీర్చగలిగిన అవకాశం ఉంటుందన్నారు.  చట్ట సభల శక్తి తగ్గిపోకుండా చూడాల్సిన అవసరం అందరిపై ఉందని, వ్యవస్థను రక్షించడంలో అందరం తమ బాధ్యతను నెరవేర్చాలని ధర్మాన విజ్ఞప్తి చేశారు.

Also Read : అమరావతి ‘యాక్ట్ అఫ్ పార్లమెంట్’: లోకేష్

RELATED ARTICLES

Most Popular

న్యూస్