Saturday, July 27, 2024
HomeTrending NewsPV NarsimhaRao: కాంగ్రెస్ కృతజ్ఞత లేని పార్టీ - ఎమ్మెల్సీ కవిత

PV NarsimhaRao: కాంగ్రెస్ కృతజ్ఞత లేని పార్టీ – ఎమ్మెల్సీ కవిత

కాంగ్రెస్ కృతజ్ఞత లేని పార్టీ అని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. దేశానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చేసిన సేవలను మరచిపోవడమే కాకుండా మరిపించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసిందని ధ్వజమెత్తారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చి గాడిలో పెట్టిన మహోన్నత వ్యక్తి పీవీ కొనియాడారు. సోమవారం నిజామాబాద్ లో బ్రాహ్మణ సమాజం ఏర్పాటు చేసిన పీవీ నరసింహారావు విగ్రహాన్ని కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ….

కాంగ్రెస్ పార్టీ చేసిన ఘనకార్యాల వల్ల దేశ ఆర్థిక పరిస్థితీ లో మొత్తం కుధేలైన సందర్భంలో పీవీ నరసింహా రావు ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారని తెలిపారు. విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్న బంగారం కుదవపెట్టి అన్నమోరామచంద్ర అనుకుంటున్న క్లిష్టసమయంలో ప్రధాని అయిన పీవీ కేవలం తన మేధో సంపత్తితో ఆలోచన చేసి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని వివరించారు. ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా నియమించుకొని కొత్త ప్రయోగాలకు పూనుకున్నారని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బహుళజాతి కంపెనీల నుంచి పెట్టుబడులు ఆకర్శించేందుకు ధైర్యంగా చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఆనాడు పీవీ తీసుకున్న చర్యల వల్ల ఈ రోజు లక్షలాది మంది బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయని, కోట్లాది కుటుంబాలు దారిద్ర్య రేఖ నుంచి పైకి ఎగబాకాయన్న విషయం భారత దేశంలో ఎప్పటికీ మర్పిపోదని స్పష్టం చేశారు. కానీ అటువటి విషయన్ని కూడా మరిచి పోయి మరిపించే ప్రయత్నం కాంగ్రెస్ చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ బిడ్డను గుర్తించకపోతే సీఎం కేసీఆర్ పట్టుదలతో శతజయంతి ఉత్సవాలను నిర్వహించారని చెప్పారు.

పీవీకి 65 ఏళ్ల వయస్సు నిండిన తర్వాత దేశానికి కంప్యూటర్లు వస్తే తన కోసం, తాను పది మందికి పనికి రావడం కోసం కంప్యూటర్ వాడకాన్ని నేర్చుకున్నారని కొనియాడారు. సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఇలా ఎవ్వరిదీ చిన్న పదవి కాదని, సమాజాంలో అందరికీ పాత్ర ఉంటుందని స్పష్టం చేశారు. నిబద్ధతతో పనిచేస్తూ పోతే కచ్చితంగా అవకాశాలు వస్తాయన్న నమ్మకంతో ముందుకుసాగితే పీవీ నరసింహా రావు స్థాయికి ఎవరైనా చేరుకుంటామన్న విశ్వాసం తనకు ఉందని ప్రకటించారు.

నిజామాబాద్ జిల్లాలోని బోర్గాం (పి )చౌరస్తా వద్ద భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, పివినరసింహారావు కొడుకు పివి ప్రభాకర్ రావు, కూతురు ఎమ్మెల్సీ సురభి వాణి, తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్, నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘ సభ్యులు వేదమంత్రాలతో పూర్ణకుంభంతో అతిథులకు పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత, పివినరసిం హారావు కొడుకు పివి ప్రభాకర్, కూతురు ఎమ్మెల్సీ సురభి వాణిలు పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఆవిష్కరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్