Sunday, January 19, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఅతడు అడవిని జయించాడు

అతడు అడవిని జయించాడు

Real Mind-blowing Movie : కథలో స్థానికత ఎంత బలంగా పనిచేస్తుందో తెలియాలంటే “కాంతార” చూడాలి.

చరిత్ర, కల్పన, జానపదం, డ్రామాలను నాలుగింటిని ఒడుపుగా ఎలా మేళవించి కనువిందు చేయవచ్చో తెలుసుకోవాలంటే “కాంతార” చూడాలి.

కాలం కప్పుకున్న వింత వింత పొరల్లో చింతలు; సంతోషాలు; నమ్మకాలు; ఆచారాలు; చిన చేపను పెద్ద చేప మింగడాలను; తమదయిన నేలనో, గాలినో, ధూళినో, నీటినో, మాటనో, పాటనో, గోడలు లేని కోటనో పట్టుమని పది మంది పట్టుబట్టి కాపాడుకోగలిగే అస్తిత్వ ఆరాటాన్ని పోరాట దృశ్యంగా చూడాలనుకుంటే “కాంతార” చూడాలి.

సహజమయిన జానపద వాద్య పరికరాల వీనుల విందు కావాలంటే “కాంతార” చూడాలి.

పాటలను తోసిరాజని ప్రతి సన్నివేశాన్నీ రీ రికార్డింగ్ నేపథ్య సంగీతం ఎంతగా ఆకాశానికెత్తగలదో తెలుసుకోవాలంటే “కాంతార” చూడాలి.

వేద మంత్రాలేవీ తెలియకపోయినా…అవైదిక సంప్రదాయంలో అరుపులు, కేకలు, పూనకాలతో గ్రామ దేవతలను అదే వేదం ప్రతిపాదించే స్ఫూర్తితో, ఆర్తితో, భక్తితో, పవిత్రతతో కొలిచిన మన పూర్వపు మూల వాసుల గురించి తెలుసుకోవాలంటే “కాంతార” చూడాలి.

రాచరికం, రాజ్యాలు పోయి మనకోసం, మన చేత…మనమే ఎన్నుకున్న అందరూ సమానం అనుకునే పారదర్శక ప్రజా ప్రభుత్వాల్లో రాచరికపు వాసనలు, భూస్వాముల దౌర్జన్యాలు కొత్త కొత్త రూపాల్లో ఎలా బుసలు కొడుతున్నాయో తెలుసుకోవాలంటే “కాంతార” చూడాలి.

చేతికి ఎముక లేకుండా ఖర్చు పెట్టి…నూట యాభై కోట్లతో సినిమా తీసి పదిహేను కోట్లు మాత్రమే రాబట్టుకుని…నెత్తిన గుడ్డ వేసుకుని విలపించే హీరో పాదాక్రాంత పాద ధూళి నిర్మాతలతో పోలిస్తే…
పదిహేను కోట్ల ఖర్చుతో వందల కోట్లు రాబట్టే సినిమాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే “కాంతార” చూడాలి.

బాహుబలి వన్, టూ, త్రిబుల్ ఆర్ లతో తెలుగు సినిమాను భారతీయ సరిహద్దులు దాటించి ప్రపంచ సినిమా యవనిక మీద రెపరెపలాడిస్తున్న రాజమౌళి వేసిన దారి ఇప్పుడు ఇతర భాషల్లో ఎందరికో దారి దీపం.

Kantara

కన్నడ సినిమా సృజనాత్మకత, వ్యాపార విస్తృతి, ఇతరభాషల్లో దానికి అంగీకారం జానా బెత్తెడుకు తక్కువ అని అనుకునే చోట కే జి ఎఫ్ వన్, టూ బంగారు పంటలను పండించాయి. ముఖే ముఖే సరస్వతి…తెలివయిన వారు ఎక్కడయినా ఉంటారని రుజువు చేశాయి. అంతర్జాతీయ సినిమా కళ్లు కన్నడ వైపు పడేలా చేశాయి.

బాహుబలి వన్, టూ, కే జి ఎఫ్ వన్, టూ కంటే “కాంతార” గొప్పదా? కాదా? అని పోలిస్తే ఈ దర్శకుడి ప్రతిభను అవమానించినట్లు అవుతుంది. కన్నడ అరేబియా సముద్ర తీరం మంగళూరు ప్రాంతంలో మారుమూల అడవులు, కొండల్లో ఉండే గిరిజన తెగల్లో ఉన్న చిన్న కథను ఇతివృత్తంగా తీసుకుని దర్శకుడు చేసిన అద్భుతం “కాంతార”.

మనల్ను కన్న నేల నెర్రెల్లో చెవి పెడితే వినపడే కథ;
మనం పెరిగిన మట్టిని గట్టిగా కౌగిలించుకుంటే కదిలే కథ;
మన ముందు తరాలవారు పుట్టి…మట్టి అయిన చోట మట్టిని పట్టుకుంటే పుట్టిన కథ;
మనం నమ్మి కొలిచే రాతికి మనసు తగిలిస్తే వచ్చిన శక్తి కథ-
“కాంతార”.

సినిమా కలెక్షన్లు, గ్రాసులు త్రాసులు, స్క్రీన్లు, డబ్బింగ్ రైట్స్ లాంటి సైకో ఫ్యాన్స్ ఉన్మత్త పారిభాషిక పద సామాజిక మాధ్యమ ప్రకోపాల పటాటోపాల జోలికి వెళ్లకుండా…
ఊరికే “కాంతార” చూడండి.

తాతలు తాగిన నేతుల మూతుల వాసనల నీతిబోధల పంచ్ డైలాగుల పద గుంభనాల హీరోలో ఒదిగి కుచించుకుపోయిన కథలనుండి…కాస్త ఉపశమనం కోసం కథలో ఒదిగిపోయిన కాంతార హీరోను చూడండి.

(కన్నడ భాషలో “కాంతార” అంటే ప్రవేశించడానికి వీల్లేని దట్టమయిన అడవి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మహా వృక్షాలతో పాటు పెరుగుతున్న చెట్లు కూడా ఉండి…దారిలేని…గుంతలు, కందకాలతో నిండిన ప్రాంతం)

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

వీరారాధన ఒక జబ్బు

Also Read :

ఆదిలోనే హింసపాదు

RELATED ARTICLES

Most Popular

న్యూస్