టి20వరల్డ్ కప్ కు సన్నాహకంగా నేడు ఆస్ట్రేలియాతో జరిగిన వామప్ మ్యాచ్ లో ఇండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్రిస్బేన్ లోని గబ్బా స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఆసీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.
ఇండియా తొలి వికెట్ కు 78 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్ 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ వెంటనే కెప్టెన్ రోహిత్ శర్మ (15) కూడా పెవిలియన్ చేరాడు. సూర్య కుమార్ యాదవ్ కూడా అర్ధ సెంచరీ (50) చేసి వెనుదిరిగాడు. కోహ్లీ-19, దినేష్ కార్తీక్ -20 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో కేన్ రిచర్డ్సన్ నాలుగు, స్టార్క్, మాక్స్ వెల్, అగర్ లు తలా ఒక వికెట్ పడగొట్టారు.
లక్ష్య ఛేదనలో ఆసీస్ ధాటిగానే మొదలు పెట్టింది. 41 పరుగుల వద్ద ఓపెనర్ మిచెల్ మార్ష్ (35) ఔటయ్యాడు. కెప్టెన్ ఆరోన్ పించ్ 54 బంతుల్లో 7ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులు చేసి 19వ ఓవర్ తొలి బంతికి ఔటయ్యాడు. మిగిలిన వారిలో మాక్స్ వెల్-23; స్టీవ్ స్మిత్-11మాత్రమే కాస్త ఫర్వాలేదనిపించారు. చివరి ఓవర్లో విజయానికి 11 పరుగులు అవసరం కాగా, షమీ వేసిన ఆ ఓవర్లో తొలి రెండు బంతులకు కమ్మిన్స్ నాలుగు పరుగులు సాధించాడు. ఆ తర్వాతి బంతికే కోహ్లీ బౌండరీ లైన్ వద్ద పట్టిన అద్భుత క్యాచ్ కు కమ్మిన్స్ ఔటయ్యాడు. మిగిలిన మూడు బంతులకు కూడా మరోమూడు వికెట్లు పడ్డాయి. దీనితో ఇండియా ఆరు పరుగులతో విజయం దక్కించుకుంది.
ఇండియా బౌలర్లలో షమీ-3; భువనేశ్వర్ రెండు; అర్ష్ దీప సింగ్, యజువేంద్ర చాహల్, హర్షల్ పటేల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
Also Read : ఆరంభ మ్యాచ్ లో లంకకు నమీబియా షాక్